”భిన్న సంస్కృతులు ఎదిగి పూచినపాదు” హైదరాబాదు అన్న అంశానికి నిర్వచనంలాంటి చూడచక్కని జీవితం తొణికిసలాడే చిత్రాలు అనేకం వేసిన, వేస్తున్న వర్ధమాన కళాకారుడు బి. అక్షయ ఆనంద్ సింగ్.
ఆయన చిత్రాలు ఆయన చుట్టుప్రక్కల సమకాలీన అంశాలు, హైదరాబాద్ వాసుల జీవనం – మరీ ముఖ్యంగా ధూల్‌పేటకు, జుమ్మేరాత్ బజార్‌కు చెందిన అనేక మంది నిత్యజీవితానికి అద్దం పట్టినట్టు ఉంటాయి. ఈ శ్రేణిలోని చిత్రాలన్నీ కళాత్మకతను ఒడిసిపట్టి డాక్యుమెంట్ చేసినట్టు ఉండడం విశేషం. పైగా ఈయన చిత్రాలు హైదరాబాద్ జీవన సరళి, ఇక్కడి సంప్రదాయాలు, ఆధునిక సంస్కృతుల సంగమంగా తోస్తాయి.
పాతనగరంలోని పురాతన నిర్మాణాలు, ఇరాని ¬టళ్ళు – ఆయా చోట్ల కూర్చుని కమ్మని కబుర్లు చెప్పుకునే సహచరులు, వారి నాగరికత, అక్కడి ఇరుకిరుకు గల్లీలలో తిరుగాడే చిరువర్తకులు, బోనాల ఊరేగింపులు, పెద్దమ్మల వాండ్లు హడావుడి, గాలి బుడగలు అమ్ముకునేవారు. ఇట్లా ఎందరెందరివో బతుకు చిత్రాలు ఆయన కుంచెనుంచి జాలువారాయి. అవన్నీ తనదైన శైలిలో డ్రాయింగ్‌లుగా, పెయింటింగ్‌లుగా, ఎచ్చింగ్‌లుగా ఆయన తీర్చిదిద్దారు. డ్రాయింగ్ వేయడంలో అక్షయ ఆనంద్ ది అపురూపమైన విన్యాసం. అయితే ఆయన గీసే రేఖలు వేస్తే రంగుల మేళవింపు తిలకిస్తే సుప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మాగౌడ్‌ను ఆయన ఎంతగానో అధ్యయనం చేశాడని అవగతమవుతుంది.
ఒకనాటి షేర్వాణిలు, బురఖాలు ధరించిన వారొకవంక, నెత్తిన దేవుని విగ్రహాలు లేదా బండిలో దేవుని పటాలు ఊరేగించే వారు మరొకవంక, ప్లాస్టిక్ బొమ్మలు, స్మార్ట్ ఫోనులు, ఫ్రిడ్జ్‌లలో శీతల పానీయాల సీసాలు విక్రయించే వారు వేరొకవంక. ఇట్లా పలు సంస్కృతులు, క్రమంగా వారిలో వస్తున్న మార్పులు అక్షయ ఆనంద్ చిత్రాల్లోను చోటు చేసుకున్నాయి.
దాదాపు నడివయస్సుకు చేరుకున్న అక్షయ ఆనంద్‌కు చిన్ననాటి నుంచి చిత్రకళ అంటే పిచ్చి. ఆయన తండ్రి, తాతలు అంతా వ్యాపారస్తులే. కానీ ఆయనలోని కళాతృష్ణ చూసిన తల్లిదండ్రులు మనులాల్ – బాయాబాయి పాఠశాల విద్య, ఇంటర్ తర్వాత హైదరాబాద్ నగరంలోని శ్రీవెంకటేశ్వర లలిత కళల కళాశాలలో చేర్పించగా ఆయన అక్కడ పేయింటింగ్‌లో 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అనంతరం 2005లో ప్రింట్ తయారీలో స్నాతకోత్తర పట్టాను హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలోని సరోజినీ నాయుడు లలిత కళల కళాశాలలో నుంచి సాధించాడు.
