elephantచేయి తిరిగిన చిత్రకారుడు నరేంద్రరాయ్‌ శ్రీవాత్సవ సృజనాత్మక కవి కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు కమనీయమైన కవితల్లాగ భావస్పోరకంగా ఉంటాయి. అంతేకాదు ఎప్పటికప్పుడు సమకాలీనతకు సైతం అవి దర్పణం పడతాయి

తన శిష్యులు తనను మించిన చిత్రకారులు కావాలనే కాంక్షతో చిట్టిపొట్టి బాలలు మొదలు చిత్రకళలో మోజున్న వయోధికులకు కూడా అలసట లేకుండా, కష్టమనుకోకుండా ఎంతో ఇష్టంతో నిరంతరం చిత్రకళా బోధన చేస్తున్న నరేంద్రరాయ్‌ రెండు తెలుగు రాష్ట్రాలలో వేలాదిమందికి గురువు. హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్‌ బాలల ఉన్నత పాఠశాలలో చిత్రకళ బోధించే అధ్యాపకుడుగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించిన నరేంద్రరాయ్‌ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఏడెనిమిదేండ్లు అక్కడే ఉచితంగా బాలలకు చిత్రకళ నేర్పించారు.

ప్రస్తుతం కేశవమెమోరియల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో యాజమాన్యం ఇచ్చిన గదిలో ఈ వయస్సులోనూ ప్రతిరోజు విద్యార్థులకు చిత్రకళ బోధిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వినూత్న అంశాలతో సృజనాత్మక చిత్రాలను గీస్తూనే ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం దాదాపు ఎనిమిది వేల మందికి ఆయన చిత్ర రచన నేర్పారు. అంతర్జాతీయ స్థాయి శిల్పి రవీందర్‌ రెడ్డి, ప్రముఖ చిత్రకారులు- చిప్పా సుధాకర్‌, శ్రీనివాసాచారి, జి.రామకృష్ణ, ప్రీతి సంయుక్త, సురభి వాణీదేవి లాంటి వారెందరో వారి ప్రియశిష్యులు.

హైదరాబాద్‌నగరంలో రాయ్‌దేవరాజ్‌ – రాందేవి దంపతులకు జన్మించిన నరేంద్రరాయ్‌ శ్రీవాత్సవ బాల్యంలో బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ ప్రేరణలో ప్రభాకర రావు అగర్వాల్‌ చెంత చిత్రలేఖనంలో ఓనమాలు దిద్దారు. ఆ తర్వాత వివేకవర్ధిని విద్యాసంస్థలో చిత్ర కళాచార్యుడు డోంగ్రే వద్ద శిక్షణ పొందాడు. అనంతరం బొంబాయి వెళ్ళి జె.జె. స్కూల్‌లో పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. 1955 నుంచి విడవకుండా చిత్రలేఖనంలో తనవంతు కృషి చేస్తూ పలు చిత్రకళా పోటీలలో పాల్గొని పాతిక దాకా ప్రతిష్ఠా త్మకమైన అవార్డులు పొందారు. వాటిలో 1985లో వారు భోపాల్‌ గ్యాస్‌ విషాదంపై వేసిన ‘బ్లాక్‌ డే’ చిత్రానికి కేంద్ర లలితకళా అకాడమీ అవార్డు ప్రదానం చేసింది. 1964, 1971, 1973, 1975, 1976, 1978, 1982, 1983 లలో ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ అవార్డులు గెలుచుకున్నాడు. 1973లో కలకత్తా ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ అవార్డు వచ్చింది.

1975లో 1980లో అఖిలభారత మినియేచర్‌ పోటీలలో వీరి చిత్రాలకు బహుమతులు వచ్చాయి. 1972లో హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీ బంగారు పతకం గెలుచుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని 2008లో ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ వారి హిందీ లేఖక్‌ పురస్కారాన్ని 2011లో పొందారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ అవార్డు కూడా వీరిని 2004లో వరించింది. ఇంకా ఎన్నో సంస్థలు చిత్ర కారుడుగా, కవిగా వీరిని సత్కరించాయి.

