‘తిలకాష్ట మహిషబంధం’ అని వ్రాయని కావ్యానికి నామకరణంచేసి తెనాలి రామకృష్ణ కవి ప్రత్యర్థి కవిని అలనాడు చిత్తు చేసినా, ఈనాడు-‘మహిషబంధం’కు కావ్యగౌరవం కలిగిస్తూ సృజనాత్మక చిత్రాలను గీస్తున్న వర్ధమాన కళాకారుడు-సాయం భరత్‌యాదవ్.
ఈ ‘మహిషబంధం’ పండిత కవులనే తికమకపెట్టే తెనాలి రామకృష్ణకవి ‘తిలకాష్ట మహిషబంధం’ కాదు తన ఇష్ట ‘మహిషబంధం’ పెంపుడు జంతువులను పొందికగా, వాటి జీవనశైలిని కళ్లకు కడుతూ ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న మహిషాలతో బంధమిది. భరత్‌యాదవ్ జన్మత: మహిషాలతో బంధం కలవాడు కాబట్టి, గేదెలపాలు విక్రయించి గాదెలు నింపుకుని జీవనం సాగించే కుటుంబ వ్యవస్థలోని వాడు కాబట్టి, దున్నపోతునే ‘సదర్’గా గౌరవించి అంతా కలిసికట్టుగా జీవించే,గోవును మాతగా పూజించే కుటుంబ వ్యవస్థలో పెరిగి పెద్దవాడైనవాడు కాబట్టి – ఆ జీవులతత్వం తెలిసి, తనదైన ముద్రతో రసరమ్య చిత్రాలు గీస్తున్నాడు. గోవులు, మహిషాలంటే భరత్‌యాదవ్‌కు ఎంతో ఆదరణ ఆకర్షణ. వాటి కొమ్ములతీరు, చిన్నచిన్న కండ్లు, కాళ్ళు, గిట్టలు-వాటి శరీరభాషను జీర్ణించుకున్నాడు. తెలుగు రాష్ట్రాలలోని గేదెలేకాదు రాజస్థాన్, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలోని ధులియా, గుజర్, సుఖా, సింఘాల్ ఇత్యాది జాతి గేదెల తీరుతెన్నులు అధ్యయనం చేసి, వాటిని రంగులు, రేఖలతో ఆవిష్కరిస్తున్నాడు.
ఉదాహరణకు గేదెల మాతృప్రేమను, బంధాన్ని వెల్లడించే ఒక చిత్రానికి ఆయన ఆకృతినిచ్చాడు. మనుషుల్లో మాదిరిగానే కొన్ని అనారోగ్య లక్షణాలవల్ల గేదెలు కూడా మృత శిశువులను కంటాయి. కాని పాపం వాటికి తన బిడ్డకు ప్రాణం లేదని తెలియదు. పైగా ఆ దుడ్డెను దగ్గరకు తీసుకుని నాకెయ్యాలనీ, పాలివ్వాలని మాతృ హృదయం ఆరాటపడుతుంది. పిల్ల ఉంటేనే పాల చేపులు దక్కుతాయి. కాబట్టి యజమాని, దుడ్డె నమూనా తయారుచేసి, దాని చెంత ఉంచుతాడు. ఆ అమాయకపు గేదె అది తన పిల్లే అనుకుని చేపుతుంది, యజమాని కడవ పాలతో నింపుతుంది. లేదా దుడ్డె లేదని మాతృ హృదయం ఆక్రోశిస్తుంది, పాలివ్వదు. చూపుకే పొదుగు కానీ అది వట్టిపోతుంది.
గేదెల తాలూకు ఇంత ఉదాత్తమైన మాతృ ప్రేమను తెలిపే చిత్రం-భరత్‌యాదవ్ అలవోకగా గీశాడు.
ఇంతేకాదు దేశంలో ఉన్న నానారకాల గేదెల ఆకృతులను, అలవాట్లను భరత్‌యాదవ్ బహు చిత్రాలలో కళాత్మకంగా ద్యోతకం చేశాడు. పై చూపుకు గేదెలన్నీ ఒకే తీరుగా కన్పించినా, వాటిలోని సూక్ష్మమైన తేడాలను తేటతెల్లంచేసే సలక్షణ చిత్రాలకు ఆయన ఊపిరులూదాడు.
