జాతి సంస్కృతికి
ఆయువుపట్టు భాష. భాష వ్యవహారపరంగా ఎంతో ముఖ్యమైంది. అన్ని రంగాలలోని జ్ఞాన-విజ్ఞాన సంబంధమైన అభివృద్ధి భాషతో ముడివడి ప్రకటన పరంగా సులభసాధ్యం అవుతుంది. సమాజంలోని వ్యక్తుల అనుభవసారం, కార్య కౌశల విధానం భాషద్వారానే అభివ్యక్తమవుతుంది. ఆయా కాలాలలో చరిత్ర, సాహిత్యం, శాస్త్రాలు మొదలైనవాటికి చెందిన గ్రంథాలు ఎన్నెన్నో వెలువడుతుంటాయి. భాషను
మెరుగు పరచుకుంటేనే అధ్యయన విస్తృతి పెంపొం దుతుంది. అందుకు ఎవరి భాషను వారు అంటే ఎవరికివారు వారి మాతృభాషను గౌరవించుకోవడం, బ్రతికించుకోవడం వారి బాధ్యత.
తెలంగాణ అంటే తెలుగు భాష మాట్లాడే ప్రజలు నివసించే నేల. తెలంగాణను సాధించుకున్నాక ‘తెలుగు’కే ప్రాధాన్యతనిస్తూ పాఠశాల స్థాయి నుండి, కళాశాల స్థాయి వరకు తెలుగును తప్పనిసరి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న మమకారం, అభిమానం, చొరవ చెప్పుకోదగ్గవి. మాతృభాషగా, మాతృభాషా మాధ్యమంలో తెలుగు బోధించడంలో పూర్వం ఎందరో పండితులు భాషపై అభిమానంతో ఎంతో కాలాన్ని, జీవితాన్ని ధారపోసినవారున్నారు.
కేవలం మాతృభాషకు, మాతృభాషా మాధ్యమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడానికి ప్రాచ్య కళాశాలలు నెలకొల్పబడినవి. అప్పటి పెద్దలు దూరదృష్టితో నాటిన బీజాలు మహావృక్షాలై, చాలా మంది తెలుగు పండితులను ఫలాలుగా అందించాయి. ఎంతగానో భాషకు, సాహిత్యానికి సేవచేసాయి. ఇది ఒక చారిత్రక వాస్తవం.
తెలంగాణలో తెలుగు కళాశాలలు అంటే ప్రాచ్యవిద్యా కళాశాలలు. ఈ ప్రాచ్యవిద్యను ఆంగ్లంలో ‘ఓరియంటల్’ అంటారు. వీటిని భారతదేశంలో ఆరు భాషలలో బ్రిటిష్‌వారు ప్రారంభించారు. తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో 1955లో మొదలుపెట్టిన ఆరుభాషల్లో తెలుగు ఒకటి. ఈ కళాశాలలు తెలంగాణలో మొత్తం పది ఉండేవి. వీటిలో కోర్సులు మూడు; ఒకటి జుఅ్‌తీaఅషవ, ఒక సంవత్సరం, రెండవది ణఱజూ.ూ.కూ (డిప్లమా ఇన్ ఓరియంటల్ లాంగ్వ్‌జేస్) 2సం||లు, మూడవది దీ.ూ.కూ (బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్) 2సం||లు. ఈ దీ.ూ.కూను 1973లో 3సం||ల కోర్సుగా మార్పుచేసి ఇంగ్లీష్‌ను చేర్చారు. 1967లో ఓ.యు.ప్రాచ్యభాషల్లో 2సం||ల వీ.ూ.కూ.(పోస్ట్ గ్రాడ్యుయేషన్) కోర్సుకు శ్రీకారం చుట్టింది.
1979 -80 సం||రాల్లో సచ్చిదానందమూర్తి కమీషన్ సిఫార్సుల మేరకు జుఅ్‌తీవఅషవ, ణఱజూ.ూ.కూ, దీ.ూ.కూ, వీ.ూ.కూ. కోర్సులను వరుసగా మెట్రిక్యులేషన్ (లాంగ్వేజ్), ఇంటర్మీడియెట్ (లాంగ్వేజెస్) బి.ఏ. లాంగ్వేజ్, ఎం.ఏ.లాంగ్వేజ్‌గా మార్చారు. తరువాత కొన్ని సాంకేతిక కారణాలవల్ల మెట్రిక్యులేషన్ (లాంగ్వేజ్)ను ‘ఎంట్రన్స్’గాను, ఇంటర్మీడియెట్ (లాంగ్వేజ్)ను పి.డి.సి.గా మార్చారు. ఇంతలోనే ఓ.యు. ఓరియంటల్ ఫ్యాకల్టీని నెలకొల్పారు. దానికి మొదటి డీన్‌గా డా||శివునూరి విశ్వనాథశర్మ వ్యవహరించారు.
