ktrనగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదారమ్మ ఉరుకులు, పరుగులతో హైదరాబాద్‌ మహా నగరానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయించడంతో కొండపాక, ఘన్‌పూర్‌ రిజర్వాయర్లను దాటుకుంటూ జీడిమట్ల రిజర్వాయర్‌లోకి దూసుకొచ్చింది. నవంబరు 27న గోదావరి జలాలు జీడిమట్లకు రావడంతో అక్కడి స్థానిక సర్పంచ్‌ చింతల లక్ష్మి తదితరులు కొబ్బరికాయలు కొట్టి, పూజలు నిర్వహించి గోదావరిమాతకు స్వాగతం పలికారు.

ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ నుంచి 18 ఎంజీడీల నీటిని జీడిమట్ల పారిశ్రామిక వాడ రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. గోదావరి జలాలను నగరానికి చేర్చడానికి ప్రభుత్వం ఎన్నో సమస్యలను అధిగమిస్తు ముందుకు సాగింది. భూవివాదాలు, పైపులైన్‌ లీకేజీలు, సాంకేతిక కారణాలు ఇలా ఎన్నొ సమస్యలను పరిష్కరించుకుంటూ పైపులైన్‌ పనులను త్వరగా పూర్తి చేసి నీటిని తేవడానికి మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు ఎంతగానో కృషి చేశారు. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించి నీరు నగరానికి చేరుకునే వరకు అహర్నిశలూ శ్రమించారు.

గోదావరి జలాలను తరలించడానికి రూ. 3375 కోట్ల నిధులు ఖర్చుచేసి, మొత్తం 186 కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మాణం చేశారు. నిర్మాణం పూర్తయి, ట్రయల్‌ రన్‌ విజయవంతమై, నగరంలోని ప్రజలు గోదావరి జలాలను తాగడానికి అవకాశం లభించింది. మంజీరా జలాలు అడుగంటిపోయి అవి నిలిచిపోయే సమయంలో గోదావరి జలాలు రావడంతో ప్రజలకు మంచినీటి సమస్య తప్పిపోయింది. లేదంటే నీటి సమస్య ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురిచేసేది. గోదావరి జలాలు నగరానికి రావడంతో జలమండలి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘన్‌పూర్‌ వద్ద స్వాగతం పలికిన కేటీఆర్‌

గోదావరి జలాలు ముందుగా కొండపాక రిజర్వాయర్‌ నుంచి ఘనపురం రిజర్వాయర్‌లోకి ఈనెల 24న చేరుకున్నాయి. అక్కడ మంత్రి కేటీఆర్‌ గోదారమ్మకు స్వాగతం పలికారు. గోదావరి జలాలను తలపై చల్లుకుని పొంగిపోయారు. అక్కడ ట్రయల్‌రన్‌ను కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా బేసిన్‌లో ఉన్న హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకురావడం భగీరథ ప్రయత్నమేనన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి అటవీశాఖ, రక్షణశాఖ, రైల్వేశాఖ, జాతీయ రహదారుల సంస్థలతో అనుమతులు ఇప్పించడం వల్లనే త్వరగా పనులు పూర్తయ్యాయన్నారు.

జలమండలి అధికారుల కృషి వల్ల రిజర్వాయర్‌ నిర్మాణం, ట్రయల్‌రన్‌, పంపింగ్‌ పనులు త్వరగా పూర్తయ్యాయన్నారు. వాస్తవంగా డిసెంబర్‌ 15వరకు గోదావరి నీరు నగరానికి రావాలని గడువు ఉండగా, గడువుకు ముందే గోదావరి జలాలు నగరానికి చేరుకున్నాయని, అధికారుల పనితీరును ప్రశంసించా రు. నగరానికి మంచినీటిని అందించే జంట జలాశయాలు గండిపేట, హిమాయత్‌సాగర్‌లు ఎండిపోయాయన్నారు. మంజీరా నీరు కూడా నీటి కొరతతో వచ్చే అవకాశాలు తగ్గిపోయాయన్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గోదావరి జలాలు నగరానికి రావడం ఎంతో మేలు చేసిందన్నారు. ఈ నీటితో జీడిమట్ల, కుత్బుల్లాపూర్‌, లింగంపల్లి, శేరిలింగంపల్లి, అల్వాల్‌ తదితర ప్రాంతాల ప్రజల తాగునీటి ఇబ్బందులు తీరుతాయన్నారు. నగరానికే కాకుండా మేడ్చెల్‌, సిద్ధిపేట, గజ్వేల్‌, ఆలేరు, భువనగిరి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలకు కూడా తాగునీరు అందించడానికి ప్రణాళికలు రూపొంది స్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో తాగునీటి సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎం.డి. జనార్దన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Other Updates