భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగాయి.

కళ్యాణమంటే సీతారాములదే అన్న నానుడి నిజం చేస్తూ ఎంతో కమనీయంగా, రమణీయంగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఏప్రిల్‌ 14న అభిజిత్‌ లగ్నం ప్రవేశించగానే సరిగ్గా 12 గంటలకు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ మూర్తుల శిరస్సుపై ఉంచారు. దశరధుడు, జనక మహారాజు, భక్తుల తరపున భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలతో కన్నుల పండువగా సూత్రధారణ నిర్వహించారు. భక్తులతో కిక్కిరిసిన మిథిలా మండపంలో వేద మంత్రాల ఘోష, మంగళ వాయిద్యాల హోరుతో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం అంగరంగ వైభవోపేతం గా నిర్వహించగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు.

ఎక్కడ చూసినా రామనామంతో భద్రాచల ప్రాంతం ఆసాంతం మారుమ్రోగింది. కనగ కనగా కమనీయం..అనగ అనగా రమణీయం..

శ్రీ సీతారామచంద్రుల పరిణయం. సుమధురం.. సుమనోహరం భక్తులకు నయనానందకరం ఆ కళ్యాణ వేడుకను వీక్షించిన జన్మసార్దకం.

తొలుత దేవాలయంలో ధ్రువమూర్తుల కళ్యాణం చేసి మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పల్లకిలో ఉదయం 9.35 గంటలకు స్వామివారిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ముందుగా తిరుకళ్యాణానికి సంకల్పం చేసి సర్వ విశ్వ శాంతికై విశ్వక్సేన పూజ నిర్వహించారు. భానుడు భగ భగా నిప్పులు కక్కుతున్నా ‘రామా రామా’ అంటూ భక్తజనం ఎండను సైతం లెక్కచేయలేదంటే అతిశయోక్తి కాదు. అటు భరతజాతి, ఇటు తెలుగుజాతి గర్వించేలా సీతారాముల కళ్యాణంలో దశరధుడు, జనకుడితో పాటు భక్తుల తరపున భక్తరామదాసు చేయించిన మూడు సూత్రాలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సీతమ్మవారికి మాంగల్యధారణ జరిగింది. కన్నుల పండువగా సాగిన ఈ క్రతువును తిలకించేందుకు భక్త జన సందోహం తరలివచ్చింది.

కళ్యాణం సందర్భంగా సంప్రదాయం ప్రకారం భక్తరామదాసు చేయించిన ఆభరణాలను వధూవరులకు ధరింపచేశారు. అనంతరం ప్రజల పక్షాన రాష్ట్రప్రభుత్వం తరపున దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్దానం, శృంగేరి పీఠం, చినజీయర్‌స్వామి, భక్తరామదాసు వారసుడు కంచర్ల శ్రీనివాసరావు స్వామి వారికి పట్టు వస్త్రాలను అందచేశారు.

భద్రాద్రి రాముడి కళ్యాణ వైభవ ప్రాశస్త్యంతో పాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను దేవస్థానం స్థానాచార్యులు కె.ఇ. స్దలశాయి వివరించారు. అర్చకస్వాములు తలంబ్రాలు కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించగా చివరగా భాగవతోత్తముల ఆశీర్వచనంతో కళ్యాణం ముగిసింది.

రమణీయం రాములోరి మహాపట్టాభిషేక మహోత్సవం

జగదానంద కారకుడైన రామయ్యకు పట్టాభిషేక మహోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం తరువాత రోజున అట్టహాసంగా నిర్వహించారు. ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ అన్న శ్రీరామదాసు కీర్తనలతో భద్రాద్రి రామాలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. శ్రీరామ.. జయ రామ.. పట్టాభిరామ.. అన్న భక్తజన ఘోషతో పవిత్ర గౌతమీతీరం పునీతమైంది. అన్ని లోకాలకు రక్షకుడై జగాలను ఏలిన జగదానంద కారకుడి పట్టాభిషేకం వేడుక చూసి భక్తులు తరించారు. ఆ మహావేడుక వీక్షించి భక్తిపారవశ్యంతో పులకించారు. వైదిక పెద్దలు చేసిన ప్రవచనాలతో భక్తి పారవశ్యులై రెండు చేతులు పైకెత్తి మ్రొక్కుకున్నారు.

కళ్యాణం కమనీయమై కనులకు విందు చేయగా ఆ మరుసటి రోజు పుష్యమి సందర్భంగా సీతారాముల పట్టాభిషేకం భక్తులకు బ్రహ్మానందాన్ని కలిగించింది. ‘జై జై శ్రీరామ .. రాజాధిరాజా శ్రీరామా’ అంటూ భక్తులు నీరాజనాలు పలికారు.

