చేయి తిరిగిన చిత్రకారులు తమ కుంచెలతో అలవోకగా గీసిన చిత్రాలు మనల్ని మంత్రముగ్దుల్ని గావిస్తాయి. అవి కవితా పుష్పాల్లా భావ స్ఫోరకంగా మనల్న పలకరిస్తాయి. బతుకమ్మ నేథ్యంలోని సమకాలీనతకు అద్దంపట్టే విధంగా చూడ చక్కని చిత్రాలతో హైదరాబాద్‌ మసాబ్‌ ట్యాంక్‌లోగల జెఎన్‌.టి.యు నెహ్రూ ఆర్ట్‌గ్యాలరీ కళకళలాడింది. ‘తెలంగాణ జాగృతి’ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్ట్‌ ఫోరమ్‌ సమన్వయ సహకారంతో 3 రోజుల పాటు జరిగిన ‘బతుకమ్మఆర్ట్‌ క్యాంప్‌’ కార్యక్రమం చక్కగా జరిగింది.

బతుకమ్మ అంటే అందరూ కలసి చక్కగా బతుకుదాం అని, అలాగే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సౌభాగ్యాన్ని కోరుకునే గొప్ప పండుగ బతుకమ్మ అనీ, మన తెలంగాణా ప్రాంత మహిళలు ఆయా ప్రాంతాల్లో పూచే పూలతో ఎంతో గొప్ప సంప్రదాయ వేడుకగా జరుపుకునే పూల పండుగ ‘బతుకమ్మ పండుగ’ అని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. అనంతరం మంత్రి ఈ ఆర్ట్‌ క్యాంప్‌లో పాల్గొన్న 50మంది మహిళా చిత్రకారులు వేసిన చిత్రాలను చూసి ఎంతో భావస్ఫోరకంగా, చూడ చక్కగా వున్నాయని కొనియాడారు. పాల్గొన్న వారందరూ మహిళలు కావడం ఆనందదాయకం అన్నారు. బంగారు తెలంగాణ దిశగా మనందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు మనలో దాగివున్న సృజనాత్మక కళను వెలికితీయాలని ఆకాంక్షించారు. ముందు తరాలవారికి మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా చిత్రకళను ప్రోత్సహిస్తున్న నిర్వహకులను, పాల్గొన్న ఆర్టిస్టులను మంత్రి రాథోడ్‌ అభినందించారు.

వివిధ కళాకృతులతో కనిపించే చిత్రాలు మనతో మాట్లాడుతాయని, మన హృదయాలకు హత్తుకుంటాయని అటువంటి చూడచక్కని చిత్రాలు వేశారని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు కొనియాడారు.

మొదటి రోజు ప్రారంభోత్సవానికి ప్రముఖ దినపత్రిక సంపాదకులు కట్టా శేఖర్‌ రెడ్డి, ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞ శర్మ, తెలంగాణ జాగృతి పక్షాన నవీనాచారి, తెలంగాణ ఆర్ట్‌ క్యాంప్‌ ఎం.వి. రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్ట్‌ క్యాంప్‌లో పాల్గొన్న వారందరికి ఆర్ట్‌ క్యాంప్‌ ఆఖరి రోజున సన్మానించి ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేశారు.

-వద్దిరాజు జనార్దన రావు





Other Updates