tsmagazine
సాధారణ వర్షపాతం రోజున వంద చదరపు మీటర్ల పై కప్పు ఆవరణలో కురిసిన వర్షపు నీరు … రోజుకు దాదాపు రెండు వేల లీటర్లు ఉంటుంది. ఆ మొత్తం నీటిని భూమిలోకి ఇంకేవిధంగా చేయడానికి కేవలం 6 క్యూబిక్‌ మీటర్ల ఇంకుడుగుంత సరిపోతుంది. ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇంకుడు గుంత నిర్మాణానికి రూ. 3.474/- అవుతుంది. మొత్తం 6 క్యూబిక్‌ మీటర్ల ఇంకుడుగుంత నిర్మించేందుకు సుమారు రూ. 20,000 ఖర్చు అవుతుంది.

మొదట అనుకూలంగా వున్న స్థలంలో, అనువైన పొడవు వెడల్పుతో 2 మీటర్ల లోతుగల గుంతను తవ్వాలి. ఈ గుంత క్రింది నుంచి సగభాగం వరకు 40 మి.మీ. పరిమాణం గల కంకరతోను, పావుభాగం 20 మి.మీ. కంకరతో నింపాలి. తరువాత దానిపై ఒక ఇటుక గోడను నిర్మించాలి. ఆ గోడ లోపల సగభాగం దొడ్డు ఇసుకతో నింపి, మిగిలిన సగభాగం ఖాళీగా వదిలివేయాలి. ఇది పైకప్పు నుండి వచ్చే వర్షపు నీటి గొట్టాన్ని ఆ ఇంకుడుగుంతలోకి పంపాలి.

బోరు బావి ఇంకుడుగుంతల వలన లాభాలు

  •  లోతైన బీటలు బారిన బోరుబావిలోకి నీటిని ఇంకేలా చేస్తుంది.
  • 6 క్యూబిక్‌ మీటర్ల ఇంకుడుగుంతలో ఇంకే నీటి కంటే 5 నుంచి 10 రెట్లు ఎక్కువ నీరు భూమిలోకి ఇంకుతుంది.

ఇంకుడుగుంతల వలన లాభాలు

  •  ఇంటిలో వున్న బోరుబావిలోనూ, చుట్టు పక్కల వున్న బోర్లలో భూగర్భ జలాన్ని పెంచుతుంది.
  • వర్షం ద్వారా రోడ్లపై పారె వరద నీటిని తగ్గిస్తుంది
  • ఎండిపోయిన బోరు బావులు మళ్లీ పని చేస్తాయి.

ఎర్రనేల, ఎక్కువలోతు మొరం వున్న చోట ఇంకుడుగుంత బాగా పని చేస్తుంది. నల్లరేగడి, చౌట నేలలలో ఈ ఇంకుడుగుంతలు పని చేయవు.

బోరుబావి ఇంకుడుగుంత  నిర్మాణం  

పనిచేస్తున్న బోరు బావికి కొద్ది దూరంలో దానికి సమాంతరంగా 60 మీటర్ల లోతులో ఒక బోరు వేసిగానీ, లేదా ఎండిపోయిన బోరుబావిని గానీ ఎంపిక చేసుకోవాలి. వేసిన బోరు బావి కూలిపోకుండా 6 నుంచి 10 మీటర్ల లోతు వరకు పి .వి.సి. పైపును లోపలికి చొప్పించాలి. ఈ బోరుబావి చుట్టూ రెండుమీటర్ల లోతు అనుకూలమైన పొడవు వెడల్పుతో మీటర్‌ లోతు గుంతను తవ్వాలి. ఆ గుంత అడుగుభాగం నుంచి ఒక మీటర్‌ పై వరకు ఆ పి .వి.సి పైపు చుట్టూ 10 మి.మీ. నుంచి 20 మి.మీ. పరిమాణం గల చిన్న చిన్న రంధ్రాలను చేయాలి. ఆ రంధ్రాలు చేసిన ప్రాంతాన్ని ఒక స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ జాలీలో చుట్టాలి. ఆ తరువాత ఆ గుంతను సగభాగం వరకు 40 మి.మీ. పరిమాణం గల కంకరతోను పావు వంతు భాగం 20 మి.మీ పరిమాణం గల కంకరతోనూ నింపాలి. తరువాత దానిపై ఒక ఇటుకతో గోడను నిర్మించాలి. ఆ గోడ లోపల సగం వరకు దొడ్డు ఇసుకతో నింపి మిగిలిన ఆ సగభాగాన్ని ఖాళీగా వదిలివేయాలి. ఇంటి పై కప్పు నుంచి వచ్చే వర్షపు నీటి గొట్టాన్ని ఈ ఇంకుడు గుంతలోకి పంపాలి.

Other Updates