golkondaకాకతీయ చరిత్ర పునాదుల్లో ప్రధాన భూమికను పోషించిన ఎలగందుల ఖిల్లాకు వేనవేలనాటి చరిత్ర వుంది. అసమాన వారసత్వ పరంపరను తనలో దాచుకొని హిందూ, ముస్లిం సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తోంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 13 కిలో మీటర్ల దూరంలో ఎలగందుల గ్రామంలో ఈ ఖిల్లా వున్నందున దీనినే ‘ఎలగందుల ఖిల్లా’గా పిలుస్తారు.

కరీంనగర్‌ జిల్లాలోని ఎలగందుల కోట వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత ప్రధానమయిన కోట. 1195 సంవత్సరంలో ఈ కోటపై పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చిన మాధవ రాజు జైతుంగి ఇక్కడి ప్రభువు రుద్రను హతమార్చి ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరకాలంలో ఈ దుర్గం కాకతీయ వంశీయుల చేతికి రాగా 1295 నుంచి 1323 వరకూ కాకతీయులలో ప్రముఖుడైన ప్రతాపరుద్రుడు ఈ కోటను పాలించి సరికొత్త మెరుగులు దిద్దాడు. 1323లో ఢల్లీి సుల్తాన్‌ మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తినప్పుడు అపురూప రాతికట్టడంతో సహజంగా ఆకర్షించే ఈ ఖిల్లాను స్వాధీనపరచుకున్నాడు. ఆపై ఈ ఖిల్లా కొంతకాలంపాటు నవాబు వంశీయుల చేతిలో వుండి 1523లో కుతుబ్‌షాహీ వంశస్తుడైన కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ ఏలుబడిలోకి వచ్చింది. 1687లో ఢల్లీి చక్రవర్తి ఔరంగజేబు కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ను యుద్ధంలో ఓడించడంతో ఈ ఖిల్లా మొగల్‌చక్రవర్తుల పాలనలోకి వెళ్లింది. ఔరంగజేబు ఇక్కడ ఆలంగిరి మసీదు కట్టించి కోటపక్కనే బింద్రాబస్‌ నిర్మించాడు. 39 సంవత్సరాల పాటు ఈ ఖిల్లా మొగలాయి చక్రవర్తుల పాలనలో వుండి తరువాత 1724లో మొదటి నిజాం ప్రభువు అయిన నిజాం ఉల్‌ ముల్క్‌ 1వ అసిఫ్‌జాహీ పాలనలోకి వచ్చింది. అప్పటి నుంచి నిజాంచేత నియమింపబడిన జాగీర్‌దార్లు, కల్లేదార్లు ఎలగందుల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగించారు.

కోటలో ఎటు చూసినా కూలిన ప్రాకారాలు… శిథిలమైన బురుజులు, ఒరిగిపోయిన రాతి గోడలు. వేయి సంవత్సరాల వైభవోపేతమైన చరిత్రగల ఎలగందుల ఖిల్లా కాలగర్భంలో కలిసిపోతూ శిథిలావస్థలో మిగిలిన ఓ అపురూప నిలువెత్తు సాక్షీభూతం… చారిత్రక స్మృతిపథంలో సనాతన ధర్మాలు, ఎన్నెన్నో సాంఘిక ఆచారాలను సజీవ సంస్కృతిని తనలో దాచుకున్న ఒక అరుదైన దుర్గం. రాజ్యవిస్తరణ కాంక్షతో సామంతుల క్షేత్రంగా పరిఢవిల్లిన ఈ ఖిల్లాలో సహజసిద్ధమైన నైసర్గిక నేపథ్యమేకాదు రాతి శిలలను తొలచి, అందమైన శిల్పాలను రమణీయంగా మలచిన నాటి స్థపతుల అద్భుత ప్రతిభ కానవస్తుంది. కోటలో అడుగడుగునా కనిపించేవారి ప్రతిభ అప్రతిహత ఆలోచనా సంపత్తిని వేనోళ్ళ పొగడాలనిపిస్తుంది. వీరయోధుల ప్రతాపానికి, ధీరయోధుల ప్రభావానికి ప్రతీకగా నిలిచి… ఇంద్రచాపంలోని ఇంపైన రంగుల్లా కళకళలాడిన ఈ కోట నేడు పాలకుల నిర్లక్ష్యంతో కళావిహీనమైన కాంతిపుంజంలా మౌనంగా, మూగగా రోదిస్తోంది. ఘనీభూతమైన భగ్నఅవశేషాల మధ్య తనవారి గుప్పెడు ఆదరణకోసం ఎదురుచూస్తోంది.

