మా చిన్నప్పుడు మా వేములవాడలో ఇప్పుడు వున్నన్ని బళ్ళు వుండేవి కావు. రెండు కానిగి స్కూల్స్, రెండు సర్కార్ స్కూల్స్ వుండేవి.
ఈ రెండు కానిగి బళ్ళల్లో ఒకటి కుంటి పంతులు సార్ బడి. మరో బడి, దాని పేరు గుర్తులేదు. కుంటి పంతులు సార్ బడి మా బాపు దవాఖానాకి పోయే దారిలో వుండేది. మరో బడి పోచమ్మ గుడి దగ్గర వుండేది. ఈ రెండు బళ్ళల్లో పిల్లలు పెద్దబాలశిక్ష వరకు చదువుకొని భద్రయ్య బడిలో చేరేవాళ్ళు.
నేను కుంటి పంతులు సార్ బడిలో చదువుకున్నాను. అక్కడే ఎక్కువ మంది పిల్లలు చదివేవాళ్ళు. పాఠాలు బాగా చెప్పేవాడు. ఆయనకి రెండు కాళ్ళు లేవు. అవి ఎలాపోయాయో తెలియదు. పెద్ద అరుగు వుండేది ఆయన ఇంట్లో. వాటి మీద చాపలు వేసి వుండేవి. అందరూ ఆ చాపల మీద కూర్చోని చదువుకునే వాళ్ళు. అ, ఆలు రాయించేవాడు. ‘కా’ గుణింతాలు బాగా చదివిపించేవాడు. ఎక్కాలు కూడా చదివించేవాడు.
అన్నీ అందరికీ నోటికి రావాల్సిందే. ఇరువై ఎక్కాలు నోటికి రావాల్సిందే. తప్పులు లేకుండా రాయాలి. చదవాలి. ఎవరైనా చదువకపోయినా, రాయకపోయినా, ఎక్కాలు నోటికి చెప్పకపోయినా మా కుంటి పంతులు సార్ శిక్షలు కఠినంగా వుండేవి.
కోదండం ఎక్కించేవాడు. గోడ కుర్చీ వేయించేవాడు. వంగబెట్టి ఓ బండ పెట్టించేవాడు. ఆయన శిక్షలకు భయపడి చాలా మంది పిల్లలు శ్రద్ధగా చదివేవారు. ఎక్కాలని బట్టీపట్టి అప్పచెప్పేవారు. కొంత మంది అక్కడ మానేసి పోచమ్మ గుడి దగ్గర వున్న బడిలో చేరేవారు. అక్కడ శిక్షలు ఇంత కఠినంగా వుండేవి కావు.
కుంటి పంతులు సార్‌కి కాళ్ళు లేవు కానీ కంఠం మాత్రం కంచు కంఠం. చూపు కూడా చాలా తీక్షణంగా వుండేది. మూలలో కూర్చొని నిద్రపోతున్న పిల్లవాడిని కూడా చూసి తన కంచు కంఠంతో నిద్రలేపేవాడు. తన చూపులతో భయపెట్టేవాడు.
శిక్షలు కఠినంగా వున్నా మంచిగా చదివే పిల్లలని ప్రేమతో పలకరించేవాడు. అయినా అందరికీ భయం భయంగా బెదురు బెదురుగా వుండేది.
అక్కడ పెద్ద బాలశిక్ష వరకూ చదువుకొని భద్రయ్య బడిలో చేరిపోయాను. ఈ బడి కుంటిపంతులు సార్ బడి కన్నా మా ఇంటికి దగ్గర. మా ఇంటి నుంచి పోచమ్మ గుడి దాటిన తరువాత మురళి దుకాణంకి ఎదురుగా వున్న సందులో భద్రయ్య బడి వుండేది.
అది పేరుకి భద్రయ్య బడి. కానీ ఆ బడి భద్రయ్యది కాదు. టీచర్ల పేరు మీద బడి వుండటం సహజం. కానీ భద్రయ్య టీచర్ కూడా కాదు. అతను ఆ బడిలో చప్రాసీ. అది సర్కార్ బడి. ప్రైమరీ స్కూల్.
అప్పటికింకా ప్రభుత్వం స్కూల్‌కి స్వంత భవనం కట్టించలేదు. అందుకని ఓ కిరాయి ఇంట్లో ఆ బడి వుండేది. అది విశాలమైన ప్రైవేట్ భవనం. పెద్ద ఇల్ల్లు చుట్టూ విశాలమైన స్థలం. ఓ పేద్ద చింతచెట్టు. ఆ భవనంలో ఒక అంతస్తు ఉండేది.