ఒకవంక చదువు కొనసాగిస్తూనే తన మనసుకు నచ్చిన అంశాలను చిత్రాలుగా వేయడం ప్రారంభించాడు. ఈయన వేసిన చిత్రాలకు 1995లోనే వివేకవర్ధిని అవార్డు అభించింది. ఆ తర్వాత 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, 2002లో అఖిల భారత లలిత కళలు క్రాఫ్ట్ సొసైటీ అవార్డు, 2003లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు, 2004లో ఢిల్లీకి చెందిన అఖిల భారత ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అవార్డు వీరు పొందారు. కేవలం 2016లోనే వీరికి ప్రపుల్లా దహనుకర్ ఆర్ట్ ఫౌండేషన్ వారి మెట్రో టీ అవార్డు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారి 75వ అఖిల భారత కళా ప్రదర్శనలో ముసరాంతోట ఈశ్వరయ్య అవార్డు, బతుకమ్మ చిత్రలేఖన పోటీల్లో అఖిల భారత స్థాయి అవార్డు, ఢిల్లీకి చెందిన అఖిల భారత లలిత కళలు క్రాఫ్ట్స్ సొసైటీ అవార్డు గెలుచుకోవడం చెప్పుకోదగింది.
తొలి పర్యాయంలోనే అక్షయ ఆనంద్ వ్యష్ఠి చిత్రకళా ప్రదర్శనను హైదరాబాద్‌లోని మినాజ్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశాడు. ఆ పిదప అక్కడే 2010లో ఇండియన్ మెను ”శీర్షికన డ్రాయింగ్‌లు, పెయింటింగ్‌లు, ఎచ్చింగ్‌ల వ్యష్ఠి చిత్రకళా ప్రదర్శన నిర్వహించాడు. మళ్ళీ 2014లో ”జ్ఞాపకాల నగరం” శీర్షికన హైదరాబాద్ నగరంలోని కళాకృతి ఆర్ట్‌గ్యాలరీలో వ్యష్ఠి చిత్రకళా ప్రదర్శన చేశాడు.
హైదరాబాద్ నగరంతో పాటుగా కర్ణాటకలోని విద్యాగిరిలో, లలిత కళా అకాడెమీ ప్రాంతీయ కేంద్రం చెన్నైలో భారత భవన్ భూపాల్‌లో, సీనియర్ కళాకారుడు ముంబైలో నిర్వహించిన ముప్పయి ఐదు దాకా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి చిత్రకళా శిబిరాలలో, కార్యగోష్ఠులలో పాల్గొని అక్కడికక్కడే చిత్రాలు వేసి ప్రదర్శించాడు. వాటిలో బతుకమ్మ చిత్రకళా శిబిరం, ప్రాంతీయ ప్రింట్ మేకింగ్ శిబిరం, నగరంలో ఇనుము, పనికిరాని వస్తువులతో కళాఖండాలు రూపొందిందే కార్యశాలి, కొండపల్లి బొమ్మల తయారీ కార్యగోష్ఠి, మెడ్విన్ ఆస్పత్రి యాజమాన్యం ”ఆర్ట్ ఫర్ హార్ట్” శీర్షికన నిర్వహించిన కళా శిబిరాల్లో అక్షయ ఆనంద్ రూపొందించిన చిత్రాలు సృజనాత్మకమైనవి.
హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ తొలి జాతీయ కళా ప్రదర్శనతో పాటుగా న్యూఢిల్లీలో, అహ్మదాబాద్‌లో, ముంబై, కోల్‌కత, నొయిడా, భూపాల్, పూనే, బెంగుళూరు, నాగపూర్‌లలో ఏర్పాటు చేసిన దాదాపు ఏభై రాష్ట్ర, జాతీయ స్థాయి సమష్టి చిత్రకళా ప్రదర్శనలలో ఎప్పటికప్పుడు తాజా చిత్రాలలో పాల్గొని, ప్రశంసలు అందుకున్నాడు. వీటిలోను మాదాపూర్‌లో వంద మంది తెలంగాణ చిత్రకారుల చిత్రకళా ప్రదర్శన, ముంబైలో, ‘అధోలోక్ ప్రభావం” శీర్షికన నిర్వహించిన కళా ప్రదర్శన, న్యూ ఢిల్లీలో ఆర్ట్ విత్ తెలంగాణ కళా ప్రదర్శన, జీవ వైవిద్యంపై స్టేట్ ఆర్ట్ గ్యాలరీలలో నిర్వహించిన కళా ప్రదర్శనలో వీరు ప్రదర్శించిన చిత్రాలు చెప్పుకోదగినవి.
ఏమైనా ఈయన చిత్రాలు చూస్తే నిరుపేద ప్రజానీకం తిండి కోసం పడే తిప్పలు తెలుస్తాయి. ఆ బీద బిక్కి జనం కఠోర శ్రమ, మధ్య తరగతి వారి నిత్య జీవిత సమరం – ఈయన చిత్రాల్లో సహజ సుందరంగా, అలవోకగా కళ్ళకు కట్టాడు.
అందుకే ఈయన గీసిన చిత్రాలు దేశవిదేశాల్లోని పలు సంస్థలు, వ్యవస్థలు సేకరించారు. కొనుగోలు చేశారు.