‘ముద్దు’ అనే చిత్రంలో రెండు మహిషాలు ముద్దుపెట్టుకునే మనోభారంతో ఉన్నాయో, రెండింటి మధ్య వేలాడుతున్న పచ్చని తీగను తినాలనే కుతూహలంతో ఉన్నాయో, ప్రేక్షకులే నిర్ధారించుకోవాలి.
‘పాలవాడు’ అనే చిత్రం మనిషి కాయంలో మహిషం ప్రవేశించి నట్టుగా ఉంటుంది. ధులియా, గుజ ర్, సుఖా, సింఘాల్ శీర్షికగల చిత్రం మహిషాలలోని ఏకత్వంలోని భిన్న త్వాన్ని వ్యక్తం చేస్తుంది. ‘ఆధునికమైన మాంసం దుకాణం’ అనే చిత్రంలో మెడదాకా తెగ్గొట్టిన మేక ముఖ ప్రదర్శన బాధాకరంగా ఉంటుంది. శీర్షికలివ్వని అనేక చిత్రాలలో మహిషాల వికాసాన్ని, పరిణామక్రమాన్ని వివరించేవి ఉన్నాయి.
పచ్చికలు, మైదానాలు అంతర్థానమై సిమెంటు నిర్మాణాలు పెరిగిపోయిన నేపథ్యంలో, ప్రపంచీకరణ దెబ్బతో రేపటికోసం పరితపించే వాతావరణంతో ఇటీవల ఆయన రూపులుదిద్దిన మహిషాల చిత్రాలు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాయి. గత యేడాది ఈ అంశం తీసుకుని ఆయన వేసిన చిత్రానికి కేంద్ర లలితకళా అకాడమి అవార్డు వచ్చింది. కేవలం వేళ్ళపై లెక్కించగలిగినంత మంది తెలుగు చిత్రకారులకు మాత్రమే గత కొన్ని దశాబ్దాలనుంచీ ప్రదానం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించిందంటే-దాని వైశిష్ట్యం ఎంతో సుస్పష్టమవుతున్నది.
ఇదే కాకుండా 2004లో ఏఐఎఫ్‌ఏఎస్ (న్యూఢిల్లీ) ప్రశంసాపత్రం, 2003, 2006లో ఐసిఐసిఆర్ అవార్డులు, 1996, 2003, 2006లో హైదరాబాద్ ఆర్స్ట్ సొసైటీ అవార్డులు భరత్‌యాదవ్ చిత్రాలకు వచ్చాయి.
లోగడ ఈయన ‘మహిషాసుర మర్ధిని’ చిత్రం వేశాడు. లోహ ఘంటల సవ్వడి చేసే యముని మహిషపు నమూనాలు వేశాడు. దున్నపోతులు, గేదెలు, ఆవులు, దూడలు, కోడెలు, మేకలు మొదలగు పెంపుడు జంతువులతో తన అనుభవాలకు, జ్ఞాపకాలకు ఆయన రేఖలుగీస్తూ సహజసుందరమైన రంగులు అద్దుతున్నాడు.
నిజానికి ఆయన చిత్రాల్లో ఈనాటి సమాజం తీరుతెన్నులే చోటుచేసుకుంటూ పెంపుడు జంతువులను ప్రతీకాత్మకంగా చూపుతున్నాడు. ఈ జంతువుల మించి తన భావాలు, అనుభూతులు, మనోధర్మాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
భరత్‌యాదవ్ రూపొందించిన చిత్రాలను లోగడ న్యూఢిల్లీలో, దానికి పూర్వ ప్రదర్శన హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాడు.
