ఆషాడమాసం ప్రారంభంతోనే బోనాల సంబురాలు సందడి చేశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో తొలుత బోనం అందుకునే సాంప్రదాయానుగుణంగా గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల సంరంభాలు దాదాపు రెండు వారాల పాటు కొనసాగి జులై 18న భారీ ఊరేగింపుతో సద్దుమణిగాయి. ఇంతలోనే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల ఉత్సవాలు ఊపందుకుని జులై 25వ తేదీ రంగం (భవిష్యవాణి) కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అట్టహాసంగా జరిగిన ఊరేగింపుతో ఉజ్జయినీ మహంకాళి శాంతించింది. అప్పటికే వారం రోజులుగా బోనాలందుకుంటున్న లాల్ దర్వాజ సింహవాహిని మాతేశ్వరి ఆలయంలో బోనాల ఉత్సవాలు జోరందుకున్నాయి.
అక్కన్న, మాదన్న ఆలయం సాక్షిగా జరిగిన బోనాల సంరంభాలు ఆగస్టు 1న జరిగిన మహాఊరేగింపుతో ఉపశమించగా… యింకా ఈ బోనాల జాతరలు తెలంగాణ వ్యాప్తంగా శ్రావణ మాసాంతం వరకు కొనసాగుతూనే వుంటాయి.