నల్గొండ జిల్లా కేంద్రానికి 60 కి.మీ. దూరంలో రూపుదిద్దుకుంటున్న ‘బుద్ధవనం’ పర్యాటకులకు కనువిందు చేయనుంది. బుద్ధవనం ప్రవేశద్వారానికి ఎదురుగా ముందుకు వెళితే, సెక్యూరిటీ టికెట్ కౌంటర్‌లను ఆనుకొని అంతర్గత వలయదారి సుమారు 3 కి.మీ. చుట్టుకొని వస్తుంది. ఈ వలయంలోనివే అష్టాంగమార్గానికి గుర్తులుగా ఎనిమిది బుద్ధుని జీవిత విశేషాలు, జాతక కథలు, స్థూపాలు, మహాస్థూపం తదితర నిర్మాణాలు.
(1) బుద్ధ చరితవనం (జననం నుండి నిర్యాణం వరకు)
అంతర్గత వలయ రహదారిని దాటుకు ముందుకు వెళితే ఎడమవైపున మొదటగా కనిపించేది బుద్ధ చరితవనం. సిద్ధార్థ గౌతముని జీవిత సన్నివేశాలను కళ్ళకు కట్టేవిధంగా తీర్చిదిద్దటం జరుగుతుంది.
2వ విభాగము: జాతకవనం (బోధిసత్వ పార్కు): బుద్ద చరితవనంనుంచి ముందుకుసాగితే ఎడమవైపున గౌతమబుద్దుని గత జన్మలకు సంబంధించిన కథలను వివరించే జాతక కథలను హృద్యంగా శిల్పాలద్వారా తెలియజెప్పే ప్రయత్నం జరిగింది.
3వ విభాగము: ధ్యానవనము (మెడిటేషన్ పార్కు): ధ్యానవనాన్ని సందర్శించే పర్యాటకులకు మానసిక ప్రశాంతతను కల్పించడానికి ఎవరికివారు ధ్యానం చేసుకునేందుకు వీలుగా బుద్ధుని జీవితంతో ముడివడిన 22 రకాల చెట్లను ఇక్కడ నాటారు. క్రీ.శ. 5వ శతాబ్దంలో అప్పటి సింహళరాజైన ధాతుసేనుడు చెక్కించిన బుద్ద రాతిశిల్పాన్ని పోలిన రూపానికి సుమారు 27 అడుగులలో సిమెంటుతో ఇక్కడ నెలకొల్పారు. ఈ విగ్రహం చుట్టూ చతురస్రాకారంలో శ్రీలంకలోని ప్రాంతీయ శిల్ప నమూనాలు, సింహాలు, పూర్ణకుంభాలు, పూలగుత్తులతో స్వాగతం చెబుతున్న శిల్పాలు అర్థచంద్రాకార శిలాఫలకం ధ్యానవనానికి మరింత శోభను చేకూర్చుతున్నాయి.
4వ విభాగము: స్థూపవనము (సూక్ష్మస్థూపాల నమూనాలు) ఈ స్థూపవనంలో మన దేశంతోపాటుగా, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలోని స్థూపాకృతుల వాటివాటి ప్రాంతీయశైలి కట్టడాలకు నమూనా స్థూపాలను నిర్మించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోని స్థూపాలను మధ్యకేంద్రంగా చేసుకొని కార్లే, అజంతా (మహారాష్ట్ర), సాంచీ (మధ్యప్రదేశ్), సారనాథ్ (ఉత్తరప్రదేశ్), మాణిక్యాల (పంజాబ్) స్థూపాలను పశ్చిమ ఆసియా ముఖ్యంగా పర్షియా దేశ స్థూప నిర్మాణాలను పోలి నీటి బుడగ ఆకారంలో ఇతర దేశాలలోని స్థూప నిర్మాణాలకు భిన్నంగా నిర్మించబడినవి.
ఇంకా పనులు ప్రారంభించాల్సిన 3 విభాగాల వివరణ స్థూలంగా….
5వ విభాగము: ఆచార్య నాగార్జున అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం
ఈ విభాగంలో అంతర్జాతీయ దేశాలైన శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్, టిబెట్, భూటాన్, ఇండోనేషియా, తైవాన్, చైనా మరియు జపాన్‌ల పరస్పర సమకారంతో ఒక అంతర్జాతీయ బౌద్ద విశ్వవిద్యాలయం నెలకొల్పి వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ బౌద్ధ వాజ్ఞ్మయ పరిరక్షణ, పరిశోధన, శిక్షణ, ప్రచురణలను నిరంతరాయంగా కొనసాగించాలనే ఉద్దేశ్యం అనునిత్యం వేలాది బౌద్ధ భిక్షువులు, శిక్షకులతో ఈ విశ్వవిద్యాలయం, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే బుద్ధవనంలో ఈ విభాగం అందుబాటులోకి రానున్నది.
