tsmagazine

 

అక్కినేపల్లి వేణుగోపాల్‌రావ్‌
సీ|| భాగ్యనగరమందు భాసిల్ల తెనుగెంతో
సభలు జరుప సంతసించె మనసు
తెలుగు భాషకున్న తేజమ్ములన్‌ గాంచ
గొప్ప కవులు యిచటి కొచ్చిరనగ!
కనని వినని యట్టి కార్యక్రమాల్జూసి
కవుల కలములెన్నో కవితలల్లె!
చంద్రశేఖరు తీరు చైతన్య మున్‌గూర్చ
జయజయధ్వానాలు చేసి రిచట!

ఆ.వె|| తెలుగు పూర్వకవుల ధీటైన చందముల్‌
నేటితరము జూసి నేర్చుకొనగ
భళిరభళిరయంచు బహుజనాల్‌ మెచ్చంగ
విశ్వతెలుగు సభలు విభమమందు||

సీ|| మాతృభాషకున్న మాధుర్య మొప్పార
బడులలోన తెలుగు పరిమళించు!
ప్రభుత నిర్దేశ్యమ్ము బహుమేళ్ళు కలిగించు
ప్రాభవమ్ము హెచ్చు ఫలితమిచ్చు!
తెనుగు పద్య మరయ దేశఖ్యాతిని పెంచు
భావిజీవితమెల్ల ప్రగతి పొందు
తెలుగు కవుల దివ్య దేశాభిమానంబు
తేట తెల్లమగును తెలియు జగతి!

ఆ.వె|| కీర్తి శేషులైన కీర్తి తెచ్చిన వారి
కీర్తి పంచ మనకు కీర్తి కలుగు!
విశ్వ తెలుగు సభల వైశిష్ఠ్య పంథాలు
విశ్వవ్యాప్తి చెందు వెలయు ఘనత!

చం|| భలె భలె యంచు నీ సభల ప్రాంగణ
మెల్లయు మారు మ్రోగగా
పలుపలు దేశకోవిదులు పాదములెట్టిరి మోదమంద్రిగా
వెలయగ తెల్గు వెల్గులిట వేయగ ముద్రలు హృదయ సీమలన్‌
తలచుచు ముఖ్యమంత్రికి ప్రధానము చేసిరి దీవెనాక్షతల్‌!

Other Updates