ramadasu-projectభారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. సాగునీటి రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ రికార్డు సమయంలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నిలబడింది. సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ రంగాన్ని రికార్డు సమయంలో గాడిలో పెట్టగలిగిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటింటికీ నల్లాద్వారా మంచినీళ్లిచ్చే మిషన్‌ భగీరథ పనులను కూడా అనుకున్నదానికంటే వేగంగా పూర్తి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అత్యంత అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా వేగం ప్రదర్శిస్తూ పనులు పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది.

తెలంగాణ వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల సమయంలో విద్యుత్‌ కష్టా లు గట్టెక్కుతాయని భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవ వల్ల కేవలం తెలంగాణ ఏర్పడిన 9వ నెల నుంచే నిరంతరాయ విద్యుత్‌ అందించడం సాధ్యమవుతున్నది. ఇంటింటికి మంచినీళ్లు అందించే మిషన్‌ భగీరథ కార్యక్రమం కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలని మొదట లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం. కానీ 2017 డిసెంబర్‌ నాటికే పూర్తి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా వేగం పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. టెండర్ల ప్రక్రియ, డిజైన్ల ఆమోదం, భూసేకరణ తదితర విషయాల్లో జాప్యం జరుగుతున్నదని భావించి, ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వీటిలో సంస్కరణలు తెచ్చింది. పైపులైన్లు, పంప్‌ హౌజ్‌, అప్రోచ్‌ ఛానల్‌, సబ్‌ స్టేషన్ల నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టింది. ఫలితంగా రికార్డు సమయంలో ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయగలిగింది. రాబోయే కాలంలో తెలంగాణలో చేపట్టే అన్ని నీటి పారుదల ప్రాజెక్టులకు ఇప్పుడు భక్త రామదాసు ప్రాజెక్టు ఆదర్శం కాబోతున్నది.

చరిత్ర తిరగరాసిన ప్రాజెక్టు

నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమంటే ఏండ్ల తరబడి సాగే కార్యక్రమమనే అభిప్రాయం బలపడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పదకొండు నెలల్లోనే ఓ నీటి పారుదల ప్రాజెక్టును పూర్తి చేసి నీరు విడుదల చేస్తున్నది. ఖమ్మం జిల్లా పాలేరులో భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. మార్చి 2017లోగా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అనుకున్న దానికంటే రెండు నెలలు ముందుగానే, కేవలం 11 నెలల్లోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. దేశంలో ఇప్పటిదాకా అత్యంత వేగంగా నిర్మితమైన సాగునీటి ప్రాజెక్టుగా భక్త రామదాసు ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలిచింది.

రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిత్యం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలాల పరిధిలోని 60 వేల ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ఈ పథకం ఉద్దేశించబడింది. శ్రీ రామ సాగర్‌ ప్రాజెక్ట్‌ క్రింద ఉన్న డి.బి.యం 60 క్రింద వున్న వ్యవసాయ భూమి దీనివల్ల పూర్తి స్థాయిలో సాగులోకి వస్తుంది.

ఈ పథకం ద్వారా పాలేరు రిజర్వాయరు (నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ యొక్క బ్యాలన్సింగ్‌ రిజర్వాయరు) నుంచి 5.5 టి.యం.సి.ల నీటిని 125.7 మీటర్ల ఎత్తు నుండి 187.00 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేస్తారు. 45వ కిలోమీటరు వద్ద గల డి.బి.యం 60 (శ్రీరామ సాగర్‌ ప్రాజెక్ట్‌ స్టేజి) కాలువలోకి నీటిని విడుదల చేస్తారు. దీనికోసం అప్రోచ్‌ ఛానల్‌, పంప్‌ హౌజ్‌, పైపు లైను నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు.