6వ విభాగము: కృష్ణాలోయ ప్రాంత బౌద్ధ కట్టడాల నమూనావళి: కృష్ణాలోయలో నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణమునకు పూర్వం ఉన్న కట్టడాలు, నాగార్జునకొండకు తరలించి పునర్నిర్మించినవి. లోయలో మునిగిన బౌద్ద కట్టడాల నమూనాలతో కూడిన నిర్మాణాలను ఇక్కడకు వచ్చే పర్యాటకులకు అప్పటి బౌద్ధ కట్టడాలను పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మించాల్సి ఉంది.
7వ విభాగము: తెలంగాణా నేలపై బౌద్ధం (తెలుగునేల): ఈ విభాగంలో ముఖ్యంగా గోదావరి నదీ తీరంనుంచి దిగువన క్రిష్ణానదీ తీరం వరకు విలసిల్లిన బౌద్ధ ప్రాభవాన్ని, బౌద్ధం తెలుగునేలపై అడుగిడి, వివిధ ప్రదేశాలకు విస్తరించి, అంతరించిపోయిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా రూపుదిద్దుకోబోతున్న ‘తెలంగాణ నేలపై బౌద్ధం’ అనే విభాగం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు గత ప్రాభవాన్ని కళ్ళముందుంచుతుంది.
8వ విభాగము: మహాస్థూపము
భావితరాలకు మరోసారి బౌద్ధగత వైభవ ప్రాభవాన్ని చవిచూపే ప్రయత్నమే ఈ మహాస్థూప నిర్మాణ ప్రత్యేకత. 140 అడుగుల వెడుల్పు (42 మీటర్ల వ్యాసం), 70 అడుగుల ఎత్తు (21 మీటర్ల ఎత్తు)తో నిర్మించిన ఈ మహాస్థూపం దక్షిణభారత దేశంలోనే అతి పెద్దది. స్థూపం కింది అంతస్తులో బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించేలా పురావస్తుశాఖ ఏర్పాటు చేసిన మ్యూజియంలో బౌద్ధ శిల్పాలు, అజంతా వర్ణచిత్రాలు (నిజాం కాలంలో మహ్మద్ జలాలొద్దీన్, సయ్యద్ అహమ్మద్ చిత్రకారులు స్వయంగా వేసినవి). అలాగే వజ్రాయాన బౌద్ధ చిత్రాలతో కూడిన టిబెటిన్ వస్త్రాలు (టిబెటన్ టంకాస్) ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేయబడినవి. అలాగే మరోవైపు అన్ని ఆధునిక సదుపాయాలతో సమావేశ మందిరము (శ్రవణ, దృశ్యం మాధ్యమాలతో) ఏర్పాటు చేయబడినవి.
మహాస్థూపంలోపలి భాగంలో అర్థచంద్రాకార ఉపరితలంపై బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే వర్ణచిత్రాలు, స్థూప మధ్యభాగంలో ఎత్తైన వేదికపై ఘంటాకార స్థూప నిర్మాణము, మహాస్థూపంలోకి వచ్చే పర్యాటకులకు బౌద్ధ ఆధ్యాత్మికతను పంచేవిధంగా నాలుగువైపులా నాలుగు భూస్పర్ష, ధ్యాన ధర్మ చక్ర ప్రవర్తనా, అభయముద్రలతో కూడా బుద్దుని లోహశిల్పాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
ఒకప్పుడు ‘బుద్ధం శరణం గచ్చామి’ అంటూ బౌద్ధ పరిమళాలు వెదజల్లిన నేలలో సిద్దార్థుని జననంనుంచి నేటి సామాజిక బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా, ఒకే ప్రదేశంలో సుమారు రెండు లక్షల శిల్పాలను, బుద్దుని జీవిత ఘట్టాలుగా, జాతక కథలుగా చూడగలిగితే, ప్రపంచంలోని బౌద్ధారామాలను పోలిన స్థూప వనాన్ని చూసి తరించగలిగితే, సంవత్సరం పొడవునా బౌద్ధ సదస్సులు, సమావేశాలతో, బౌద్ద భిక్షుల ప్రశాంత ధ్యానంతో కళకళలాడే బుద్దవన మహా స్థూప ప్రాంగణాన్ని మన కళ్ళెదుట ఆవిష్కరించుకోగలిగితే బౌద్ధాన్ని ఆరాధించి, ఆచరించాలనుకునేవారికి ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది.
నాగార్జునసాగర్, నాగార్జునకొండను సందర్శించే,దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులతో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొని మరో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఈ బుద్దవనం (శ్రీపర్వతా ఆరామ) చరిత్రలో నిలిచి తెలంగాణా బౌద్ధవారసత్వ ప్రతీకగా బౌద్ధాన్ని మళ్లీ పల్లవింపజేస్తూ బౌద్దానికి ఒక అంతర్జాతీయ వేదిక అవుతుందనడంలో సందేహంలేదు.
డి.ఆర్. శ్యాంసుందర్‌రావు