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం
ప్రభుత్వ ఆంధ్ర ప్రాచ్య కళాశాల:
ఈ కళాశాల హైదరాబాద్, ‘నల్లకుంట’లో ఉంది. దీన్ని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం వ్యవస్థాపకాధ్యక్షులుగా 23-6-1958 సం||లో ‘ఆంధ్ర ప్రాచ్య కళాశాల’ పేరుతో స్థాపించారు. ప్రారంభంలో ఓ.యు. తెలుగుశాఖ అధ్యాపకులే ఉచితంగా పాఠ్యాంశాలు బోధించారు. 1963లో కళాశాలకు ప్రభుత్వ గ్రాంట్ మంజూరు కావడంతో ఎస్.విశ్వనాథశర్మ ప్రిన్సిపాల్‌గా ఇతర బోధన, బోధనేతర సిబ్బందిని నియమించారు. ఈ కళాశాల 1968లో ప్రభుత్వాధీనంలోకి పోయింది. 1970లో విరాళాలతో స్వంత భవనాన్ని ఏర్పరచుకుంది. 1991లో ‘ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వ ఆంధ్ర ప్రాచ్య కళాశాల’గా నామాంతరం చెంది, 2001నుండి డే కాలేజిగా మార్చారు.
1967లో పి.జి. ప్రారంభించి, 1982లో పరిశోధనను కూడా మొదలుపెట్టారు. తరగతిలో పాఠ్యాంశాల ఆధారంగా సెమినార్ వ్యాసాలను వ్రాసే పద్ధతిని, మౌఖిక చర్చలను ప్రారంభించారు. ఉత్తమ వ్యాసాలకు బహుమతులిచ్చేవారు. ఈ కళాశాలద్వారా ”నన్నయ ప్రసన్న కథా లోతులు” అనే విషయంపై పరిశోధనా ప్రాజెక్ట్ వెలుగుచూసింది. ఆయా పండితులచే 27 వ్యాసాలు వ్రాయించి 1984లో గ్రంథంగా ప్రచురించారు. అంతేకాకుండా 2008లో ‘ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి శతజయంతి, కళాశాల స్వర్ణోత్సవ సంచిక’ను వెలువరించారు. 2011లో ‘కౌముది’ పేరుతో సాహిత్య వార్షిక సంచికను వెలురించారు. ఈ రెండు గ్రంథాలు యం. వాసంతి సంపాదకత్వంలో వెలువడ్డాయి.
శ్రీ దుర్గేశ్వర మహిళా సంస్కృతాంధ్ర కళాశాల:
తెలంగాణలో ఉన్న ఏకైక మహిళ ఓరియంటల్ కళాశాల ఇది. ఈ కళాశాల 1961 సం||లో ముదిగొండ శంకరశాస్త్రిచే వరంగల్‌లో స్థాపించబడింది. కళాశాల భవనానికి శ్రీదుర్గేశ్వర స్వామి దేవస్థానం వారు 100 చ||గ స్థలాన్ని దానం ఇవ్వడంతో దేవాలయం పేరుమీదుగా కళాశాల పిలువబడుతుంది. ప్రస్తుతం ఈ కళాశాల జె.పి.ఎన్.రోడ్, గిర్మాజిపేట్, వరంగల్‌లో ఉంది. ఇప్పుడు ఇందులో ఒక బి.ఎ.ఎల్. కోర్సు మాత్రమే నిర్వహించబడుతుంది.
శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఓరియంటల్ కళాశాల:
తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ మహబూబ్‌నగర్ జిల్లా పాలెం పట్టణంలో ఒక ప్రాథమిక సైన్స్ పాఠశాలగా ప్రారంభించబడి 1964 నవంబర్‌లో తెలుగు కళాశాలగా రూపాంతరం చెందింది. తర్వాత 14-03-1982లో ప్రభుత్వ పరం చేయబడింది. ఈ కళాశాలకు మొదటి ప్రాచార్యులు సర్వా వెంకట శేషయ్య. రెండవ ప్రాచార్యులు తెలకపల్లి విశ్వనాథశర్మ. ఈయన కాలంలోనే పాలెం వేంకటేశ్వర దేవస్థానం అజమాయిషిలో జరిగిన ‘నాదరంజిత వాగ్దేవతా సంచార వైజయంతికా వాగ్ధాటీ నైపుణ్యాభివర్ధ సభలు’ 1966 నుండి 1972 వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా తెలుగునేలపై గల సంస్కృత, తెలుగు పండితులందరిని పిలిపించారు. విద్యార్థులకు వక్తృత్వపోటీలు పెట్టి బహుమతులిచ్చారు. అందులో మొదటి బహుమతిపొందిన ఎం.ఏ విద్యార్థి శలాక రఘునాథశర్మ. 1980 లో ‘సంస్కృత నాటకోత్సవాలు’ అనే అంశంపై రెండు రోజుల సెమినార్ నిర్వహించి, పుస్తకాన్ని ప్రచురించారు. ఈ మధ్య 2004లో ‘దాశరథి సాహిత్యం’పై ఒకరోజు సెమినార్ నిర్వహించారు.
1995లో రంగాచార్య హయాంలో కళాశాల యు.జి.సి.నుండి 2(ఎఫ్) మరియు 12 (బి) గుర్తింపు పొందింది. ప్రస్తుతం కళాశాలలో పి.డి.సి. బి.ఎ.(లాంగ్వేజ్), ఎం.ఏ.తెలుగు కోర్సులు నిర్వహిస్తున్నారు.
లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల:
1966 సం|| దసరా రోజున ధర్మపురి గ్రామ పెద్దలంతా సమావేశమై తాడూరి బాలకృష్ణశాస్త్రి ఆశయం మేరకు ‘లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల’ కొరిడె కిష్టయ్య అధ్యక్షులుగా ప్రారంభించారు. స్థానిక పండితులచే విద్యాబోధన జరిగింది.
1967 లో ప్రభుత్వ అనుమతి పొందింది. 1969-70 నుండి ఉస్మానియా ఎంట్రెన్స్, ణఱజూ.ూ.కూ కు తరువాత దీ.ూ.కూ కు అనుమతి పొందింది. 1970లో ‘శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల’గా పేరు మార్పు చేశారు. ఈ కళాశాల తరగతులు1966 నుండి 81 ఆగస్టు వరకు స్థానిక శివాలయ ప్రాంగణంలో జరిగింది. కాని ప్రస్తుతం 9 గదులు, రెండు హాలులుగల స్వంత భవనం ఏర్పాటు చేసుకోగలిగింది.
అభ్యుదయ ప్రాచ్య సాయం కళాశాల:
ఈ కళాశాల హైదరాబాద్, జియాగూడలో కలదు. తెలంగాణలో గల అన్ని ఓరియంటల్ కళాశాలలో ఇది మాత్రమే ‘హిందీ, తెలుగు’ మాధ్యమంగా నడుస్తున్న కళాశాల. 1962లో సంఘ సంస్కర్త జమాల్‌పూర్ అంతోజీ ఇంట్లో రాత్రి పాఠశాలగా ప్రారంభమై 1970-71సం||లో ‘అభ్యుదయ ప్రాచ్య కళాశాలగా’ రూపుదిద్దుకుంది. ఇక్కడ ఎంతోమంది మేధావులు అధ్యాపకులుగా పనిచేసి చాలా మందిని పండితులుగా తీర్చి దిద్దారు.