దేవాలయాన్ని తెరిచిన తరువాత అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి నామార్చనలు చేసి ఆరాధన కొనసాగించారు. కళ్యాణ మూర్తులను శోభాయాత్రగా మాడవీధుల మీదులా మిథిలా ప్రాంగణానికి తీసుకురావడంతో భక్తులు పాహి రామచంద్ర ప్రభో అంటు ప్రణమిల్లారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య సీతారాముల వారు మండపంలో వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యహ వాచనం, ఆభరణాల ప్రదర్శన తన్మయత్వాన్ని నిలిపింది. మంత్రోచ్చారణలు మారు మోగుతుండగా పట్టు పీతాంబరాలు ధరించి ప్రియభక్తుడు రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని అలంకరించుకున్న రామయ్య రాచఠీవితో కనిపించారు. ఛత్ర చామరాలను, పాదుకలను సమర్పించి ఖడ్గాన్ని అలంకరించారు. కిరీటాన్ని ధరింపచేశారు. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుని వైభవాన్ని చూడ భక్తులకు రెండు కళ్లు చాలలేదు. ఈ క్రతువును ఆహోబిల రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. స్దానాచార్యులు స్దలసాయి, వేదపండితుడు మురళీకృష్ణమా చార్యులు వేడుకను కళ్లకు కట్టినట్లు చేసిన వ్యాఖ్యానం అలరించింది.

ఆనవాయితీగా గవర్నర్‌ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఆలయ దర్శనం చేసుకుని పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తదుపరి గవర్నర్‌ మాట్లాడుతూ, శరణుకోరి వచ్చిన భక్తులను కాపాడే దైవం రామయ్య అని తెలిపారు. శ్రీరాముని నామం ఎంతో మధురమని, అందరికీ సుఖాన్ని శాంతిని సమకూర్చాలని అన్నారు.

శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉదయం 8.28 గంటలకు భద్రాచలం విచ్చేసిన గవర్నర్‌ దంపతులకు జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ సైనీ పుష్పగుచ్చం అందచేసి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం హెలిప్యాడ్‌ నుండి ఐటిడిఏ విశ్రాంతి భవనానికి చేరుకుని 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుని 8.50 నిమిషాలకు రామాలయానికి చేరుకుని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధానార్చకులు గవర్నర్‌ దంపతులకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకుని పట్టాభిషేకం కార్యక్రమాలలో పాల్గొన్నారు. మద్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పట్టాభిషేకం కార్యక్రమం ముగిసిన తదుపరి ప్రత్యేక వాహనాల్లో ఐటిడిఏ విశ్రాంతి భవనానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 3 గంటల సమయంలో హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాదు తిరుగు ప్రయాణమయ్యారు.

ఎస్పీ సునీల్‌దత్‌, పిఓ ఐటిడిఏ విపి గౌతం, సబ్‌ కలెక్టర్‌ భవేష్‌మిశ్రా, ట్రైనీ ఐఏఎస్‌ ఇలా త్రిపాఠి తదితరులు గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలకు, అదేవిధంగా పట్టాభిషేకం కార్యక్రమాలకు అధికసంఖ్యలో భక్తులు విచ్చేసినప్పటికీ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ సైనీ భక్తులను అభినందించారు. జిల్లా కలెక్టర్‌ వివిధ శాఖాధికారులను బాధ్యులుగా చేస్తూ అప్పగించిన పనులు సంతృప్తి నిచ్చాయని చెప్పారు.

జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ సైనీ నేతృత్వంలోని యంత్రాంగం భక్త జనానికి అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌ ముందస్తుగా జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మహోత్సవాలను వీక్షించడానికి విచ్చేయు భక్తులను మన అతిథులుగా గౌరవించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మంచిగా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా కళ్యాణ వేడుకలు నిర్వహించే మిథిలా స్టేడియంలో ప్రతి సెక్టారుకు ఒక జిల్లా అధికారిని బాధ్యులుగా నియమించి భక్తులకు సేవలు అందింపచేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు గాను సెక్టారుల నందు ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయించారు. తలంబ్రాలు పంపిణీ కొరకు ప్రత్యేకంగా పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో తలంబ్రాలు పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రతి కేంద్రానికి ఒక అధికారిని బాధ్యులుగా నియమించారు. ఆర్టీసి ద్వారా బస్‌లలో ప్రయాణికులకు తలంబ్రాలు అందచేశారు. భక్తులకు సమాచారం అందచేయుటకు గాను సమాచారశాఖ ద్వారా విస్తా కాంప్లెక్సు, బస్టాండు, గోదావరి బ్రిడ్జి, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్‌ నందు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయించారు. భక్తులు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్యసేవలు అందచేయుటకు 24 గంటలు పనిచేయు విధంగా అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎండను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడంతో భక్తులు ఆనందంతో స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల విందుగా వీక్షించి తరించారు.
ఎస్‌. శ్రీనివాస రావు

Other Updates