బుద్ధుని జీవిత కాలంలోనే బౌద్ధ ధర్మం తెలంగాణ (తెలుగు నేల)లో ప్రవేశించిందనడానికి త్రిపీఠకాల్లో ఒకటైన సుత్తపీఠకంలోని సుత్తనిపాతంలో భాగమైన పారాయణవగ్గలోని ఒక వృత్తాంతంవల్ల తెలుస్తోంది. అందులోని వివరాల ప్రకారం బావరి అనే ఒక ఋషి ధార్మిక ప్రగతికోసం ఉత్తరాపథంనుండి దక్షిణాపథానికి నాటి 16 మహాజన పదాలలోని దక్షిణ భారతంలోనే ఏకైక అస్సక (అశ్మక) జనపదంలోని గోదావరి తీరానికివచ్చి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల మధ్యగల గోదావరీ నదీ ద్వీపంలో అంటే నేటి నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలంలోని బాదనకీర్తిలో కపిత్తవనంలో స్థిర నివాసానేర్పరచుకొని జీవనం కొనసాగించాడని తెలుస్తోంది. తనకొచ్చిన సంశయాలను తీర్చుకోవడానికి వయోభారంవల్ల తనవద్దగల 16మంది శిష్యులను ఉత్తరాపథంలో ఉన్న తథాగత గౌతమబుద్ధ వద్దకు పంపాడు. వారు ఆనాటి అస్సక జన పదంలోని నేటి బాదనకుర్తి నుండి ములక, మణిశ్మతి, ఉజ్జయిని, విదిశ, కోశాంబి, సాకేతపుర, శ్రావస్థి, కపిలవస్తు, సాతవ్య, కుశినగర, పావ, తదితర ప్రాంతాలగుండా, చివరన వైశాలిలో బుద్ధుడు ప్రవచిస్తున్నాడని తెలుసుకొని అక్కడకువెళ్ళి, తమ గురువు సంశయాలను తీర్చుకొని, సుమారు 15మంది శిష్యులు అక్కడనే బౌద్ధ బిక్షువులుగా ఉండిపోయారు. బావరి ప్రియశిష్యుడు పింగియ మాత్రం తిరిగి వచ్చి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని బావరికి వివరించాడు. అతనికి కలిగిన సంశయాలన్నింటికి బుద్దుని వద్దనుంచి వచ్చిన పింగియ సమాధానాలతో సంతృప్తి చెందిన బావరి బౌద్ధమే అన్ని కాలాలలో, అందరికీ శాంతిని చేకూర్చే ధర్మం అని తెలుసుకొని, తాను బౌద్ధాన్ని స్వీకరించి అక్కడినుండి బౌద్ధ ధర్మ ప్రచారం గావించాడని సుత్తనిపాతంలోని పారాయణవగ్గ మనకు వివరిస్తుంది.
గౌతమబుద్ధుని మహాపరి నిర్వాణం జరిగిన తర్వాత నేడు బోధన్‌గా పిలుస్తున్న నాటి పోథలిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న అస్మకరాజు కూడా బౌద్ధాన్ని తీసుకున్నట్లు చరిత్రకారులవల్ల మనకు తెలుస్తోంది. అలా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే ఉత్తరాదినుంచి దక్షిణాదిలోని తెలంగాణాలోని బాదవకుర్తికి మొదటిసారిగా ప్రవేశించిన బౌద్ధ ధర్మం తర్వాతికాలంలో దక్షిణాపథానికి విస్తరించి, నేటి బాదనకుర్తి, కోటిలింగాల, పాషిగాం, ధూళికట్ట, పెద్దబంకూరు, కొండాపూర్, ఫణిగిరి, గాజులబండ, తుమ్మలాం వర్థమానుకోట, నేలకొండపల్లి, కారుకొండ, నాగార్జునకొండ అంటే గోదావరి తీరంనుంచి కృష్ణా తీరానికి ప్రయాణం చేసి నేటి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి తదితర ప్రాంతాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాలలో బౌద్ధ స్థావరాలు 180కిపైగా ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. తెలంగాణాలో ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవన విధానం ఇప్పటికీ బౌద్ధం పునాదులమీదనే నడుస్తోందనడానికి ఈప్రాంత ప్రజల ప్రేమ, కరుణ, శాంతి తదితర అంశాలే కారణమని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
ఒకనాటి బౌద్ధ ప్రాభవాన్ని మళ్లీ మనం గుర్తు చేసుకుంటూ బౌద్ధ వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పం నుంచి రూపుదిద్దుకొన్నదే నేటి ‘శ్రీపర్వత ఆరామ’. బుద్ధవనంగా ప్రచారం పొందిన ఈ ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు కుడివైపున డ్యాంకు 3 కి.మీ. దూరంలో, నల్గొండ జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 152 కి.మీ. దూరంలో నల్గొండ జిల్లా కేంద్రానికి 60 కి.మీ. దూరంలో ఉన్న బుద్ధవనం చక్కని ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులకు, బౌద్ధ భిక్షువులకు, చరిత్ర కారులకు, ముఖ్యంగా నాగార్జునసాగర్, నాగార్జునకొండను సందర్శించే రాష్ట్రీయ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల బౌద్ధ వారసత్వ ప్రతీకగా మన్ననలను అందుకొంటోంది.