కాకతీయ చరిత్ర పునాదుల్లో ప్రధాన భూమికను పోషించిన ఎలగందుల ఖిల్లాకు వేనవేలనాటి చరిత్ర వుంది. అసమాన వారసత్వ పరంపరను తనలో దాచుకొని హిందూ, ముస్లిం సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తోంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 13 కిలో మీటర్ల దూరంలో ఎలగందుల గ్రామంలో ఈ ఖిల్లా వున్నందున దీనినే ‘ఎలగందుల ఖిల్లా’గా పిలుస్తారు. కాకతీయుల కాలం నుంచి నిజాం చివరి నవాబుల కాలం వరకూ ఎన్నో రాచరిక సామంత రాజ్య వ్యవస్థల కేంద్రబిందువుగా నిలిచిన ఈ ఖిల్లా ఎందరెందరో చక్రవర్తులు, రాజులు ప్రభువుల ఏలుబడిలో దేదీప్యమానంగా అలరారింది. సుమారు 200 అడుగుల ఎత్తు, రెండున్నర మైళ్ళ (3 కి.మీ.) విస్తీర్ణంలో ఈ దుర్గం వెలసింది. కోట ప్రవేశానికి ముందు సుమారు 25 అడుగుల ద్వారం స్వాగతం పలుకుతుంది. ప్రధాన ద్వారం దాటి లోనికి వెళితే, కోట లోపలి ప్రాకారాన్ని ఆనుకొని 12 అడుగుల లోతులో కోట చుట్టూ పెద్ద కందకం కానవస్తుంది. నాటి రాజులు ఈ కందకంలో వందలాది మొసళ్ళు పెంచి, బయటినుండి శత్రువులు కోటలోకి రాకుండా తమని తాము రక్షించుకొనేవారు.

కోట లోపల ఆకుపచ్చని తివాచీ పరచినట్లుగా ఉద్యానవనం, రకరకాల పూలతోటలు, పండ్ల తోటలు, నాటి ప్రభువుల ఆహ్లాదభరిత, మనోభిలాషకు తార్కాణంగా నిలుస్తాయి. అయితే అవన్నీ నేడు పాడుబడిన పిచ్చిమొక్కలతో నిండిపోయి నాటి ఉద్యానవన ఆనవాళ్ళే లేకుండా పోయాయి. కోట శిఖరాన్ని చేరుకోవడానికి రాతి శిలలను తొలిచి, మెట్లుగా నిర్మించిన నాటి స్తపతుల మేథోసంపత్తి అడుగడుగునా ఆశ్చర్యం గొల్పుతుంది. మూలలు తిరిగే ప్రదేశాలలో ఒక్కో సైనికాధికారికి ఏర్పాటు చేసిన బస, శత్రువు కోటలోనికి ప్రవేశించినా తప్పించుకొని బయటకు వెళ్ళలేని రీతిలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన నాటి భద్రతా ఏర్పాట్లు గొప్పవిగా తోస్తాయి. కోట పైభాగాన నలుదిశలా ఫిరంగి దళాల ఏర్పాటు, నీటి కోసం నిర్మించిన కొలను నమూనా, కచేరీల కోసం, దర్బారు కోసం రూపొందిన వాస్తు నిర్మాణాలు ఈ కోట ప్రత్యేకతను తెలియజేస్తాయి.

