maga‘సాహితీ చరిత్రలో అధిక సంఖ్యా కవుల కవితా సంకలనం’ పేరిట దీన్ని 2015 అక్టోబర్‌లో వెలువరించారు. దీన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిచ్చారు. తెలుగు సాహిత్యంలో గోలకొండ కవుల సంచిక 354 మంది కవులతో 1934లో వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంత పెద్ద కవితా సంకలనం ఎవ్వరూ తెలుగులో తేలేదు. నకాషీ వైకుంఠం పెయింటింగ్‌ ముఖచిత్రంగా వెలువడ్డ ఈ 472 పేజీల బృహత్‌ కవితా సంకలనం తెలంగాణ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్‌ని దర్శించింది. భావజాలాలకతీతంగా తెలంగాణ తనాన్ని చాటుకున్నది. జూన్‌ 7, 2015 నాడు రవీంద్రభారతిలోని రెండు ప్రాంగణాల్లో జరిగిన కవిసమ్మేళనంలో పాల్గొన్న 442 మంది కవుల కవితా సంకలనమిది.

ఇందులో తెలంగాణలో ఇంతమంది ఆడవాళ్ళు కవిత్వం రాస్తున్నారా? అనుకునే విధంగా మొత్తం 76 మంది మహిళల కవిత్వమున్నది. ఇదీ ఓ రికార్డే! దాదాపు పదమూడు గంటల పాటు ఉదయం పదిన్నర నుంచి రాత్రి 11.30 వరకు కవులు తమ కవిత్వాన్ని వినిపించారు. ఇందులో తెలంగాణ అమరులపై, బందగీ, పి.వి.నరసింహారావు, అయిలమ్మ, కొమురయ్య, శ్రీకాంతాచారి, కాళోజి, బతుకమ్మ, తెలంగాణ పల్లె, తెలంగాణ తల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, నిర్మల్‌ బొమ్మలు, పాల్కురికి సోమనాథుడు, జయశంకర్‌ సార్‌, తెలంగాణ వెలుగులు, చరిత్ర, రాష్ట్ర చిహ్నాలు, భాగ్యనగరం ఇట్లా ఎన్నో తెలంగాణ మట్టి పరిమళాన్ని అందించే కవితలున్నాయి. చెరువుల గురించి కె.విమల, నిసార్‌, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, సుతారపు వెంకట నారాయణలు, వరుకోలు లక్ష్మయ్య తదితరులు మంచి కవితలందించారు. అలాగే భాష విషయంలో ఇందులో కొన్ని మరిచిపోలేని కవితలున్నాయి. ఇందులో వనపట్ల సుబ్బయ్య ‘అమరవీరులకు గంధమెల్లాలి’ పేరిట రాసిన కవిత తెలంగాణ స్ఫూర్తిప్రదాతలను స్మరించుకోవడమే గాకుండా తెలంగాణ వ్యతిరేకులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిండు.

”తెలంగాణకై తెగించి రాయబడ్డ

కవితా కలాలకే దండలేయాలి

పరిమళించిన నేలపై

అమరవీరులకు గంధమెల్లాలి” అంటూ మొహర్రం పండుగ సందర్భంగా హసన్‌, హుసేన్‌ని ఎట్లా స్మరించుకుంటామో, తెలంగాణ యోధులను కూడా అలాగే స్మరించుకుందామని చెప్పిండు. అట్లాగే సుంకిరెడ్డి నారాయణరెడ్డి

”ముక్కోటిని ఒక్క తాడుగ పేనిన విద్వత్తేజమా

ఎత్తుగడలకు తాడెత్తు పైన నిలిచిన జాతి కేతనమా

కుట్రలు కూలిపోయినవి / స్వప్నం సాకారమయింది

కొలువులను పణం పెట్టి ముచ్చెమటలు పట్టించిన

అన్నా

ఉస్మానియాను కోటగా నిలిపిన తమ్మీ నిర్బంధం నివ్వెరపోయింది

గ్రహణం వీడింది” అంటూ తెలంగాణకు పట్టిన గ్రహణం వీడిన సంగతిని, దానికి రాజకీయ నాయకులు, విద్యార్థులు ఎట్లా తోడ్పడింది రికార్డు చేసిండు. తెలంగాణ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ‘డాక్యుమెంట్‌’ ‘తొలిపొద్దు’.

Other Updates