బోధన మాత్రమే కాకుండా 1985 సం|| నుండి ‘అభ్యుదయ’ అనే సంవత్సర సంచికను నడిపారు. 1987లో రజతోత్సవ సంచికను వెలువరించారు. ఇందులో పనిచేస్తున్నవారందరు కలిసి ‘కళాకౌముది’ అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసుకుని భారత,భాగవతాలపై పరిశోధన గ్రంథాలను వెలువరించారు. 1980నుండి ప్రతినెల సాహితీ సదస్సు నిర్వహించేవారు. ఈ సదస్సులో చర్చాగోష్ఠులు జరుతుండేవి. ప్రస్తుతం తెలుగు శాఖ ఒక్కరే బోధనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రాచ్య విద్యాపరిషత్తు సాయం ప్రాచ్య కళాశాల:
కామారెడ్డి పట్టణంలో ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ 1968 సం||లో సంకల్పించి ఎన్నో ప్రయత్నాల ఫలితంగా1971సంలో ‘ప్రాచ్య విద్యా పరిషత్తు సాయం ప్రాచ్య కళాశాల’ పేరుతో ప్రారంభమైంది. మొదటి ప్రాచార్యులు తిగుళ్ళ వేంకటేశ్వరశర్మగా ‘ఎంట్రెన్స్, ణఱజూ.ూ.కూ, దీ.ూ.కూ కోర్సులతో బోధన సాగింది. పార్ట్‌టైమ్ లెక్చరర్లుగా ప్రభుత్వ డిగ్రి కాలేజ్ తెలుగు అధ్యాపకులు బోధించారు. 1972 నుండి ప్రభుత్వం
ఉపన్యాసకులను నియమించడం జరిగింది. ఎంతో పాండిత్యం కలిగిన అధ్యాపకులతో ఈ కళాశాల తెలుగు ఉపాధ్యాయులను, అధ్యాపకులను సమాజానికి అందించింది. ఈ కళాశాలలో విద్యార్థిగా చదివిన అమరేశం ప్రభాకరరావు ప్రస్తుతం ఈ కళాశాలకు ప్రాచార్యులుగా ఉన్నారు.
బోధనకు మాత్రమే పరిమితం కాకుండా పుస్తక ప్రచురణ బాధ్యతను కూడా ఈ కళాశాల చేపట్టింది. అందులో భాగంగా మొదటి గ్రంథం ‘ఆంధ్ర వ్యాకరణ వికాసము’ అనే ఆచార్య అమరేశంగారి పరిశోధన గ్రంథం, (ఇది నిజామాబాద్‌లో తొలి పరిశోధనా గ్రంథం కావచ్చు) ‘శ్రీకృష్ణదేవరాయల సాహిత్య వైభవము’ ఈ కళాశాల ఉపన్యాసకుల వ్యాసాల సంకలనం. ‘శివ సహస్రనామావళి’ డా|| అవధానం రంగనాథ వాచస్పతి, అమరేశం ప్రభాకరరావు భావార్థాలతో సమకూర్చబడింది. ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ ‘నన్నెచోడుని కవిత్వం’ ద్వితీయ ముద్రణ, ‘చరిత్ర పుటలు’, ‘శ్రీసాయిసచ్చరిత్ర ముక్తావళి’, పరిషత్తు ప్రచురించిన గ్రంథాలే. అంతేకాకుండా ‘సాహిత్య అధ్యయన వేదిక’ పేరుతో అనేక కార్యమ్రాలు నిర్వహించారు. త్యాగరాజ జయంతి సందర్భంగా ‘త్యాగరాజు ఆరాధనోత్సవాలు’ నిర్వహించబడ్డాయి.
తెలంగాణ సారస్వత ప్రాచ్య కళాశాల:
ఆంధ్ర మహాసభలలో భాగంగా 10వ సభ హైదరాబాద్‌లో 1943లో జరిగింది. దాని ప్రభావంతో భాషా పరిరక్షణ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఒక సాహిత్య సంస్థను స్థాపించాలని నిర్ణయించారు. ఆ ఆలోచనే 1943 మే 26న ఈ ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’గా రూపుదిద్దుకుంది. ప్రాథమిక, మాధ్యమిక, విశారద పూర్వభాగం, విశారద ఉత్తరభాగం, ప్రవేశిక వంటి పరీక్షలను నిర్వహించి ఎంతోమంది పండితులను అందించింది. అటు తర్వాత 1965 ఆగస్టు 29 ప్రాచ్య కళాశాలగా మార్పుచెంది, బి.ఓ.ఎల్, ఎం.ఓ.ఎల్, కోర్సులే కాకుండా తెలంగాణలో ఏ ఓరియంటల్ కళాశాలలో లేనటువంటి ‘తెలుగు పండిత శిక్షణ’ కోర్సును కూడా అందించింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత 2014 జూన్ 2న ‘తెలంగాణ సారస్వత పరిషత్’గా పేరు మార్చుకుంది.
