తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి కష్టాలను తీర్చే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన, మిషన్ భగీరథకు ”జాతీయ జల మిషన్ అవార్డు”ను మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కపాకర్ రెడ్డి అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా ఈ.ఎన్.సి కపాకర్ రెడ్డి ఈ అవార్డును తీసుకున్నారు.ఈ అవార్డు కార్యక్రమానికంటే ముందు అక్కడ ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్టాల్‌ను కేంద్రమంత్రి షెకావత్ ప్రారంభించి, భగీరథ ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.అవార్డు అందుకున్న సందర్బంగా ఈ.ఎన్.సి కపాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే హడ్కో, స్కోచ్ లాంటి జాతీయ అవార్డులు దక్కాయన్నారు. తాజాగా ఈ జలమిషన్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, తమ శాఖ ఇంజనీర్ల కఠోర శ్రమతోనే ఇవాళ మిషన్ భగీరథ ప్రాజెక్టు విజయవంతం అయిందన్నారు. దేశంలోని 10 రాష్ట్రాల ప్రతినిధులు మిషన్ భగీరథను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంతప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. మిషన్ భగీరథ స్ఫూర్తితోనే కేంద్రం కూడా హర్ ఘర్ నల్ సే జల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతుందన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో రెండు జాతీయ అవార్డులు కూడా లభించాయి. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచే అంశంలో మిషన్ భగీరథకు ప్రథమ అవార్డురాగా, సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచే అంశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ వాటర్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టంకు ద్వితీయ అవార్డు, భూగర్భ జలాలు ప్రమాదకర స్థితికి చేరిన ప్రాంతాల పునరుజ్జీవనానికి ప్రత్యేక దృష్టి పెట్టే అంశంలో రాష్ట్ర భూగర్భ జల విభాగానికి తృతీయ అవార్డు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఈ అవార్డులు అందుకున్నారు.