గతంలో ఈ గ్రామాన్ని బహుధాన్యపురం అని, వెలిగందుల అనే పేరుతో పిలిచేవారని చరిత్ర శోధకులు పేర్కొంటారు. ఈ గ్రామంలోని చింతామణి చెరువు వద్ద క్రీ. శ. 1202 నాటి శిలాశాసనం ఉంది. కాకతీయ గణపతిదేవుని సేనాని మల్యాల వంశానికి చెందిన చౌండ ప్రగ్గడ కాలంలో వాయిద్య విద్వాంసులు శ్రీకరణ, భసవోజీలకు ఇక్కడి నరసింహదేవర పేరున గల మాన్యాల దానాలిచ్చినట్లు ఈ శాసనంలో ఉంది. బహుశా గతంలో ఈ కోటలో నరసింహస్వామి మందిరం ఉండి ఉంటుంది. ఈ ఖిల్లా కాకతీయుల కాలంలో వారి సామంతుల పాలనలో వైభవాన్ని చవి చూసింది. 1138-1140 మధ్య కాలంలో ఓరుగల్లును పాలించే రెండో ప్రోలరాజు దండయాత్ర తర్వాతే ఎలగందుల దుర్గం ప్రాభవంలోకి వచ్చినట్లు చరిత్ర ఆధారాలున్నాయి. ఆయన ఎలగందుల ఖిల్లాతోపాటు నాటి పొలవాస (ప్రస్తుత పొలాస), మంత్రకూటం (మంథని) మండలాలను తన ఏలుబడిలోకి తీసుకొచ్చినట్లు శాసనాల్లో ఉంది.

కాకతీయుల అనంతరం ముప్ప భూపాలుడు రామగిరిని రాజధాని కేంద్రంగా సబ్బి మండలాన్ని (కరీంనగర్‌) పరిపాలన చేశాడు. ఇతని మంత్రి అయిన కేసన స్వంత సోదరుడు కందన ఎలగందుల కోటకు కొంత కాలం అధిపతిగా ఉన్నాడు. అనంతరం కులీకుతుబ్‌ షాహీ వంశీయుల పాలనలోకి ఈ కోట రాగా, కులీ కుతుబుల్‌ ముల్క్‌ (1518-1543) కాలంలో ఎలగందుల కోట ఖివాముల్‌ ముల్క్‌ అనే సామంత ప్రభువు ఆధీనంలో ఉండగా, కుతుబ్‌షాహీ వంశ మొదటి పాలకుడు సుల్తాన్‌ కులీ ఈ దుర్గంపై దండెత్తి వచ్చి కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1550-1580 మధ్య కాలంలో ఇబ్రహీం కుతుబ్‌షా ఢల్లీి ప్రభువుగా ఉండగా, ఎలగందుల కోటకు జగదేవ్‌రావునాయక్‌ అనే సామంతుడిని అధిపతిగా నియమించాడు. అయితే నాయక్‌ కొంతకాలం తర్వాత ఢల్లీి ప్రభువుపైకి తిరగబడి, కోటకు స్వాతంత్య్రం ప్రకటించుకోగా కుతుబ్‌షా పంపిన సేనల ముందు ఓడిపోయి బేెరార్‌ అనే రాజ్యానికి పారిపోయాడు. అక్కడ దరియా ఇమాదుల్‌ ముల్క్‌ అనే రాజు సాయంతో ఎలగందుల దుర్గంపై దండెత్తివచ్చినప్పుడు రక్తపుటేరులే ఈ కోట చుట్టూ పారాయని చరిత్ర పరిశోధకులు పేర్కొంటారు. వేలాది మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలొడ్డినా, ఎలగందుల కోట కుతుబ్‌ షాహీల పాలనలో కొంతకాలం కొనసాగింది. 1637లో ఔరంగజేబు చక్రవర్తి గోల్కొండను జయించగా, మొగలుల సుబేదార్‌ అయిన ముబారిజ్‌ ఖాన్‌ ఆధీనంలోకి ఈ దుర్గం వచ్చింది. మొగలు సామ్రాజ్య పతనానంతరం హైదరాబాద్‌ను ఏలే ఆసఫ్‌జా నవాబు స్వాత్రంత్యం ప్రకటించుకొన్నాడు. 1724 నుంచి ఆసఫ్‌జా నవాబుల ఆధిపత్యంలో ఎలగందుల ఒక సర్కారుగా ప్రకటించబడిరది. 1724 నుంచి 1748 వరకు అమీన్‌ ఖాన్‌ అనే సామంతుడ్ని హైదరాబాద్‌ నవాబు ఈ దుర్గానికి దుర్గాధిపతిని చేశాడు. అమీన్‌ఖాన్‌ మరణాంతరం అతని కుమారుడు ముకర్రబ్‌ ఖాన్‌ పాలించగా, పుత్ర సంతానం లేని అతని మరణానంతరం వారసత్వ తగాదాలు పెరిగి హైదరాబాద్‌ నవాబు సలాబత్‌జంగ్‌ వరకు సమస్య వెళ్ళగా, ఆయన మున్వర్‌ఖాన్‌ అనే వ్యక్తిని ఎలగందుల ఖిల్లాకు వారసునిగా ప్రకటించాడు. అతని తదనంతరం సలాబత్‌జంగ్‌ పరిపాలనలోనే ముబారిజుల్‌ ముల్క్‌ ఇబ్రహీంఖాన్‌ ధంసా ఎలగందుల కోట అధిపతి అయ్యాడు. ఇతనే 1754లో ఎలగందుల కోటను మరింత తీర్చిదిద్ది, దుర్గాన్ని బలిష్టంగా తయారుచేశాడు. అతని తర్వాత పాలనకు వచ్చిన అతని కుమారుడు ఫారుఖ్‌ మీర్జా ఎహతెషామ్‌ జంగ్‌ ఎలగందుల పాలన ఇష్టానురాజ్యంగా చేయడంతో నాటి హైదరాబాద్‌ నవాబు రెండో అసఫ్‌జా నిజాం అలీఖాన్‌ 1791లో ఈ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని యుద్ధంలో ప్రాణభిక్ష కోరిన ఎహతెషామ్‌ను హైదరాబాద్‌ సంస్థానం పరిధిలో ఉన్న బెరార్‌కు దుర్గాధిపతిగా నియమించాడు. 1803-1829 మధ్యకాలంలో హైదరాబాద్‌లో మూడో ఆసఫ్‌జా ప్రభువు పాలన చేస్తూ, ఆయన పరిధిలో ఉన్న ఎలగందుల ఖిల్లాకు బహదూర్‌ఖాన్‌ను నియమించాడు. అతని తదనంతరం సయ్యద్‌ కరీముద్దీన్‌ ఖిలేదార్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1897లో ఎలగందుల జిల్లాలో చెన్నూరు (ఆదిలాబాద్‌), జగిత్యాల, జమ్మికుంట, కరీంనగర్‌, లక్సెట్టిపేట (ఆదిలాబాద్‌), మహదేవపూర్‌, సిద్ధిపేట (మెదక్‌), సిరిసిల్ల, సుల్తానాబాద్‌ అనే తొమ్మిది తాలూకాలు ఉండేవి. అప్పటి ఖిలేదారు అయిన కరీముద్దీన్‌ ఎలగందుల ఖిల్లాకు ఆరు కి.మీ. దూరంలో మానేరు నది ఉత్తర తీరంలో తన పేరున కరీంనగర్‌ పట్టణాన్ని స్థాపించాడు.