క్రింద ఐదారు గదులు వుండేవి. పైన కూడా ఐదారు గదులు వుండేవి. క్రింద కొన్ని తరగతులు, పైన కొన్ని తరగతులు వుండేవి. హెడ్మాస్టర్ గది, టీచర్ల గది, స్టాఫ్ గది క్రిందనే వుండేవి.
అది పేరుకు సర్కార్ బడి. కానీ అది భద్రయ్య బడిగానే ప్రసిద్ధి. భద్రయ్య ఎప్పుడూ చిరునవ్వుతో వుండేవాడు. తెల్లటి ఫైజామా, నెహ్రూ షర్ట్ అతని వేషధారణ. పిల్లలందరినీ ప్రేమ పూర్వకంగా పలకరించేవాడు. సార్‌లకి అణుకువగా వుండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరితో బాగుండేవాడు. పిల్లలతో సార్లకి ఇబ్బందులు రాకుండా చూసేవాడు.
పిల్లల మధ్య ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు సార్ల దగ్గరికి కాకుండా భద్రయ్య దగ్గరికే వెళ్ళి ఫిర్యాదు చేసేవారు. వాళ్ళ గొడవని సామరస్యంగా పరిష్కరించే వాడు. పిల్లలు కొట్లాడుకుంటే వారిని వేరు చేసి సముదాయించేవాడు. మార్కులు తక్కువ వచ్చిన పిల్లలని మళ్ళీ వచ్చే నెల పరీక్షకి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రోత్సహించేవాడు.
హెడ్మాస్టర్‌కి, సార్లకి ఏం కావాలన్నా తెచ్చిచ్చేవాడు. చాయ్ కావాలన్నా, పాన్ కావాలన్నా వెంటనే చేసి ఇచ్చేవాడు. అతని మొహంలో ఎప్పుడూ చిరునవ్వే కన్పించేది. విసుగూ, చిరాకు కన్పించక పోయేది.
మా బడిలో రోజూ మధ్యాహ్నం మంచి ఉప్మా తయారు చేసి పెట్టేవాళ్ళు. యూనిసెఫ్ నుంచి అనుకుంటాను – మంచి గోధుమ రవ్వ, నూనె డబ్బాలు వచ్చేవి. ఇంటి దగ్గర సరిగ్గా తినని పిల్లలు, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పోలేని పిల్లలు అక్కడ ఉప్మా తినేవాళ్ళు. పిల్లలు సరిగ్గా తింటున్నారా లేదా భద్రయ్య చూసేవాడు. వంట వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా కూడా పర్యవేక్షించేవాడు. వంట సామాను దుర్వినియోగం కాకుండా చూసేవాడు.
ఒకటేమిటి? బడిలోని ప్రతి విషయంలో, ప్రతి పనిలో భద్రయ్య పాత్ర వుండేది. ఆగస్టు 15 కావొచ్చు, జనవరి 26 కావొచ్చు. అన్నింటికీ భద్రయ్యే. అదీ ఆ బడి పరిస్థితి.
ఒకసారి నాకు జ్వరం వచ్చి రెండు రోజులు బడికి పోలేదు. సెలవుచీటి కూడా పంపించలేదు. మూడవ రోజు ఉదయం మా ఇంటి దగ్గర భద్రయ్య ప్రత్యక్షం అయినాడు. మా బాపుతో నా జ్వరం విషయం తెలుసుకొని వెళ్ళి పోయాడు. వెళ్ళే ముందు నా దగ్గరకొచ్చి పలకరించాడు. జ్వరం తగ్గగానే బడికి రమ్మని చెప్పాడు.
మరోసారి సాయంత్రం మా ఇంటి దగ్గరలో మళ్ళీ భద్రయ్య కన్పించాడు. మా ఇంటి దగ్గరలో వున్న వెంకటిని చదువు మాన్పించాడు వాళ్ళ తండ్రి. అతణ్ణి ఒప్పించి మళ్ళీ బడికి పంపే విధంగా మాట్లాడి వెళ్తున్నాడని తెలిసింది.
అనారోగ్యం వల్ల ఎవరు బడికి రాకపోయినా అలిగి రాకపోయినా, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రులని కలిసేవాడు. విషయం తెలుసుకునే వాడు. మారాం చేసే పిల్లలని గొడవ చేసే పిల్లలని సముదాయించి స్కూలుకి వచ్చే విధంగా చేసేవాడు భద్రయ్య.