పరిషత్ తెలుగుకు ఎనలేని సేవ చేస్తూనే ఉంది. 1947 నుండి ప్రచురణలను మొదలుపెట్టి 300లకు పైగా గ్రంథాలను ప్రచురించింది. ఎన్నో పరిశోధన గ్రంథాలను వెలువరించింది. 1969 సం||నుండి ‘నెలవంక’ అనే పేరుతో వార్షిక సంచికను నడిపారు. 1997 నుండి ‘పరిణతవాణి’ (ప్రముఖుల ఆత్మగత ప్రసంగ వ్యాసాలు) అనే పేరుతో ఉపన్యాసాలు ఇప్పించి ప్రచురించింది. ఇప్పటివరకు పరిణతవాణి 7 సంపుటాలలో 60మంది ప్రసంగాలు వెలువడ్డాయి.
శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ మరియు పి.జి.కళాశాల
ఆకారపు నరసింగం తన తండ్రి ఆశయాలమేరకు 1940 సం|| వైదిక సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. దీనిని 1946లో సంస్కృతాంధ్ర కళాశాలగా మార్చారు. అదే సమయంలో ముదిగొండ శంకరశాస్త్రి ఆధ్వర్యంలో నడుస్తున్న మరొక సంస్కృత కళాశాల ఉండింది. ఈ రెండు కళాశాలల ధ్యేయం ఒకటే కావడంతో రెండింటిని కలిపి ‘శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాల’గా పేరు మార్చారు. అధ్యక్షులు మాత్రం ఆకారపు నరసింగంగుప్త గారే. ఈ కళాశాలకు ఉస్మానియా విశ్వ విద్యాలయం 1955లో అనుమతించింది. అన్ని కళాశాలలలాగానే బి.ఎ.ఎల్. మొదలైనవాటితో పాటు 1996నుండి ఎం.ఏ.తెలుగును కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కళాశాలలో పి.డి.సి., బి.ఏ.ఎల్., ఎం.ఏ. మూడు కోర్సులు నిర్వహించబడుతున్నాయి.
పాఠాలకు మాత్రమే పరిమితం కాకుండా పరిశోధనలు, ప్రచురణలు కూడా చేసింది. మొదట 1984లో చంద్రమౌళీశ్వరరావు షష్టిపూర్తి సంచికతో ప్రారంభించి, ‘విశ్వేశ్వర తరంగిణి’, శైవవాఙ్మయం, తెలంగాణ సంస్కృతాంధ్ర కవులు – రచయితలు’ వంటి మొదలైన పదికి పైగా పరిశోధనా గ్రంథాలు వెలువరించారు. ‘విశ్వేశ్వరభారతి’ పేరుతో కళాశాల వార్షిక సంచికను కూడా వెలువరిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో మరో రెండు ప్రాచ్య కళాశాలలు మూత బడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ప్రాంతంలో ఒక ఓరియంటల్ కళాశాల చాలాకాలం నిర్వహించబడి మూతబడింది. ‘గీతా విజ్ఞానాంధ్ర కళాశాల’ పేరుతో 1966లో నల్గొండలో ప్రారంభించబడింది. ఎంతో మంది పండితులను తయారు చేసిన ఈ విద్యాసంస్థ 2006 అక్టోబరు 31 నాటికి మూతపడింది.
మాతృభాషా పరిరక్షణకు వేదికగా నిలిచిన ఓరియంటల్ కళాశాలలు ప్రస్తుతం క్షీణదశలో ఉన్నాయి. అందుకు కారణాలు ఎన్నెన్నో.
ఉద్యోగావకాశాలలో పి.డి.సి.ని ఇంటర్మీడియట్‌తో సమానంగా, బి.ఏ.(ఎల్)ను బి.ఏ.తో సమానంగా అన్ని రంగాలలో లెక్కలోనికి తీసుకోకపోవడం ముఖ్యమైనది. మరొకటి అధ్యాపకుల ఖాళీలను నింపకపోవడం. ఈ కళాశాలలకు పూర్వ వైభవం రావాలంటే కారణాలను పరిశీలించి, పరిష్కరించుకోవాలి. మన మాతృభాషను కాపాడుకోవల్సిన బాధ్యత కూడా మనదే.
దత్తయ్య అట్టెం