పశు సంబంధ ప్రభావంతో అనే శీర్షికన తొలుత 2008లోనే ఆయన వ్యష్టి చిత్రకళా ప్రదర్శన హైదరాబాద్‌లో నిర్వహించాడు. 2007లో మ్యూనిచ్‌లో, 2010లో దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన సమష్టి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. 2005 నుంచి ఇట్టి ప్రదర్శనల్లో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇస్తూ, యేడాదిలో ఏడు పర్యాయాలు 2007లో, 2010లో కొత్తకొత్త చిత్రాలతో తన ఉనికిని చాటాడు.
ఇంతేకాదు 2005 నుంచీ హైదరాబాద్, ఉడిపి, భోపాల్, గోవా, బెంగుళూరు, మంగుళూరు, మైసూర్, న్యూఢిల్లీ తదితర నగరాల్లో జరిగిన డజనుకుపై చిత్ర కళా శిబిరాల్లో పాల్గొని తన ముద్రను వ్యక్తం చేసే చిత్రాలు గీసిచ్చాడు. దేశవిదేశాల్లో ఎందరో కళాహృదయులు ఈయన చిత్రాలు సేకరించారు.
హైదరాబాద్ నగరంలోని ఆగాపురాకు చెందిన బాలయ్యయాదవ్-రుక్కమ్మ దంపతులకు జన్మించిన భరత్‌యాదవ్‌కు చిన్ననాటి నుంచే చిత్రకళపట్ల, సంగీతంపట్ల అభిరుచి ఉంది. ప్రాథమిక తరగతుల్లో ఉన్నప్పుడే తన తృష్ణ తీర్చుకోవడానికి నాంపల్లి వ్యాయామశాల ఉన్నత పాఠశాల నుంచి జవహర్ బాలభవన్‌లో చిత్రకళ, సితార నేర్చుకోవడం ప్రారంభించాడు. సుప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం బాలభవన్‌లో పిల్లలకు చిత్రకళలో తర్ఫీదు ఇచ్చేవాడు. కాలక్రమంలో వైకుంఠం బొమ్మలు చూసి ఎంతో ప్రభావితుడైన భరత్‌యాదవ్ తాను చిత్రకారుడు కావాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్ ఫైనల్ కాగానే జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యా లయంలోని లలితకళల కళాశాలలో చేరడానికి ర్యాంకు లభించినా, ప్రయత్నం ఫలించలేదు. చివరికి శ్రీవెంకటేశ్వర లలితకళల కళాశాలలో చేరి బిఎఫ్‌ఏలో ఉత్తీర్ణుడయ్యాడు. అనం తరం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలోని సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరి పెయింటింగ్ ప్రత్యేక అంశంగా డిఎల్‌ఎన్‌రెడ్డిలాంటి ప్రముఖ చిత్రకారుడి నేతృత్వంలో ఎం.ఎఫ్.ఏ. 2004లో పూర్తి చేశాడు. అనంతరం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రెండేండ్లు, ‘కళాహిత’ గ్యాలరీలో మూడేండ్లు ఉద్యోగం చేశాడు.ఈలోగా చిత్రకారుడుగా తనకొక గుర్తింపు రావడంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, పూర్తికాలం చిత్రకారుడుగా తన స్టూడియోలోనే కృషి చేయడం ప్రారంభించాడు. దేశంలో జరిగే సమష్టి చిత్రకళా ప్రదర్శనల్లో, చిత్రకళా శిబిరాల్లో పాల్గొని తన ప్రత్యేకతను లోకానికి చూపించాడు తన ధోరణిలో ఏ చిత్రం వేసినా ఆక్రాలిక్, బొగ్గు, బంగారు రంగులతో, సాధారణంగా 58’I58′ కొలతల క్యాన్వాసుపై ఆర్ట్ కాగితంపై చేతితో తయారుచేసిన కాగితంపై ఎంతో భారీగా రూపొందించడం భరత్‌యాదవ్ పద్ధతి.
ప్రస్తుతం తన కళావస్తువులను ఇతర మాధ్యమాలైన దారు లేదా తుక్కు లోహం కళాకృతులలోకి మార్చాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆహ్లి కొత్తగా రూపొందించిన భరత్‌యాదవ్ మహిషాల తాజా కళాఖండాల ప్రదర్శన త్వరలో చూడవచ్చు.
టి. ఉడయవర్లు