భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆస్తి నష్టం జరిగితే ఎలాగోలా పూడ్చుకోవచ్చని, కానీ ప్రాణనష్టం జరిగితే పూడ్చలేమని సీఎం అన్నారు. కాబట్టి ప్రాణనష్టం జరగకుండా చూడాలని చెప్పారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలని, అవసరమైన సూచనలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల పట్టణాలు, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వర్షాలు, వరదల వల్ల మనుషులు, పశువుల ప్రాణాలు పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు. అధికారుల సూచనలు పాటించి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో సెప్టెంబరు 21న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండి కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారం ఆధారంగా స్పందించాలని కోరారు. అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గోదావరి ఉప్పొంగుతోంది జాగ్రత్త…
గోదావరి నది ఉప్పోంగుతున్నదని, ప్రమాదస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నదని, తెలంగాణ పరిధిలోని ఎస్ఆర్ఎస్పి, నిజాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టులన్నీ నిండాయని చెప్పారు. వాటి నుంచి నీరు విడుదల చేస్తున్నందున గోదావరికి గంటగంటకూ నీటి ప్రవాహం పెరగుతూనే ఉంటుందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి, తెలంగాణ లోని వివిధ ప్రాంతాల్లోని వాగులు, వంకల ద్వారా పెద్ద ఎత్తున నీరు గోదావరిలో చేరుతున్నదన్నారు. కాబట్టి కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏటూరు నాగారం వద్ద బస చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్ కరుణను, భద్రాచలం వద్ద ఉండి ఎప్పటికప్పుడు స్పందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావును సీఎం ఆదేశించారు. ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను, పశువులను ఖాళీ చేయించాలని చెప్పారు.
ప్రాజెక్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ
గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని, లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఇన్ ఫ్లోలను బట్టి ఔట్ ఫ్లోలను నిర్ధారించుకోవాలని మంత్రి హరీష్ రావును ఆదేశించారు. ప్రతీ ప్రాజెక్టు వద్ద నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తంగా ఉంచి, పర్యవేక్షించాలని మంత్రికి చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ తో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు నిండుతున్నాయని, చెరువుల అలుగుపోయడంతో గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కరువు తీరిపోయే విధంగా, మరో రెండేళ్ల వరకు కరువు దరిచేరని విధంగా వర్షాలున్నాయన్నారు. చెరువుల్లోకి నీరు రావడం వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని బోర్లకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. గోదావరి, కృష్ణా నీళ్లను హైదరాబాద్ మంచినీటి అవసరాల కోసం వాడాలని, గండిపేట, హిమాయత్ సాగర్ నీళ్లను యధావిధిగా ఉంచడం వల్ల నగర పరిధిలో భూగర్భ జలమట్టం పెరుగుతుందన్నారు. ఇదే సందర్భంలో చెరువు కట్టలను ఎప్పటికప్పుడు గమనించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సందర్శకులు జాగ్రత్తగా ఉండాలి
ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరగడం, చెరువులు అలుగు పోస్తుండడంతో వాటిని చూడడానికి వెళ్లే సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. నీటిలో దిగడం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి చెప్పారు. నదులు, కాలువల్లో కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి, సందర్శకులు వాటిలో దిగవద్దని కోరారు. పోలీసులు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.
గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నందన వరంగల్ జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కలెక్టర్ కరుణను ఆదేశించారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ప్రజలను, పశువులను తరలించాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి వుంటుందని, భద్రాచలం ప్రాంతంలో నది ప్రమాద స్థాయికి చేరే అవకాశం వుందన్నారు కాబట్టి అక్కడ అప్రమత్తంగా వుండాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు చెప్పారు. నిజాంసాగర్, ఎస్.ఆర్.ఎస్.పి., తదితర ప్రాజెక్టులతో పాటు ఇంద్రావతి నుంచి కూడా పెద్ద ఎత్తున నీరు వస్తున్నదని, 8 లక్షల క్యూసెక్కుల దాకా నీరు వస్తుందన్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు అప్రమత్తంగా వుండాలన్నారు. ప్రజలు సహకరించాలని, ముంపుకు గురయ్యే ప్రాంతల ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని చెప్పారు.