ఇక్కడ నల్లమల కొండల్లోని శ్రీపర్వతం దగ్గరలో కృష్ణా నది ఒడ్డున ఆనాడు ప్రసిద్ధ బౌద్ధ ఆరామం ఉండేది. దాన్నే శ్రీపర్వత ఆరామ అనేవారు. క్రీ.శ. 2వ శతాబ్దంనుంచి ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వత విజయపురిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు నివాసమేర్పచుకొని మహాయాన బౌద్ధ కేంద్రంగా మాధ్యమిక సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేయడంవల్ల ఈ ప్రదేశం నాగార్జునకొండగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ. 5వ శతాబ్దం వరకు కూడా ఈ శ్రీపర్వతం గొప్ప బౌద్ధ సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడికి శ్రీలంక, నేపాల్, టిబెట్‌లనుంచి అలాగే మన దేశం అన్ని ప్రాంతాలనుంచి అధ్యయనం కోసం భిక్షువులు వచ్చేవారు. కాలక్రమంలో దీనిని నందికొండ అని పిలిచారు. ఏలేశ్వరానికి 7 కి.మీ. దిగువన కృష్ణానదిపై అడ్డంగా కట్టిన నాగార్జునసాగర్ ఆనకట్టవల్ల ఏర్పడిన జలాశయంలో నాగార్జునకొండ ముంపునకు గురైంది. జలాశయంలోపల ముంపునకు గురయ్యే ప్రాంతాలను 1954-60 మధ్యకాలంలో కేంద్ర పురావస్తుశాఖ గుర్తించింది. నాగార్జునకొండ మాదిరిగానే చారిత్రక సంపదను కాపాడుకోవడానికి 1955-56లో రాష్ట్ర, కేంద్ర పురావస్తుశాఖలు తవ్వకాలు చేపట్టాయి. నాగార్జునకొండ తవ్వకాలలో బయల్పడిన మహాస్థూపం, స్థూప చైత్యాలు, శిలామండపాలు, బుద్ధుని జాతక కథలతోకూడి శిల్ప ఫలకాలు, సింహళ విహారము వెలుగు చూశాయి. అలాగే ఏలేశ్వరం తవ్వకాలలో ఇటుకలతో నిర్మించిన ఇక్ష్వాకుల కాలంనాటి (క్రీ.పూ. 3వ శతాబ్ధి)నాటి చైత్యం, స్థూపాలు, కృష్ణానది గట్టుకు పరచిన రాళ్ళతో ఏర్పరచిన స్నాన ఘట్టం, సున్నపురాతి శిలా మండపం వెలుగు చూశాయి.
కేంద్ర పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాలలో బయల్పడిన కట్టడాలను నాగార్జునకొండ (ద్వీపము)పై ఐలాండ్ మ్యూజియాన్ని ఏర్పాటుచేసి బుద్ధుని దాతువులను, శిల్పాలను, శిల్ప ఫలకాలను, భద్రపరచి, మిగతా కట్టడాలను పునర్నిర్మాణం చేసినారు. మరి కొన్నింటిని అనువు ప్రాంతంలో (దీర్ఘ చతురస్త్రాకారపు ఆడిటోరియం, విహారాలు) పునర్నిర్మించారు.
రాష్ట్ర పురావస్తు శాఖ చేసిన తవ్వకాలలో లభించిన వస్తువులను శాఖ కేంద్ర కార్యాలయంలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అప్పట్లో డ్యామ్‌నకు కుడివైపున జెట్టి నిర్మించి బోటింగ్ సదుపాయాన్ని ఏర్పరచి నాగార్జునకొండ ఐలాండ్ మ్యూజియాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ డ్యామ్‌కు ఎడమవైపునుంచి బోటింగ్ సదుపాయాలను ప్రారంభించింది.
ఒకప్పుడు బౌద్ధ ధర్మం విస్తృతంగా విరాజిల్లిన నాటి బౌద్ధ స్థావరాలన్ని నేడు వాటి ప్రాభవాన్ని కోల్పోయినా ఆ స్థలాలలో లభించిన బౌద్ధ శిల్పాలు, కొన్ని సంపూర్తిగా, మరికొన్ని అసంపూర్తిగా, ఆయా స్థావరాలకు దూరంగా ప్రపంచంలోని పలు ప్రదేశాలకు తరలించబడ్డాయి. మరికొన్ని అసంపూర్తి తవ్వకాలతో కాలగర్భంలోనే కనుమరుగైనాయి. మరికొన్ని బౌద్ధ స్థావరాలు అసలు వెలుగుకు నోచుకోక భూమి పొరల్లో బౌద్ధ ధర్మం ప్రశాంతంగా కనుమరుగయ్యింది.
