ఆషాఢమాసం మొదలయ్యిందంటే చాలు తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలను తలకెత్తుకుంటారు. తలచిన మొక్కులు నెరవేర్చాలని, ఎల్లవేళలా తమను ఆయురారోగ్యాలతో చల్లంగా చూడాలని ఆయా గ్రామ దేవతలను వేడుకుంటారు. ఈసారి బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తొలిబోనాన్ని గోల్కొండ సాక్షిగా శ్రీజగదాంబిక అమ్మవారికి సమర్పించడంతో బోనాల సంబరాల సందడి ప్రారంభమయింది. ఆ తదుపరి సికింద్రాబాద్
ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, అటు తర్వాత లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవార్లకు వరుసగా బోనాలెత్తిన జంట నగరాల ప్రజలు దాదాపుగా ఆషాఢమాసాంతం భక్తి పారవశ్యాలలో మునిగితేలారు. ఈ బోనాల ఉత్సవాలను శ్రావణమాసంలో కూడా కొనసాస్తారు.