భువనం అంటే ప్రపంచం. భువనమే బోనం. భువనాన్ని బోనంగా తలకెత్తుకొని విశ్వక్షేమాన్ని కోరుతూ చేసే పండుగ ‘బోనాల పండుగ’. తెలంగాణ జన జీవనాల ప్రతిబింబం అయిన ఈ మహాపర్వం ప్రతి యేటా ఆషాఢమాసంలో తెలంగాణ అంతటా పరమవైభవంగా సాగుతుంది. ‘బోనం’ అంటే ‘భోజనం’ కూడా. జానపదులు తమ ఇష్టదేవతలకు సమర్పించే భోజన పదార్థాలతో కూడిన నివేదనలే బోనాలుగా ప్రసిద్ధాలు.

తెలంగాణలోని హైదరాబాదు, సికిందరాబాదు, ఇతర జిల్లాలలోనూ విశేషంగా జరుపుకొనే ఈ పండుగ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోనూ జరుపుకోవడం విశేషం. ఆషాఢ మాసంలో ఈ లోకాలను పాలించే జగన్మాత పుట్టింటికి వెళ్తుందనీ, ఆ సమయంలో అమ్మవారికి ప్రీతిని కలిగించే విధంగా పూజించి, వివిధ నైవేద్యాలను సమర్పిస్తే ఆ తల్లి కరుణ నిత్యం తమపై ఉంటుందనీ అశేష ప్రజలు భావిస్తారు. దీనికి ప్రతీకగా ఇంటింటా, ఊరూరా, వాడవాడలా బోనాలెత్తి ఈ పండుగను వైభవంగా జరుపుకొంటారు.

అమ్మవారికి భక్తి ప్రపత్తులతో సమర్పించే ఈ తంతును ‘ఊరడి’ అని పిలుస్తారు. పెద్ద పండుగ,ఊర పండుగ అనే పేర్లతో పూర్వం ఈ పండుగను పిలిచేవారు. అమ్మవారికి నివేదనలో అన్నంతోబాటు పాలు, పెరుగు, బెల్లం, ఉల్లిపాయలు సమర్పిస్తారు. మట్టికుండలను గానీ, రాగి కుండలను గానీ తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్లతో, మంగళవాద్యాలతో, నృత్యాలతో అమ్మవారి గుడులకు వెళ్లడం సంప్రదాయం. మహిళలు నెత్తిపై పెట్టుకొనే ఈ కుండలలో చిన్న వేపరెమ్మలు, పసుపు, కుంకుమ, తెల్ల ముగ్గులతో అలంకరించి, దానిపై ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఈ పండుగ సమయంలో పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మొదలైన గ్రామదేవతల గుడులను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

దుష్టులను దునుమాడి, సాధువులను కాపాడి లోకంలో శాంతి సౌభాగ్యాలను ప్రసాదించే మహాకాళిని ఈ పండుగలో విశేషంగా పూజిస్తారు. లష్కర్‌ (సికిందరాబాదు)లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయం బోనాల పండుగకు కేంద్ర బిందువు. ఇక్కడి నుండే అన్ని వైపులకూ బోనాల ఊరేగింపులు మొదలౌతాయి. ఎక్కడి నుండి మొదలైనా ఈ గుడివరకు సాగి, ఇక్కడ అమ్మవారిని దర్శించి, పూజించడంతోనే పండుగలు సంపూర్ణమౌతాయి. బోనాలెత్తుకొనే మహిళలలో అమ్మవారు ఆవహించి ఉంటుందని భక్తుల విశ్వాసం.

బోనాల పండుగనాడు మహిళలు నూతన వస్త్రాలను ధరించి, స్వర్ణాభరణాలను అలంకరించుకొని, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆలయాలకు వెళ్తారు. బోనాలను మోసుకొని వెళ్లే మహిళలు తాము అమ్మవారి స్వరూపాలుగా భావిస్తారు. మహాకాళి రుద్రావతారమూర్తి కనుక రౌద్రభంగిమలో దుష్టత్వాన్ని రూపుమాపే మహాకాళిని ఆవహింపజేసుకొని, ఆరాధించడం సంప్రదాయం. కాగితం, కర్రలతో రంగురంగులుగా అలంకరించిన ‘తొట్లెలను’ అమ్మవారికి సమర్పిస్తారు.