1905లో హైదరాబాద్‌ షాదుషాగా ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌అలీఖాన్‌ ఉన్న కాలంలో అతని ప్రధానమంత్రి సర్‌ కిషన్‌ప్రసాద్‌ హైదరాబాద్‌ స్టేట్‌లోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయగా 1905లో జిల్లా కేంద్రం ఎలగందుల నుంచి కరీంనగర్‌కు మారింది. అప్పటి నుంచి అవ్వల్‌దార్‌ (కలెక్టర్‌) ఆధ్వర్యంలో పాలన సాగింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత 1905లో లక్సెట్టిపేట, చెన్నూరు తాలూకాలు ఆదిలాబాద్‌లో, సిద్ధిపేట మెదక్‌లో కలిశాయి. నూతనంగా పర్కాల తాలూకా (వరంగల్‌) కరీంనగర్‌ జిల్లాలో చేర్చారు. ఏడు తాలూకాలతో పాలన సాగింది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంగా మారిన నాటి నుండి ఈ కోట అంటే 1905 నుంచి నిరాదరణకు గురవుతోంది. వందేళ్ళుగా ఆలనా పాలనా కరవై చివరికి శిథిలావస్థకు చేరుకుంది. కోటలోని మసీదులు, సమాధులు, నీలకంఠేశ్వర, నరసింహాలయాలు సందర్శకులను నేటికీ అబ్బురపరుస్తాయి. వేల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా మిగిలిన కోటకు పునరుద్ధరణ చేసి సందర్శకులను పెంచడానికి కృషి చేస్తే నాటి చరిత్రను భావితరాలకు సజీవంగా అందించినవాళ్ళమవుతాం.

Other Updates