టి. ఉడయవర్లు
గ్రామ సీమలో బట్టకట్టిన అసలుసిసలు భారతీయ జీవితాన్ని రంగులలో మూర్తీభవింప జేసే యత్నంలో నూటికి నూరుపాళ్ళు కృతకృత్యుడైన వాస్తవిక ధోరణి చిత్రకారుడు ఇరుకుల కుమారిల్‌స్వామి. మన దేశం, మన సంప్రదాయం, మన పద్ధతులను అతిక్రమించి కుంచెనెన్నడూ ఆయన నడిపించలేదు. అట్లా గని పాత చింతకాయ పచ్చడి భావాలనే ఆయ న చిత్రాల్లో పొందుపరచలేదు. నవీనతకు ప్రాణంపోస్తూ, అందరు చిత్రకారులు అలక్ష్యం చేసిన పేదల కన్నీళ్ళను, వారి జీవితాల్లోని చీకటి వెలుగులను యధార్థంగా, కళాత్మకంగా కన్నులకు కట్టిన భారతీయ చిత్రకారుడు ఆయన.
బెంగాల్ వాష్ టెక్నిక్ చిత్రాలు వేయడంలో డ్రాయింగ్‌లను, జలవర్ణ చిత్రాలను, టెంపేరా పద్ధతి చిత్రాలకు కుడ్య చిత్రాలను కమనీయంగా రూపొందించడంలో కుమారిల్ స్వామి ప్రత్యేకంగా పేర్కొనదగిన చిత్రకారుడు. లయానుగతమైన రేఖలకు మనోజ్ఞమైన వర్ణ సమ్మేళనానికి, భావగాంభీర్యానికి, వైవిధ్యానికి ఆయన గీసే చిత్రాలు నెలవులు.
బెంగాల్ వెళ్ళి శాంతినికేతనంలో ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు నందలాల్ బోస్ చెంత చిత్రకళలోని మర్మాలన్నీ నేర్చుకున్నాడు. కాబట్టి వాష్ టెక్నిక్‌లో – ఆయన సహధ్యాయి ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు ను, కుమారిల్‌స్వామిని మించిన చిత్రకారులు బహుశా లేరు. ఈ ప్రక్రియలో పరిణతి సాధిం చి పండితులను, వస్తువురీత్యా పామరులను సైతం వీరు ఆకర్షించారు. వారి చిత్రాలు భారతీయ జీవితానికి పట్టిన అద్దంలాంటివి.
ఇవాళ్ళ సహకార భావనను శతసహస్ర రూపాలలో అమలులోపెట్టి శిఖరప్రాయ గ్రామంగా నిలిచిన కరీంనగర్ జిల్లా ముల్కనూరులోని నిరుపేద దళిత కుటుంబంలో ఇరుకులవారింట్లో 1924 నవంబర్ 24న పుట్టిన కుమారిల్‌స్వామి ‘వటుడు ఇంతై ఇంతింతై’ అన్నట్టుగా జాతీయస్థాయి చిత్రకారుడుగా ఎదిగిపోయాడు. ఐదారు సంవత్సరాల ప్రాయంలోనే చిత్రకళ పట్ల అత్యంత ఆసక్తి మొలకెత్తిన కుమారిల్‌స్వామి తన తల్లి వాకిట్లో ముగ్గులు వేయడం చూసి, తల్లికి తెలియకుండా మరో ప్రక్క తాను కూడా ముగ్గులు వేసిననాడే తన భావి జీవిత సౌధానికి ముగ్గు వేసుకున్నాడని చెప్పవచ్చు.
