మానవీయకోణంలో స్పందించడం, తెలంగాణను ప్రేమించేవారిని ఆదరించడం తన విధానమని ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి నిరూపించి తమ నైజాన్ని చాటుకున్నారు. నేలతల్లి గుక్కెడు నీళ్ళు చిలకరించకపోతుందా అన్న ఆశతో తన వ్యవసాయక్షేత్రంలో డజన్లకొద్దీ బోర్లు వేసిన బైరెడ్డి రాంరెడ్డి, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో కెసిఆర్‌కు బాసటగా నిల్చి కర్తవ్యదీక్షతో ముందుకుసాగారు. ఈ క్రమంలో రాంరెడ్డిని బోర్ల రాంరెడ్డిగా, తెలంగాణ రైతు వెతలకు ప్రతీకగా ఉద్యమ గమనంలో జరిగిన అనేక సభల్లో కెసిఆర్ ప్రస్తావించేవారు. కష్టాల సేద్యంలో కన్నీటి ఫలసాయానికే పరిమితమై నిలువునా చితికిపోయిన రాంరెడ్డి, ఇటీవల ముఖ్యమంత్రిని అధికార నివాసంలో కలుసుకున్నారు. రాంరెడ్డిని సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి, ఆయనతో కలిసి భోజనం చేశారు. తర్వాత తన వాహనంలో కూర్చోబెట్టుకుని సచివాలయానికి వెంట తీసుకెళ్ళారు. అక్కడ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తన్నీరు హరీష్‌రావులతో పాటు పలువురు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి, రాంరెడ్డిని పరిచయం చేశారు. ఉద్యమ సమయం నుంచీ రాంరెడ్డితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ… దశాబ్దాలకుపైగా సమైక్య పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్నకష్టనష్టాలకు బోర్ల రాంరెడ్డి నిలువెత్తు నిదర్శనమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రైతుల సమస్యలు ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా అధికార నివాసంతోపాటు, సచివాలయంలో ముఖ్యమంత్రి తనపట్ల చూపిన ఆదరణ కలకాలం గుర్తుండిపోతుందని రాంరెడ్డి ఉద్వేగంగా అన్నారు. ఉద్యమం సమయంలో పరిచయమైన తనను గుర్తుపెట్టుకుని ఆదరించిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని ఆయన పేర్కొన్నారు.
మూడు దశాబ్దాలుగా ప్రజా జీవనంలో కొనసాగుతూ అందరి సంక్షేమమే తన ఆశయంగా వ్యవహరించడమే ముఖ్యమంత్రి విధానం. ఆ విధానం బోర్ల రాంరెడ్డి ఉదంతంతో మరోసారి రుజువైంది.