వీరు జలవర్ణ చిత్రాలు, తైల వర్ణ చిత్రాలు వేయడంలో మాత్రమే కాకుండా లఘు చిత్రాల రచనలో, గ్రాఫిక్‌ చిత్రాల రూపకల్పనలో పేరేన్నికగన్నారు. గ్రాఫిక్స్‌లోను ఎచ్చింగ్‌లు, లిథోగ్రాపులు, లినోకట్స్‌, ఉడ్‌కట్స్‌ చేసి తన చతురతను చాటారు. ఈ మధ్యకాలంలో తంజావూరు పెయింటింగ్స్‌ ప్రక్రియలో వారు చేసే దేవుడి చిత్రాలే కాకుండా తన బాణీ చిత్రాలు, జానపద ఫక్కీ చిత్రాలు భలే పసందుగా వేస్తున్నారు. ఇలాంటి చిత్రాలు వేయడంలో బహుశా వీరే ప్రథములు. త్వరలో ఈ తరహా చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసే యోచనలో వీరున్నారు.

లోగడ వీరు వంద ప్రణయ చిత్రాలను ‘అమరుశతక’ శీర్షికన వేసి తన ముద్రను వ్యక్తం చేశారు. అనంతరం పంజాబ్‌పైన, భోపాల్‌ గ్యాస్‌ విషాదంపైన ఎన్నో చిత్రాలు గీశారు. ద్వారం, గణేషుడు, ప్రకృతి, జంతువులు, పక్షులు, ఆకార్‌, సైన్స్‌, నారి, క్రీడాకారులు, శృంగార రస, రాగమాల, పన్నెండు మాసాలు, ప్రేమ కరవు శీర్షికలో ఎంతో వైవిధ్యమైన చిత్రాలు గీసి తన ప్రత్యేకతను చాటారు.

వీరు రూపొందించిన అనేక అపురూప చిత్రాలను రాష్ట్రంలోని దేశంలోని మ్యూజియంలు, అకాడమీలు మాత్రమే కాకుండా పలు దేశాల కళాప్రియులు సేకరించారు. 1965 నుంచి హైదరాబాద్‌, బొంబాయిలలో పలు పర్యాయాలు వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. న్యూ ఢిల్లీ, బొంబాయి, అమెరికా, క్యూబా, జపాన్‌లలో జరిగిన పలు సమష్టి చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొన్నారు.

ముఖ్యంగా నరేంద్రరాయ్‌ కవిత్వంలో మాదిరిగా చిత్రకళలోనూ సమకాలీన అంశాన్ని వస్తువుగా స్వీకరించడం వల్ల కరువు రాక్షసి కరాళ నృత్యానికి అద్దంపడుతూ ఆయన ఎప్పుడో వేసిన చిత్రాలు ఇప్పటికీ కన్నులలో మెదలుతాయి. మండుటెండలకు తపించే భూమాతను ద్యోతకం చేస్తూ ఆయన సాధించిన ‘టెక్చర్‌’ గొప్పగా ఉంది. మంటలను, కంటకాలను, చీకట్లను, చెడిన జీవితాలను, పామరత్వాన్ని, పైశాచిక కృత్యాలను వెల్లడిస్తూ వాడిన వర్ణాలు మదిలో కొడిగట్టిన మంటలను రగిలించే విధంగా ఉన్నాయి.

అట్లాగే ‘సైన్స్‌’ నేపథ్యంలో వేసిన చిత్రాలు వ్యంగ్యరచనా శైలికి చేరువలో ఉన్నాయి. ‘నేత’ శీర్షికన వేసిన చిత్రం ప్రశంసనీయమైంది. ఈ నేతకు వాహనం ఊసరవెల్లిని ఆయన ఖాయం చేశాడు. ‘ప్రేమ ఇతి వృత్తంతో వేసిన చిత్రాల్లో రంగుల మేళవింపు, రేఖల లావణ్యం, భావ శబలత చెప్పుకోదగినవి. ‘నారి’, ప్రకృతి పరంపరలో వేసిన చిత్రాలు కాళిదాసు ‘కుమార సంభవం’, ‘రఘువంశం’ ఆధారంగా గీసిన చిత్రాలు – నరేంద్రరాయ్‌ పనితనానికి, పాండిత్యానికి ప్రతిభాతనానికి మచ్చుతునకలు.