ఈ-ప్రొక్యూర్మెంట్‌ ద్వారా టెండర్లను పిలిచి మెగా ఇంజినీరింగ్‌ మరియు ఇన్‌ఫ్రాస్టక్చర్స్‌ లిమిటెడ్‌ వారికి పని అప్పగించారు. ఈ పనిని 13 నెలల్లో.. అనగా 17 మార్చి 2017లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం-వర్కింగ్‌ ఏజన్సీల మధ్య ఒప్పందం కుదిరింది.

జీవో నెంబరు 123తో తొందరగా భూసేకరణ

త్వరితగతిన భూ సేకరణ జరపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 123 ద్వారా భూ సేకరణ జరిగింది. 128.70 ఎకరాల భూమిని అతి తక్కువ సమయంలో సేకరించగలిగారు. తక్షణ పరిహారం ఇవ్వడం ద్వారా రైతులు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించారు. తమ భూములు ప్రభుత్వానికి అప్పగించి పైపులైన్ల నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ లోకేష్‌, ఇతర నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి పనులను వేగంగా పూర్తి చేయగలిగారు. మంత్రి తుమ్మల దాదాపు ప్రతీ రోజు నిర్మాణ పురోగతిని పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్‌, అధికారులు, ఇంజనీర్లు కూడా ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా, అత్యంత ముఖ్యమైనదిగా భావించి నిర్మాణ పనుల్లో అంకితభావం ప్రదర్శించారు. దీనివల్ల 16.50 కిలోమీటర్ల ప్రధాన పైపులైను నిర్మాణం శరవేగంగా పూర్తి చేయగలిగారు. ఇందిరా సాగర్‌ ఎత్తిపోతల పథకం కొరకు సేకరించినప్పటికీ, ఉపయెగించని రెండు మోటర్లు, పంపులు, పైపులు ఈ పథకానికి ఉపయోగించారు. మిగిలిన సివిల్‌ పనులు, మోటర్లు, పైపులైన్ల స్థాపనకు రూ.90.87 కోట్లు వెచ్చించారు.

వంద రోజుల్లో సబ్‌ స్టేషన్‌ నిర్మాణం

ఈ పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్‌ సరఫరా పనులు కూడా సమాంతరంగా జరిగాయి. తెలంగాణ ట్రాన్స్‌కో కూసుమంచి పంపు హౌజ్‌ వరకు సుమారు 7.83 కిలోమీటర్ల హైటెన్షన్‌ విద్యుత్‌ లైను, పంపు హౌజ్‌ వద్ద 132/11 కె.వి. సబ్‌ స్టేషన్‌ వందరోజులలో నిర్మించే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు పూర్తి చేశారు. సాధారణంగా ఎత్తిపోతల పథకంలో వుండే సివిల్‌ , ఎలక్ట్రో మెకానికల్‌, పైపులైను పనులు, ఇతర అనుబంధ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే నీటి పారుదల, రెవెన్యూ, విద్యుత్‌ శాఖలు, వర్కింగ్‌ ఏజన్సీలు పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్ల, అన్ని పనులు సమాంతరంగా చేయడం వల్ల, కావాల్సిన సామగ్రిని ముందుగానే సేకరించి పెట్టుకోవడం వల్ల పనులు వేగంగా జరిగాయి.

విజయవంతమైన ట్రయల్‌ రన్‌

పథకం మొదటి పంపు, మోటరు, పైపు లైనుకు సంబంధించిన ట్రయల్‌ రన్‌ జనవరి 28న విజయవంతమయింది. ఈ పంపు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ ఉపకాలువ డి బి ఎం 60 లోకి వదిలారు. రెండవ పంపు, మోటారు పైపులైను ట్రయల్‌ రన్‌ ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా పథకం మొత్తం పనిని అగ్రిమెంట్‌ గడువు అయిన మార్చి 2017 కంటే రెండు నెలలు ముందుగానే అనగా జనవరి నెలాఖరుకు సిద్ధం చేశారు.

