తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియంగా ఏర్పడ్డ అలహాబాద్, దేనా, పంజాబ్ అండ్ సింధ్, సిండికేట్, ఓబీసీ,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకులు దాదాపు 6750 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి అంగీకరించాయి. సైఫాబాద్‌లోని ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆగస్ట్ 17న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రాబ్యాంకు ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సురేష్ ఎన్. పటేల్ అధ్యక్షతన జరిగిన కన్సార్టియం మీటింగ్‌లో పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీరాజ్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రామ్మోహన్, =ఔూడూ ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డితో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు.
ముందుగా మాట్లాడిన ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ పటేల్ మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆంధ్రాబ్యాంకు భాగం అయినందుకు గర్వంగా ఉంది అన్నారు. తాము ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 1300 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడానికి ఒప్పుకున్నామన్నారు. కోట్లాది మంది దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ దైవకార్యంలో ఇతర బ్యాంకులను భాగం చేయాలన్న ఉద్దేశ్యంతోనే కన్సార్టియం ఆలోచన చేశామని అన్నారు. తమ బ్యాంకు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రాజెక్టు డిపీఆర్‌లను పరిశీలించడంతో పాటు టెండర్ల ప్రక్రియ, బిల్లుల చెల్లింపు విధానాన్ని నిశితంగా పరిశీలించారని చెప్పారు. థర్ట్ పార్టీ కన్సల్టెంట్‌గా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఈ ప్రాజెక్టు డిజైన్‌లు, నాణ్యతలను పరిశీలించడం మిషన్ భగీరథ అత్యున్నత నాణ్యత ప్రమాణాలకు నిదర్శనమని అన్నారు. తాము సంపూర్ణంగా సంతృప్తి చెందాకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ఆర్థిక సహాయానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఒక ప్రభుత్వ పథకానికి ఎలాంటి శషభిషలు లేకుండా ఇంత పెద్ద మొత్తాన్ని లోన్ గా ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు. ఆ తరువాత మాట్లాడిన పంచాయితీరాజ్ స్పెషల్ సిఎస్ ఎస్పీసింగ్, మిషన్ భగీరథ లక్ష్యాలు, అవసరాన్ని పవర్ పాయింట్ రూపంలో ప్రదర్శించారు. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించిన మిషన్ భగీరథ మొత్తం దేశానికే రోల్ మోడల్ గా నిలవబోతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన ప్రజలకు సురక్షిత మంచినీరు దొరకక పోవడం బాధాకరమని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్ భగీరథను ప్రారంభించారని గుర్తుచేశారు.
ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టాలంటే ఆర్థిక వనరులతో పాటు రాజకీయ సంకల్పం కావాలన్నారు. ఆ రాజకీయ సంకల్పంతోనే దేశంలోని ఏ ముఖ్యమంత్రి ఆలోచించ డానికి కూడా సాహసించని భారీ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. 20 ఏళ్ల క్రితం సిద్ధిపేట ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించిన అనుభవంతో ముఖ్య మంత్రి గారు మిషన్ భగీరథను డిజైన్ చేశారని చెప్పారు. మూడున్నర సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేసి గడప గడపకు నల్లాతో సురక్షిత నీటిని అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగనని ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేశారని చెప్పారు. ఆ తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇవాళ దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణనే మిగులు బడ్జెట్ గల రాష్ట్రమన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో స్థిరమైన వృద్ధి నమోదు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే అని పేర్కొన్నారు. 14 వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను తెలియచేస్తాయన్నారు. పన్ను వసూలులో మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆదాయంలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రంతో చేతులు కలిపి అభివృద్ధిలో భాగం కావాలని బ్యాంకర్లను కోరారు. చివర్లో మాట్లాడిన ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్, మిషన్ భగీరథ రుణాలకు రాష్ట్రం గ్యారంటీగా ఉండడం బ్యాంకర్లకు భరోసా ఇస్తుందన్నారు.
సమాజానికి ఉపయోగపడే మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగం అయ్యే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకొన్ని బ్యాంకులు కూడా కన్సార్టియంలో చేరడానికి ఆసక్తి చూపిస్తూ తమను సంప్రదిస్తున్నాయని, తరువాతి విడతలో వాటి గురించి ఆలోచిస్తామన్నారు. ఆ తరువాత మాట్లాడిన వివిధ బ్యాంకు ప్రతినిధులు మిషన్ భగీరథకు రుణ సహాయం చేసే విషయంలో తమకు మరో ఆలోచన లేదన్నారు. మిషన్ భగీరథ ఆర్థిక సహాయానికి బ్యాంకులు ముందుకురావడం తెలంగాణ ప్రభుత్వ విశ్వసనీయత, పారదర్శకతకు నిదర్శనమని ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి చెప్పారు.
1300 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంపై ఆంధ్రాబ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఇప్పటికే అంగీకారం కుదిరింది. త్వరలోనే దీనికి సంబంధించిన చెల్లింపు జరుగుతుంది. మిగిలిన బ్యాంకులు త్వరలో జరిగే తమ మేనేజ్ మెంట్ కమిటీ మీటింగ్ లో రుణ సహాయానికి ఆమోదం తెలుపనున్నాయి. మూడు సంవత్సరాల తరువాత అంటే 2019 నుంచి రీ పేమెంట్ పీరియడ్ మొదలువుతుంది. గరిష్టంగా 12 సంవత్సరాల్లో ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
ప్రభుత్వ రుణ సంస్థలైన నాబార్డ్, హడ్కో టర్మ్ అండ్ కండీషన్ పైనే తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ను మంజూరు చేయడం విశేషం. ఈ రుణ మొత్తాన్ని కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని-భూపాలపల్లి, కూవీణ కరీంనగర్, కూవీణ మానకొండూర్ తో పాటు వరంగల్ జిల్లాలోని గోదావరి మంగపేట సెగ్మెంట్‌లోని మిషన్ భగీరథ పనులకు ఉపయోగిస్తారు. ఇదిలా ఉండగా ఆగస్ట్ 20న మరో మూడు బ్యాంకులు (కెనరా, విజయ, ఎస్‌బీహెచ్) 3,200 కోట్ల రూపాయల రుణాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. మిషన్ భగీరథకు రుణ సహాయం అందించడానికి బ్యాంకులు తమంతతాముగా ముందుకు రావడం గొప్ప విషయమని పంచాయతీరాజ్ స్పెషల్ కమిషనర్ ఎస్పీసింగ్ అన్నారు.
బ్యాంకు లోన్ మొత్తం కోట్లలో
ఆంధ్రాబ్యాంకు 1300
దేనా బ్యాంకు 500
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 700
సిండికేట్ బ్యాంకు 1000
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1000
ఇండియన్ బ్యాంకు 750
అలహాబాద్ బ్యాంకు 500
కెనరా బ్యాంకు 2000
విజయాబ్యాంకు 600
ఎస్‌బీహెచ్ 600