లోగడ ఏసియాడ్‌ సందర్భంగా ‘క్రీడలు’ అంశాన్ని తీసుకొని ఎవరూ అందుకోలేని ప్రమాణాలతో చిత్రాలు వేశారు. ఏసియా ఆఫ్రికన్‌ క్రీడల ప్రారంభాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు వీరితోనే స్వాగత గీతం వ్రాయించుకున్నారు. ఆ గీతాన్ని క్రీడోత్సవాల్లో సుప్రసిద్ద గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఇంకా వీరు వ్రాసిన ఎన్నో గీతాలను, గజళ్లను, సాధనాసర్గం, మధుయోహన్‌ లాంటి గాయకులు పాడగా సిడిలుగా వచ్చాయి. విఠల్‌రావు లాంటి గాయకులు వీరి గజళ్ళను కచేరీలలో పాడేవారు.

కేవలం చిత్రకారుడుగానే కాకుండా సమకాలీన హిందీ సాహిత్యంలో నరేంద్రరాయ్‌ శ్రీవాత్సవ్‌ అలియాస్‌ ‘నరేన్‌’ గొప్ప పేరున్న కవి. ఏడేండ్లుగా ప్రతి నెల వీరు వ్రాసిన పది కవితలు హిందీ మిలాప్‌ దిన పత్రిక ప్రచురిస్తున్నదంటే వారికెంత పాఠకాదరణ ఉందో వేరుగా చెప్పనవసరం లేదు. ఏడేండ్లుగా ప్రతి సోమవారం సాహిత్య పేజీలో వీరి కవిత ‘యుగ దర్పణ్‌’ శీర్షికన ప్రచురిస్తున్నారు. సమకాలీన అంశాన్నీ తీసుకొని వారు తాజాగా వ్రాస్తారు. అట్లాగే వారి ఆదివారం అనుబంధం ‘మిలాప్‌ మజా’లో దక్కనీయాసలో హాస్యప్రధానమైన కవితను కూడా వీరు ఏడెనిమిదేండ్లుగా వరస తప్పకుండా వ్రాస్తున్నారు. గీత్‌, గజల్‌, ఛంద్‌, ముక్తక్‌, దోహ ప్రక్రియలో వీరు ప్రతివారం రచించే రెండు కవితల కోసం పాఠకులు లోగడ తెలుగులో సీరియల్‌ నవల, ధారావాహిక కోసం ఎదురుచూసినట్లుగా చూడటం విశేషం. ‘దక్కనీ’ ప్రక్రియలో ఫలానా అంశంపై వ్రాయమని కూడా పాఠకులెందరో వారికి టెలిఫోన్‌ చేసి కూడా ప్రాధేయపడతారు.

ఇప్పటివరకు వీరు హిందీలో రచించిన ‘ఆంధీంరోంకి ఖిలాఫ్‌’, ‘కుహసేకి ధూప్‌’, ‘రేఖాంకిత్‌ రేఖాయెన్‌’, ‘చేపాల్‌’, ‘నియోఛావర్‌’, ‘క్రాంతికారి’, ‘అప్డికి టుప్డి’, ఎహసాసన్‌కే సాయె -2004′, ‘గీదడ్‌ భాష్కియన్‌’, ‘దింగన’ మొదలగు కవితా సంపుటాలను వెలువరించారు. ఇంకా ఎన్నో కవితలు సంకలనాలుగా రావలసినవి ఉన్నాయి. మధ్య మధ్య దేశ స్థాయిలో తిరిగే హిందీ భాషా కవి సమ్మేళనాల్లో వీరు పాల్గొంటుంటారు. ఒక వంక కవితా రచన, మరో వంక చిత్ర రచనతో, బోధనతో తీరిక లేకుండా కొనసాగుతున్నారు. వీరి కవితపై ఎన్‌.పద్మావతి ఎం.ఫిల్‌ చేసి పట్టా పొందింది.

వీరు కుంచె పట్టిన నాటి నుంచీ ఈ నాటికీ వేలాది చిత్రాలు గీసినా, అప్పుడప్పుడు ఊహల ఉయ్యాలలో ఆయన ఊగినా, తన పాదాన్ని మాత్రం భూగోళం నుంచి తీయడం లేదని నరేంద్ర రాయ్‌ అంటారు. నిజానికి జీవితానికి, కళకు మధ్యగల ఖాళీని భర్తీ చేయడానికి నరేంద్రరాయ్‌ చిత్రకళారచన చేస్తున్నారు కాబోలు అనిపిస్తుంది.

Other Updates