పాలేరుకు తొలగిన శాపం

ఖమ్మం జిల్లా అంతటా సాగునీటి వసతి ఉంది. అటు గోదావరి, ఇటు కృష్ణా ద్వారా సాగునీరు అందుతుంది. కానీ పాలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు మాత్రం నిత్యం నీటి ఎద్దడి ఉండేది. తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో పాలేరు ఒకటి. దీంతో ఇక్కడ నిత్యం నీటి కరువే. భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల మంచినీటికి కూడా తీవ్ర ఇబ్బంది నెలకొంది. జిల్లా అంతటా పంటలు పండినా ఈ ప్రాంతంలో మాత్రం నీరు లేక భూములు బీడులుగా మారేవి.

ఈ ప్రాంతానికి నీరు అందించడం కోసమని ఎస్‌ఆర్‌ఎస్పి స్టేజ్‌ 2 కింద కాల్వలు కూడా తవ్వారు. ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. చివరి ఆయకట్టు కూడా ఇదే. కానీ ఏనాడూ ఎస్‌ఆర్‌ఎస్పి ద్వారా నీరు రాలేదు. ఎస్‌ఆర్‌ఎస్పి నీరు వరంగల్‌ దాటి వచ్చిన దాఖలాలు లేవు. గత ఏడాది మంచి వర్షాలు కురిసి ఎస్‌ఆర్‌ఎస్పి ద్వారా చాలా రోజుల వరకు నీటి విడుదల జరిగినా ఈ ప్రాంతం వరకు నీరు రాలేదు. ఫలితంగా కాల్వలున్నా నీరు లేని దుస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. పాలేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలేరు నియోజకవర్గానికి వెంటనే నీళ్లు అందించే మార్గం చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించి, భక్త రామదాసు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నది నీళ్లు పాలేరు రిజర్వాయర్‌ చేరతాయి. పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటిని తోడి ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. కాల్వలోకి నీటిని పంప్‌ చేయాలని నిర్ణయించారు. వెంటనే పరిపాలనా అనుమతులిచ్చిన ముఖ్యమంత్రి, అవసరమైన నిధులు కూడా మంజూరు చేశారు. తానే స్వయంగా శంకుస్థాపన చేశారు. అనేక సార్లు సమీక్షలు నిర్వహించారు. వెంటబడి పనులు చేయించే బాధ్యతను మంత్రి తుమ్మలకు అప్పగించారు. ఎప్పటికప్పుడు అనుమతులు, టెండర్ల ప్రక్రియ నిర్వహించడం లాంటి పరిపాలనా పనులు త్వరిత గతిన చేయాలని నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌ను సిఎం ఆదేశించారు. దీంతో మంత్రులు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ వైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగానే, ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. కాలువల మరమ్మతు కూడా జరిగింది. దీంతో ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాటికి అటు ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. కాలువలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ పథకం ద్వారా కాలువల ద్వారా సాగునీరు అందివ్వడంతో పాటు, ఎన్నో ఏళ్ల నుంచి నీటి తడి లేక బావురు మంటున్న చెరువులు కూడా జలకళతో ఉట్టిపడతాయి. భూగర్భ జలమట్టాలు కూడా పెరగడం వల్ల పాలేరు ప్రాంత వాతావరణ పరిస్థితులే మారిపోయే అవకాశం కలిగింది.

అభినందనలు: సీఎం కేసీఆర్‌

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులో ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ చూపారు. దాదాపు ప్రతీ రోజు రివ్యూ చేశారు. అనేక మార్లు ప్రాజెక్టు నిర్మిత ప్రాంతాన్ని సందర్శించారు. రైతులను ఒప్పించి భూ సేకరణ పూర్తి చేశారు. మంత్రి, జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించగలిగారు. అంతా కలిసి ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేయగలిగారు. అత్యంత చొరవ చూపి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసిన మంత్రి తుమ్మలను సిఎం అభినందించారు. వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటారని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు, నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లను సిఎం అభినందించారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తి చేసి రుణం తీర్చుకుంటామని, నమ్మకం నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని సిఎం ప్రకటించారు. చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ప్రాజెక్టులు అనుకున్న సమయం కంటే ముందే నిర్మించవచ్చని నిరూపించగలిగామని సిఎం అన్నారు.