భద్రయ్యకి పిల్లలందరూ తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులూ తెలుసు. వాళ్ళ ఇండ్లూ తెలుసు. అన్నింటి కన్నా ముఖ్యం అతనికి చదువు విలువ తెలుసు. ఈ కారణాలతో మా బడికి భద్రయ్య బడి అని పేరొచ్చింది. ఆ బడి భద్రయ్యదే అని చాలా మంది మా వూర్లో చదువురాని వ్యక్తులు అనుకునేవాళ్ళు. అలా అది భద్రయ్య బడిగా ప్రసిద్ధి చెందింది. వేరే పేరుతో ఆ స్కూలుని అడిగితే ఎవరికీ ఆ స్కూలు అడ్రస్ తెలిసేది కాదు.
చివరికి ఆ సందు పేరు భద్రయ్య బడి సందుగా మారిపోయింది. నేను ఆ భద్రయ్య బడి వదిలి పెట్టిన చాలా సంవత్సరాలకి ఆ ప్రైమరీ స్కూలుకి స్వంత భవనం వచ్చేసింది. ఆ సందు నుంచి ఆ బడి మా ఇంటి దగ్గరికి వచ్చేసింది. అప్పటికి ఎప్పుడో భద్రయ్య పదవీ విరమణ చేసేశాడు. ఆ బడి మెల్లమెల్లగా ప్రభుత్వ ప్రైమరీ స్కూలుగా రూపాంతరం చెందింది. స్థల మార్పు వల్ల భద్రయ్య బడి ప్రభుత్వ ప్రైమరీ స్కూలుగా మారిపోయింది. స్థలం కూడా ఎన్ని మార్పులని తెస్తుంది?
కొన్ని తరాల వ్యక్తులకి ఆ పేరు బాగా గుర్తుండి పోయింది. ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలకే కాదు, అక్కడ చదివిన తల్లిదండ్రులకి అదే గుర్తు – భద్రయ్య బడి.
అక్కడ కుంటి పంతులు సార్ బడి మాదిరిగా శిక్షలు వుండేవి కాదు. అందుకు కారణం భద్రయ్యే. అతని ప్రోత్సాహమే. స్థలమే కాదు. కాలం కూడా మరెన్నో మార్పులని తీసుకొస్తుంది.
అప్పుడు మా వూర్లో రెండు కానిగిరి బళ్ళు, రెండు సర్కార్ బళ్లు.
కానీ ఇప్పుడు ఎన్నో –
మా వూర్లో కాదు అంతటా –
టెక్నాలజీ పెరిగిపోయింది.
పోటీ తత్వం పెరిగిపోయింది.
ప్రైవేట్ స్కూళ్ళ ప్రాబల్యం పెరిగిపోయింది.
అడ్మిషన్ల కోసం పరీక్షలు, తల్లిదండ్రుల ఇంటర్వ్యూలు టీచర్‌కి విద్యార్థికి మధ్య దూరం. స్కూలుకి తల్లి దండ్రులకి మధ్య అగాధం. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లే తెలియరు.
అటెండర్లు ఎలా తెలుస్తారు?
స్కూలుకి రాకపోతే తల్లిదండ్రులకి వాట్సప్ మెసేజీలు, మేయిల్లు అంతా సాంకేతికత. వ్యక్తిగత సంబంధాలు తగ్గిపోతున్న వైనం.
ఇలాంటి పరిస్థితుల్లో భద్రయ్యలు ఎక్కడి నుంచి వస్తారు?
సర్కార్ బడినే తన బడిగా పిలిపించుకున్న భద్రయ్యలని ఊహించడం పిచ్చి. ఏమైనా ఆ సందు మాత్రం ఇప్పటికీ భద్రయ్య బడి సందే! అంతకన్నా భద్రయ్యకు ఏం కావాలి!!
“అనారోగ్యం వల్ల ఎవరు బడికి రాకపోయినా అలిగి రాకపోయినా, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తల్లి దండ్రులని కలిసేవాడు. విషయం తెలుసుకునే వాడు. మారం చేసే పిల్లలని గొడవ చేసే పిల్లలని సముదాయించి స్కూలుకి వచ్చే విధంగా చేసేవాడు భద్రయ్య.”
“బడిలోని ప్రతి విషయంలో, ప్రతి పనిలో భద్రయ్య పాత్ర వుండేది. ఆగస్టు 15 కావొచ్చు, జనవరి 26 కావొచ్చు. అన్నింటికీ భద్రయ్యే. అదీ ఆ బడి పరిస్థితి. ఒకసారి నాకు జ్వరం వచ్చి రెండు రోజులు బడికి పోలేదు. సెలవుచీటి కూడా పంపించలేదు.”