ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో బ్యాంకుల పాత్ర గణనీయంగా పెరుగుతున్నదని, దీనికి తగ్గట్లు బ్యాంకులు సంస్థాగతంగా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కేె. చంద్రశేఖరరావు అన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు బ్యాంకుల పనితీరు మెరుగుపడడం చాలా అవసరమని సీఎం అన్నారు.
సిద్ధిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే క్రమంలో ఎదురయ్యే అనుభవాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనకు రావాలని సీఎం చెప్పారు. సిద్ధిపేటలో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు సంబంధించి డిసెంబర్ 13న ‘ప్రగతి భవన్’లో సీఎం సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో సిద్ధిపేట నియోజకవర్గంలో జరుగుతున్న నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమాలను సమీక్షించారు. బ్యాంర్లు, అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి అభినందించారు. సిద్ధిపేట నియోజకవర్గం తర్వాత సిద్ధిపేట జిల్లాను కూడా నగదు రహిత లావాదేవీల జిల్లాగా మార్చనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకోసం అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్రమంతా ఇక్కడి అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
”నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి తగినన్ని స్వైప్ మిషన్లు అందుబాటులోకి రావాలి. కానీ డిమాండ్‌కు తగినట్లు అవి సమకూరడం లేదు సిద్ధిపేటలో నాలుగువేలకుపైగా స్వైప్ మిషన్లు సమకూర్చాలి. బ్యాంకు అకౌంట్లు కూడా అందరితో తెరిపించాలి. వారికి డెబిట్ కార్డులివ్వాలి. కార్డుల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌లద్వారా కూడా లావాదేవీలను ప్రోత్సహించాలి. దీనికోసం ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలి. బ్యాంకు అకౌంట్ల నిర్వహణ, కార్డుల వినియోగంపై అందరికీ వివరించారు. కార్డులను కూడా గ్రామ సభ నిర్వహించి ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
”కేవలం డెబిట్ కార్డుల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల ద్వారా లావాదేవీలను బాగా ప్రోత్సహించాలి. అందరికీ వాటిపై అవగాహన కల్పించాలి. దీనికోసం విద్యార్థులను ఉపయోగించుకోవాలి. ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించి, వారి ద్వారా ప్రజలందరినీ చైతన్య పరచాలి. ఉద్యమస్ఫూర్తితో ఈ కార్యక్రమం సాగాలి. దీనికోసం జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. ఆర్టీసీ బస్సుల్లో పూర్తిస్థాయిలో స్వైప్ మిషన్లు పెట్టాలి. వ్యాపార, వాణిజ్య నిర్వహణకు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఛార్జీలు చెల్లించడానికి మొబైల్ యాప్స్‌ను వినియోగించేలా చూడాలి. వ్యాపారులందరికీ అకౌంట్లు తీయాలి” అని సీఎం చెప్పారు.
మంత్రులు టీ హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు జి. వివేకానంద, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణరావు, నవీన్‌మిత్తల్, శాంతికుమారి, స్మితా సభర్వాల్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, కమిషనర్ శివశంకర్, జాయింట్ కలెక్టర్ హన్మంతరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 12 బ్యాంకులకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.