నీటి పారుదల శాఖలో విజయోత్సాహం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. అందుకే ప్రజలకు సాగునీరు అందివ్వడమే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నది. బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు ఈ శాఖకే కేటాయిస్తున్నది. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అనేక ప్రాజెక్టులు రూపొందించింది. నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు నాయకత్వంలోని నీటి పారుదల శాఖ అధికారులు ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు.

మిషన్‌ కాకతీయ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 45,600 చెరువులను పునరుద్ధరిస్తున్నది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి కరువు పీడిత, వలస బాధిత పాలమూరు జిల్లాలో జలసిరులు కురిపించగలిగింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌, బీమా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. మరో మూడున్నర లక్షల ఎకరాలకు వచ్చే ఏడాది నీరు ఇవ్వడానికి రంగం సిద్ధమయింది. మహబూబ్‌ నగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కూడా పూర్తి చేశారు. దీనివల్ల మేజర్‌, మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో కొత్తగా 11 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగారు. మరోవైపు మిషన్‌ కాకతీయ ద్వారా రెండు దశల్లో ఇప్పటిదాకా 16 వేల చెరువులను పునరుద్ధరించారు. దీనివల్ల ఈ రబీ సీజన్లో ఏడున్నర లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. వచ్చే రెండు మూడేళ్లలో అన్ని మేజర్‌, మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందులో భాగంగా పాలేరు ఎత్తిపోతల పథకంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు పెండింగ్‌ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రావడం, ఇప్పుడు పాలేరును కూడా ముఖ్యమంత్రి అనుకున్న సమయంలో పూర్తి చేయడంతో నీటి పారుదల శాఖలో విజయోత్సాహం తొణికిసలాడుతున్నది. భవిష్యత్తులో నిర్మించే భారీ ప్రాజెక్టుల యిన పాలమూరు, కాళేశ్వరం నిర్మాణానికి ఈ విజయం మరింత ఉత్సాహం ఇస్తుందని నీటి పారుదల శాఖ వ్యవహారాలు చూస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ జోషి అన్నారు.

మా సంస్థకు గొప్ప పేరు: మెగా డైరెక్టర్‌ కృష్ణారెడ్డి

భక్త రామదాసు ప్రాజెక్టును నిర్ణీత గడువుకంటే రెండు నెలల ముందుగానే పూర్తి చేయడం తమ సంస్థకు గొప్ప పేరును తెచ్చిపెట్టిందని మెగా ఇంజనీరింగ్‌ వర్క్స్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందించిన సహకారం వల్లనే పనులు పూర్తి చేయడం సాధ్యమయిందని అన్నారు. తాము గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 12 నెలల్లో పట్టిసీమ నిర్మించి రికార్డు సృష్టించామని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 11 నెలల్లోనే భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మించడం వల్ల కొత్త రికార్డు నమోదు చేయగలిగామని ఆయన వెల్లడించారు.

దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం కొత్త అధ్యాయం

11 నెలల్లో పూర్తి.. 60 వేల ఎకరాలకు సాగునీరు

జనవరి 31న కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం

భక్త రామదాసు జయంతి రోజే నీటి విడుదల

మొదటి దశ ట్రయల్‌ రన్‌ విజయవంతం

బంగరు పంటలు పండించనున్న బీడు భూములు

మంచినీళ్లకేడ్చిన పాలేరు ఇక సుజలాం – సుఫలాం

మంత్రులు, అధికారులు, వర్కింగ్‌ ఏజన్సీలకు సిఎం అభినందన

విద్యుత్‌ సరఫరా, మిషన్‌ భగీరథ బాటలోనే నీటి పారుదల ప్రాజెక్టులు

రెండున్నరేళ్లలో 19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు

తెలంగాణ నీటి పారుదల శాఖలో విజయోత్సాహం

Other Updates