మెదక్ జిల్లా ఏడుపాయలలో చిక్కుకున్న 24 మంది కూలీలను రక్షించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చూపిన చొరవ ఫలించింది. ఏడుపాయల వద్ద బ్రిడ్జి పనుల కోసం ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 24 మంది కూలీలు (వారిలో ఒకరు మహిళ) వెళ్లారు. ఇంతలో సింగూరు నుంచి నీటి ప్రవాహం ఘనపురుం చేరింది. ఘనపురం వద్ద కూడా నీరు విడుదల చేయడంతో వారు రెండు ఏరుల మధ్య ఉన్న భుభాగంలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చింది. దీంతో ముఖ్యమంత్రి అక్కడికి ప్రభుత్వ హెలిక్యాప్టర్ పంపడానికి ప్రయత్నించారు. ఎయిర్ ఫోర్స్ హేలిక్యాప్టర్ అయితే తప్ప మనుషులను అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో ముఖ్యమంత్రి ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడారు. సెప్టెంబరు 25న ఉదయం ఎయిర్ ఫోర్స్ హేలిక్యాప్టార్ ఏడుపాయలకు చేరుకొని 24 మంది కూలీలను రక్షించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఏడుపాయాలలో ఉండి సమీక్షించారు. కూలీలను సురక్షితంగా బయటకు తేవడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి ఆదుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
సెప్టెంబర్ 26న ఎల్లంపల్లి, మిడ్మానేరు ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటనష్టం పరిహారాలపై సమగ్రమైన అంచనాలను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. పూర్తిస్థాయి అంచనాలు రాగానే కేంద్రానికి నివేదికలను పంపిస్తామని పేర్కొన్నారు అయితే వర్షాల కారణంగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనడానికి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా వుండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా నియోజకవర్గాల పరిధిలోనే వుండి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు.
నగరంలో వరద
అపెక్స్ కమిటీ మీటింగ్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ జంట నగరాలలో కురిసిన భారీ వర్షాల ఇక్కట్లను ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ సమీక్ష జరిపారు. అయితే ఢిల్లీనుండి వచ్చిన వెంటనే సెప్టెంబరు 24న సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అసాధారణ వర్షాపాతం నమోదు కావడంవల్లనే రాజధానిలో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. అయితే దీనికి కారణం అక్రమ కట్టడాలే ప్రధాన కారణం అని అన్నారు. గోరంతలు కొండంతలుగా చిత్రీకరించే పద్ధతి మంచిదికాదని మీడియాకు చురక అంటించారు. ఇక మీదట నగరంలో అక్రమ కట్టడం మాట అనేది ఉండదు అని పేర్కొన్నారు. అక్రమ కట్టడం ఎంతటివారిదైనా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరుగుతుందని చెప్తూ, అక్రమ కట్టడాల సమాచారం అందించిన వారికి 10వేల బహుమతి అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
సీఎం ఏరియల్ సర్వే
ఈసారిపడ్డ వర్షాలు మరో రెండేండ్లకు సరిపడ్డాయి కాబట్టి ప్రజు చాలా ఆనందంగా వున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంవల్ల కురిసే వర్షాలతో ఎటువంటి నష్టం జరుగకుండా ముందుగానే చర్యలు తీసుకున్నామన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో గోదావరి వరద బాగా పోటెత్తే అవకాశం వున్నదని వాతావరణశాఖ హెచ్చరించినందుకుగాను అవసరమైతే ఒకటి రెండు రోజులు కరీంనగర్లోనే మకాంవేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి కాళేశ్వరం వరకు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు తాను కరీంనగర్ వచ్చానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మధ్యమానేరు ప్రాజక్టు పనుల్లో ఆలస్యం జరిగిన కారణంగా వర్కింగ్ ఏజెన్సీ కాంట్రాక్టును రద్దుచేసి తిరిగి కొత్త టెండర్లను పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.