kcrఎంతో చారిత్రక ప్రాశస్త్యం గల ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ఈ ఏడాదే 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. 

ద్రాద్రిలో ఏప్రిల్‌ 15న నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణాన్ని తిలకించిన అనంతరం అక్కడి టుబాకో బోర్డు ప్రాంగణంలో ముఖ్యమంత్రి పత్రికల వారితో మాట్లాడుతూ, ”శ్రీ సీతారాముల కల్యాణం బ్రహ్మాండంగా జరిగింది. భద్రాచలం ప్రఖ్యాత, చారిత్ర ప్రాశస్త్యంగల పుణ్యక్షేత్రం. యాదగిరి గుట్టను ఆగమ శాస్త్రం ప్రకారం జీయర్‌ స్వామి సూచనలతో, వేములవాడను శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యుల పరిశీలనలో అభివృద్ధి చేస్తున్నాం. భద్రాద్రిని కూడా చిన జీయర్‌ స్వామి సూచనలతో సమగ్రాభివృద్ధి చేస్తాం. ఇందుకు రూ. 100 కోట్లు నిధులను ఈ బడ్జెట్‌ లోనే కేటాయించనున్నాం.” అని ముఖ్యమంత్రి ప్రకటించారు. త్వరలో చిన జియర్‌ స్వామితో భద్రాద్రికి వచ్చి, ఒకటిన్నర రోజు వుండి, ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలిస్తామని తెలిపారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా భద్రాచలం ఆలయం, గోదావరి పరీవాహక ప్రాంతాన్ని తిలకించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయం చుట్టూ వున్న ప్రాకారాలు శిధిలావస్థలో వున్నాయని, ఆలయం లోపలి భాగాలు, పార్కింగ్‌ వీటన్నిటినీ పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు.

భద్రాచలంలో ఆలయానికి సంబంధించిన కొన్ని భవనాలు శిధిలావస్థలో వున్నాయని, కొన్ని కొత్త భవనాలు నిర్మించాల్సి వుందని, మాడవీధుల నిర్మాణంతోపాటు, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చెప్పారు. రంగనాయకుల గుట్ట, జటాయువు, పర్ణశాల, భద్రాచలాన్ని కలిపి ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌గా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని కె.సి.ఆర్‌ తెలిపారు. పర్ణశాల ప్రాంతంలో పార్కులు ఏర్పాటుచేస్తామని, అక్కడ 10 ఎకరాల సంస్థవున్నదని, అక్కడ సీతాదేవి వనంలో నివసించిన గుర్తులు వున్నాయని, వీటి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం 

వచ్చే మూడు, నాలుగేళ్ళలో ఖమ్మం జిల్లాలో వందశాతం ఇరిగేషన్‌ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రటించారు. ఖమ్మం జిల్లా రెండునదుల బేసిన్‌లో వుంది. 60 శాతం గోదావరి నది బేసిన్‌ లో వుంటే, 40 శాతం కృష్ణానది బేసిన్‌లో వున్నదని, రెండు నదుల మధ్య వున్న ఖమ్మం జిల్లాలో కరువు వుండేందుకు వీలులేదని సి.ఎం చెప్పారు. ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూపారే గోదావరి ఉన్నా, 60 ఏళ్ళలో జరిగింది శూన్యమని, రాబోయేమూడు, నాలుగేళ్ళలో ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందిస్తామని, ఆచరణలో చూపిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

”గిరిజన బిడ్డలు ఎక్కువగా వున్న జిల్లా ఇది. ఈ జిల్లాలో పోడు భూముల సమస్య వుంది. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు పోడు భూముల సమస్యపై పర్యావరణ మంత్రితో మాట్లాడాను. ధ్వంసం అయిన అటవీ ప్రాంతం పోను మిగిలిన అటవీ ప్రాంతాన్ని పరిరక్షించాలి. పోడు భూములకు సంబంధించి గిరిజనులను ప్రతినిత్యం సతాయించడం కూడా మంచిది కాదు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరిస్తాం 

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్ళిన ఏడు గ్రామాలలో భద్రాచలం సమీపంలోని నాలుగు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామని, భద్రాచలం దాటిన తరువాత వున్న శబరి నదికి ఇవతల ప్రాంతాన్ని అంతా తెలంగాణకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరామని, ఇందుకు ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు.

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ముందుకు వెళ్తామని, గిల్లికజ్జాలతో సాధించేది ఏమీ లేదని, ఇది ఇద్దరికీ నష్టమేనని అంటూ, ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమైనంత సహకారం అందించేందుకు సిద్ధమని సి.ఎం చెప్పారు. దుమ్ముగూడెం తర్వాత గోదావరి నీటిని వాడుకొనే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు వున్నదని, గోదావరి నీటిలో 1000 టి.ఎం.సిల నీటిని తెలంగాణ వాడుకున్నా, ఇంకా 1500 టి.ఎం.సిల నీటిని ఏ.పి వాడుకునే అవకాశం వున్నదన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు దాటిన తరువాత ఏటా 1000 నుంచి 1500 టి.ఎం.సిల నీరు సముద్రంలో కలసిపోతోందని, వాటిని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తాను సూచించినట్టు కె.సి.ఆర్‌ తెలిపారు. సమస్యల పరిష్కారానికి పరస్పర సహకారం అవసరమన్నారు.

Other Updates