చిన్నతనంలోనే తండ్రి కన్నుమూయడంవల్ల ఆయన తల్లి ముల్కనూరులో ప్రాథమిక విద్య పూర్తి కాగానే, తన అక్కతోపాటు కరీంనగర్ పంపి మాధ్యమిక పాఠశాలలో చేర్పించింది. ఆ సమయం వారి కుటుంబం ఆర్థికంగా మరీ చితికిపోవడంవల్ల బతకడానికి హైదరాబాద్ నగరానికి తరలిపోయారు. అప్పుడే ఆంధ్ర మహాసభ ఏర్పడి జన సామాన్యంలోచైతన్యం వెల్లివిరుస్తున్న రోజులు. హైదరాబాద్ నగరంలో సరోజినీనాయుడు, ఆమె కుమార్తె పద్మజానాయుడు, రావి నారాయణరెడ్డిలాంటి ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న తరుణం. పైగా రావి నారాయణరెడ్డి హరిజన సేవక్ సంఘ్-హైదరాబాద్ శాఖకు అప్పుడు అధ్యక్షుడుగా ఎంతో చురుకుగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటూ దళితుల అభ్యున్నతికోసం అహరహం శ్రమిస్తున్నారు. ఆ సమయంలో చిన్నస్వామివద్ద చిత్రకళలోని మెళుకువలు నేర్చుకుని చిత్రాలు వేస్తున్న కుమారిల్‌స్వామిపై రావి నారాయణరెడ్డి కన్నుపడింది. అంతే ఆయన సంక్షేమాన్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో థక్కర్‌భాషా, మహాత్మాగాంధీ సిద్ధాంతాల ప్రేరణతో ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న వృత్తివిద్యా కళాశాలకు లేఖ వ్రాసి పంపారు. అక్కడ వృత్తి విద్యల్లో శిక్షణపొందే విద్యార్థులకు ఉచిత బస ఏర్పాటు చేయడంతోపాటు ఉచితంగా భోజనం పెట్టేవారు. అక్కడ కుమారిల్‌స్వామి వడ్రంగంలో శిక్షణ పొందాడు. ఒకవంక చేతివృత్తి శిక్షణ కొనసాగిస్తూనే, ఆ సంస్థలోగల గ్రంథాలయంలో కూర్చుని చిత్రకళపైగల గ్రంథాలను పరిశీలించడం ప్రారంభించాడు. ఈ దశలో ఆయన దృష్టిని అజంతా చిత్రాలుగల గ్రంథం విశేషంగా ఆకర్షించింది. ఆయన జీవితాన్నే ఆ గ్రంథం మరో మలుపు తిప్పింది. చిత్రకళలో ఎలాంటి తర్ఫీదు లేకుండానే అజంతా చిత్రాల ప్రతికృతులు కుమారిల్‌స్వామి అలవోకగా రూపొందించి, స్నేహితులకు బహూకరించేవారు. చేయి తిరిగిన చిత్రకారుడు కూడా చిత్రించలేనంత నైపుణ్యంతో అజంతా చిత్ర ప్రతికృతిని కుమారిల్‌స్వామి వేయడం గమనించిన థక్కర్‌భాషా, కుమారిల్‌స్వామి శిక్షణ పొందవ లసింది తాము నిర్వహిస్తున్న సాంకేతిక విద్యాసంస్థల్లో ఎంతమాత్రం కాదని, ఆయన సృజనశీలాన్ని పదునుపెట్టే చిత్రకళా సంస్థలో ననే నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీలో అప్పుడు ప్రసిద్ధికెక్కిన శారద ఉకిల్ ఆర్ట్ కళాశాలలో చేర్పించాడు. చిత్రకళ తనకు ప్రీతిపాత్రమైన విద్య కాబట్టి పగలు-రాత్రి అన్న తేడా లేకుండా నిరంతరం ఆ కళా సాధనలో ఆయ న నిమగ్నమయ్యాడు. ఎన్నెన్నో చూడచక్కని చిత్రాలు గీశాడు. ఆయన వేసే చిత్రాలు చూసి-సాక్షాత్తు భారత ప్రధాని కార్యదర్శిగా, అటు పిమ్మట విదేశాంగమంత్రిగా పనిచేసిన ధర్మవీర దంపతులు అభిమానులయ్యారు. ఆర్థికంగా వెన్నంటి నిలిచారు. ఇట్లా ఉకిల్‌లో చిత్ర కళావిద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తెలుగు పత్రికలు గృహలక్ష్మి, భారతిలాంటి వాటిలో మాత్రమేగాకుండా హిందుస్తాన్ టైమ్స్, నవభారత్ టైమ్స్‌లాంటి ఇంగ్లిష్ పత్రికల్లో ధర్మయుగ్, సాప్తాహిక్, ప్రతీక్‌లాంటి పలు మాగ్జిన్‌లయందు వారి రంగు చిత్రాలు అలంకరించాయి. పాఠకజనాన్ని అలరించాయి.
అంచెలంచెలుగా ఎదిగివస్తున్న కుమారిల్‌స్వామికి మరింత నైపుణ్యం లభిస్తే దేశం గర్వించే స్థాయి చిత్రకారుడవుతాడని భావించిన థక్కర్‌భాషా, ఆయనను బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు, ఆచార్యుడు నందలాల్ బోస్‌వద్ద శిక్షణకు 1944లో పంపాడు. అక్కడ నందలాల్‌వద్ద వాష్ టెక్నిక్, కుడ్య చిత్రకళలోని కిటుకులు నేర్చుకుని 1947లో తిరిగి ఆయన ఢిల్లీ వచ్చాడు. థక్కర్‌భాషా కోరిక, తన ఇష్ట ప్రకారం చిత్రకళ బోధించే ఆచార్యుడుగా 1982లో ఉద్యోగ విరమణ బోధకుడుగా పనిచేశాడు. చేసిన తర్వాత తాను చదువుకున్న ‘శారద ఉకిల్ ఆర్ట్స్ కళాశాల’కు ప్రిన్సిపాల్‌గా స్వచ్ఛందంగా పనిచేశాడు. ఎందరో యువ చిత్రకారులను తీర్చిదిద్దాడు. తన జీవిత పర్యంతం ఢిల్లీలో చిత్రకళ బోధిస్తూనే, ‘లలిత కళాకేంద్రం’మనే పేరున తన స్టూడియో నెలకొల్పి, తలమానికమైన చిత్రాలెన్నో వేశాడు. ముఖ్యంగా నవవంగ సంప్రదాయంలో ఆయన వేసిన చిత్రాలు ఆధునిక చిత్రకళారంగాన్ని సుసంపన్నం చేశాయి.