ఒక్కమాటలో చెప్పాలంటే బౌద్ధమంటేనే మానవత్వం. మానవులున్నంత వరకు మానవత్వం అవసరముంటుంది కాబట్టి బౌద్ధం ఎప్పటికీ అవసరమే అనే సదాశయంతో నేటి అసంపూర్తి బౌద్ధ స్థలాలన్నింటికి సంపూర్ణత్వం కలిగించాలనే ఉద్దేశ్యంతో, బావరి స్ఫూర్తితో శాతవాహన రాజుల కాలంలో మొగ్గతొడిగిన తొలి తెలంగాణ బౌద్ధ వారసత్వ సంస్కృతికి అద్దంపట్టేలా భావితరాలకు బౌద్ధం అన్నివిధాలా మార్గదర్శనం చెయ్యాలని పర్యాటకాభివృద్ధి సంస్థ రూపుదిద్దుకొంటున్న బృహత్ ప్రణాళికతో ఆనాటి బౌద్ధాన్ని కళ్ళెదుట నిలిపేదే బుద్ధవనం ప్రాజెక్టు (శ్రీపర్వత ఆరామం).
కృష్ణానదికి ఉత్తరాన హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై సాగర్‌డ్యాంకు సుమారు మూడు కి.మీ. దూరంలోనే తెలంగాణ బౌద్ధ వారసత్వ ప్రతీకగా బుద్ధవనం ప్రాజెక్టులో ఆనాటి స్థూపాలంత పెద్దగా ఒక మహాస్థూపాన్ని పునర్నిర్మిస్తే ఈనాటి తరానికి బౌద్ధ వారసత్వం గొప్ప పునరుత్తేజాన్ని ఇవ్వడమేకాకుండా, ప్రజలకు బౌద్ధంవైపు దృష్టి మరలుతుంది. తద్వారా ఈ ప్రాజెక్టు బౌద్ధ వారసత్వ ప్రపంచ పర్యాటక కేంద్రంగా నిలుస్తుందనే ఉద్దేశ్యంతో 274 ఎకరాల విస్తీర్ణంలో రావి ఆకును పోలినట్లుండే ప్రదేశాన్ని ఎంచుకొని ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది.
స్వాగత ప్రదేశము
ప్రధాన రహదారి ముందు భాగంలో పర్యాటకులకు, పార్కింగు, ఫుడ్ కోర్టులు, వసతి సదుపాయాలతో కూడిన నిర్మాణాలతో పాటుగా బుద్ధవనం ప్రధాన ప్రవేశద్వారం వద్ద రెండువైపులా భారీ ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లు (రాతి శిల్పాలు), ప్రవేశ ద్వారానికి రెండువైపులా ప్రాంతీయ కాకతీయ నాట్య శిల్పములు, బతుకమ్మ, సంక్రాంతి ఉత్సవ శిల్ప ఫలకాలను ప్రత్యేక ఆకర్షణగా నిర్మించిన చతురస్రాకారపు నిర్మాణము, అందరినీ ఆకట్టుకునే విధంగా నాలుగువైపులా ద్వారాలను ఏర్పాటు చేయడమైనది.
నాలుగు మూలలుగా ఏర్పడిన ఎనిమిది వైపులందు రాతి శిల్పాలను బుద్ధ్ధుని అష్టమంగళ వస్తువులు, బుద్ధుని గత జన్మల గుర్తులుగా జంతువులు, పక్షులు, బోధివృక్షంవద్ద బుద్ధుని పాదాలు, దంపతీశిల్పాలు, ధూళికట్టలో లభించిన అరుదైన నాగముచిలింద శిల్పం (బుద్ధుని పాదాలతో కూడిన నాగసర్పము), బుద్ధుని దాతువులను పూజించే శిల్పాలు, సిద్దార్థుడు విల్లును పట్టుకొన్నట్లు, పూల గుత్తులను మోస్తున్న చేపలు, తాబేళ్ళు, హంసలు, మొసళ్ళు కనిపిస్తాయి. ఈ శిలా ఫలకాలన్నీ కుడ్య శిల్పాలుగా ఏర్పాటు చేయబడినవి. ఇవన్నీ కొత్తగా చెక్కినవే అయినా అలనాటి ఫణిగిరి, అమరావతి శిల్పకళకు దగ్గరగా ఉంటాయి. చతురస్రాకార శిల్పాలలో మధ్య భాగంలో వృత్తాకారంగా నిర్మించిన ఎనిమిది ఫలకల దిమ్మపై, నాలుగు భుజాల పీఠముపై సామ్రాట్ అశోకుడు బౌద్ధ ధర్మానికి చేసిన సేవకు గుర్తుగా ఉన్నటువంటి ధర్మచక్ర స్థంభము స్వాగత ప్రదేశము (ఎంట్రెన్సు ప్లాజా)లో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. చతురస్రాకార ప్రవేశద్వారానికి కుడివైపున ఫుడ్‌కోర్టులు, ఎడమవైపున పార్కింగు సదుపాయాలతోకూడిన కాటేజీలు తదితర వసతులున్నాయి.
డి.ఆర్.శ్యాంసుందర్‌రావు