హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకు పోతున్నది. శరవేగంగా బెంగుళూరును దాటేసింది. తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పనలో బెంగుళూరు కన్నా ముందు వరుసలో ఉన్నది. ‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతోంది, సంస్థలు పారిపోతాయి అంటూ వచ్చిన వదంతులు అసత్యాలని తేలిపోయినాయి. నగరంలో పారిశ్రామికాభివృద్ధి గతంలో కంటే ఊహించనంతగా ముందుకు సాగుతున్నది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 300 నగరాల్లో హైదరాబాద్ 82వ స్థానానికి చేరుకుంది. దక్షిణ భారతదేశం మొత్తంలో చెన్నయ్ తరువాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అదే బెంగుళూరు 98వ స్థానానికి దిగజారింది. తెలంగాణ వస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని జరిగిన ప్రచారం గ్లోబెల్స్ ప్రచారంగా మిగిలిపోయింది.
2009 ` 14 మధ్య కాలంలో తలసరి ఆదాయ పెరుగుదల, ఐటి రంగ అభివృద్ధి, ఉద్యోగాల కల్పన తదితర విషయాల్లో హైదరాబాద్ అభివృద్ధి సూచీ ఎగబాకింది. అమెరికాకు చెందిన బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ జరిపిన సర్వేనివేదిక ప్రకారం 2009`14 మధ్యకాలంలో హైదరాబాద్ తలసరి ఆదాయం 5.2 శాతం పెరిగింది. బెంగుళూరు నగరంలో 4.8శాతమే పెరిగింది. ఉద్యమ సమయంలోనే రాజకీయ అనిశ్చితి నెలకొన్నా ఇంతటి అభివృద్ధి సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. బెంగుళూరు తలసరి ఆదాయం 5,051 డాలర్లు కాగా హైదరాబాద్ నగరంలో ఇది 5,063డాలర్లుగా నమోదైంది.
ది బ్రూకింగ్స్ మెట్రోమానిటర్ ప్రపంచంలోని 300 టాప్ నగరాల్లో ఆర్ధికాభివృద్ధిపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో దక్షిణ భారత దేశంలోని చెన్నై 66వ స్థానంలో నిలవగా, 82వ స్థానంతో హైదరాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచింది. నగరంలోని సమశీతోష్ణ పరిస్థితులు, ఇతర నగరాలతో పోల్చుకుంటే అతితక్కువ జీవన వ్యయం, రవాణ సౌకర్యాలు, అంతర్జాతీయ విమానాశ్రయం తదితర సౌకర్యాలు హైదరాబాద్ నగరంపై ప్రపంచం దృష్టిపెట్టే నగరంగా తయారు చేశాయి. భారీగా ఐటి పరిశ్రమలు ఏర్పాటు కావడం కూడా వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడిరది.
ఈ పరిస్థితులను బట్టి హైదరాబాద్ తనకు తానుగా అభివృద్ధి చెందుతూ వందల ఏళ్ల క్రితమే దక్షిణ భారతదేశంలో పెద్ద వ్యాపార కేంద్రంగా గణతికెక్కిందని స్పష్టం చేస్తోంది. ఇక ముందు తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంతో మరింత అభివృద్ధిలో ముందుకు సాగుతుందనేది సుస్పష్టం.