చిత్రకళా బోధనకు ఉపకరించేవిధంగా ‘భారతీయ కళా ఔర్ కళాకార్’ గ్రంథాన్ని హిందీలో ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రచురణల విభాగం కోసం రచించారు. అది అర్థనారీశ్వర చిత్రంలో ఆకర్షణీయంగా వెలువరించారు. ఆ తర్వాత ఆయన హిందీలోనే ‘కళాకే సాధక్’ అనే గ్రంథాన్ని సుప్రసిద్ధ భారతీయ చిత్రకారుల జీవిత కళా విశేషాలతో రచించాడు. దేశంలో, విదేశాల్లో జరిగిన పలు చిత్రకళా ప్రదర్శనలలో కుమారిల్‌స్వామి చిత్రాలకు చోటు లభించింది. కేవలం మూడు పర్యాయాలే ఆయన వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు. హైదరాబాద్‌లోని కళాభవన్‌లో సుమారు నాలుగు దశాబ్ధాల క్రితం ఆయన ఏర్పాటు చేసిన తన ఇరవైనాలుగు చిత్రాల ప్రదర్శన విశేషమైంది. అందులో తొమ్మిది చిత్రాలు వివిధ తరహాల్లో గీసిన ప్రకృతి చిత్రాలు ‘గుల్ మొహర్’, ‘ప్రకాశ్’, ‘బుద్ధ’, ‘కేదార్‌నాథ్’ అనే శీర్షికనగల చిత్రాలు ఆయన భావనా సంపత్తిని వ్యక్తం చేశాయి.
కాగా ‘గోధూళి’ అనే చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ ప్రదర్శనలో జలవర్ణచిత్రాలు, వాష్ పద్ధతి చిత్రాలు, తనకిష్టమైన టెంపెరా విధానంలో వేసిన చిత్రాలు ఉంచారు. భావపూరితమైన వీరి చిత్రాలకు భారత ప్రభుత్వస్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి అవార్డులు రాకపోయినా 1977లో బల్గేరియా ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలలో ‘హాస్యం-వ్యంగ్యం’ విభాగంలో వీరి చిత్రానికి తొలి పర్యాయం బహుమతి లభించింది. వీరు ఆ తర్వాత 1983లో బల్గేరియా ప్రభుత్వ విశిష్ట అతిథిగా ఆ దేశం పర్యటించి వచ్చారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వీరు ‘వేమన’ చిత్రం వేశారు. ఈ చిత్రంతోపాటు మరికొన్ని వీరి చిత్రాలు ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. వీరు వేసిన శంకరుడు, మురళీకృష్ణుడు, పార్వతి తపస్సు, బుద్ధుడు, ఆటవిక మహిళ, ఆవుల కాపరి, దీర్ఘాలోచన, అలజడి, పురోగమనం లాంటివి ఏనాటికైనా చెప్పుకోదగిన చిత్రాలు. ఢిల్లీలోని లలిత కళా అకాడమి మోడరన్ ఆర్ట్ గ్యాలరీలో, బిర్లా మ్యూజియం, రష్యన్ మ్యూజియం, కొరియన్ రాయబార కార్యాలయం, శ్రీలంక ప్రభుత్వ మ్యూజియం, బల్గేరియా మ్యూజియం ఆఫ్ హ్యూమార్ అండ్ సెటైర్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఢిల్లీ ఆర్ట్స్ కాలేజీ, సాహిత్య కళా పరిషత్‌లాంటి సంస్థలు ధర్మవీరలాంటి కళాభిమానులు వీరి చిత్రాలు సేకరించారు. పారిస్‌లోని యునెస్కో సంస్థ నిమిత్తమై భారతీ చిత్రాలు ఎంపిక చేసే అంతర్జాతీయ సంస్థ సభ్యుడుగా, భారతీయ కళా సంఘ: ఉపాధ్యక్షుడుగా వీరు అందించిన సేవలు ప్రస్తుతించదగినవి.
చిత్రకళే సర్వస్వంగా జీవితాంతం ఢిల్లీలో గడిపిన ఇరుకుల కుమారిల్‌స్వామి దాదాపు తన సప్తతిలో 1993లో తనువు చాలించినా, తన పరిణత చిత్రాలతో ఈనాటికీ, ఏనాటికీ చిరంజీవే.