బోనాల పండుగ సంరంభం గోలకొండకోటలోని చారిత్రక ప్రసిద్ధమైన ఎల్లమ్మ ఆలయంలో మొదలై లష్కర్‌ (సికిందరాబాదు)లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయం మీదుగా, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తూ, పాతనగరానికి చేరుకుంటుంది.

మహాకాళి జాతరలో పోతరాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. పోతరాజును అమ్మవారికి సోదరునిగా భావిస్తారు. ఈ పోతరాజు ఆకట్టుకొనే రూపంతోనూ, బలిష్ఠమైన దేహంతోనూ, ఒంటిపై పసుపు రాసుకొని, నుదిటిపై పెద్ద కుంకుమ బొట్టును ధరిస్తాడు. ఎర్రని ధోవతి కట్టుకొని, డప్పు వాద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ సాగుతుంటాడు. భక్తులు సమర్పించు నైవేద్యాల రథం దగ్గర కొరడాతో ఒంటిపై కొట్టుకొంటూ, వేపమండలను నడుముకు కట్టుకొని, పూనకంతో నృత్యం చేస్తాడు.

అమ్మవారికి నివేదించిన బోనాలలోని ప్రసాదాలను భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆరగిస్తారు. వీధులన్నీ సంబురాలతో కూడిన ఆటపాటలతో అందరినీ ఆకర్షిస్తాయి.

ఈ ఉత్సవాలలో రెండవ దినాన జరిగే ‘రంగం’ కార్యక్రమంలో పోతరాజుపై అమ్మవారు ఆవేశించగా, పూనకం వస్తుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకొనేందుకు భక్తులు అనేక విధాలుగా ప్రార్ధిస్తారు.

అమ్మవారిని ఘటం రూపంలో అలంకరించి కొలిచే సంప్రదాయం బోనాల పండుగలో విశిష్టంగా భాసిస్తుంది. ఘటం పూర్ణ కలశమే కాదు అక్షయపాత్ర. అక్షయపాత్ర మాత్రమే కాదు అమృతకలశం. దేవదానవులందరూ అమృతకలశం కోసం తహతహలాడారు. క్షీరసాగరాన్నే మధించారు. అందులోనుండి ఉద్భవించిన అమృతకలశం అమ్మవారి స్వరూపం. ఈ సత్యాన్ని ప్రతిబింబించేదే ఘటం. ఈ బోనాల పండుగ ఆరంభ దినం నుండి చివరి రోజు దాకా ఈ ఘటాన్ని ఊరేగించి, చివరినాడు నిమజ్జనం చేస్తారు. ఘటం ఉత్సవం ముగిసిన తరువాత విశేష పూజలుంటాయి.ఈ ఘటం ఉత్సవం హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో ఏనుగు అంబారీపై ఊరేగింపుగా ప్రారంభమై, నయాపూల్‌ దగ్గర నిమజ్జనంతో ముగుస్తుంది. లాల్‌ దర్వాజా నుండి నయాపూల్‌ వరకు వీధుల వెంట వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆబాల వృద్ధులందరూ ఆనందపారవశ్యంతో నృత్యాలు చేస్తారు. హైదరాబాద్‌ పాతనగరంలో జరిగే ఘటాల ఊరేగింపు అనేక ప్రాంతాల ప్రజలను కలుపుకుంటూ సాగుతుంది. హరిబౌలి లోని అక్కన్న-మాదన్న, లాల్‌దర్వాజా,ఉప్పుగూడ, మీర్‌ఆలం మండీ, కాసరట్ట, సుల్తాన్‌ షాహీ, షాలిబండ, అలీజాకోట్ల, గౌలీపుర, ఆలియాబాదులలోని అమ్మవారి దేవాలయాలు ఈ ఊరేగింపులో కలుస్తాయి. చందూలాల్‌ బేలాలోని ముత్యాలమ్మ గుడిలోనూ ఈ వేడుకలు జరుగుతాయి.

ఈ ప్రపంచం అంతా దివ్యశక్తిమయం. శక్తి లేకుంటే ఏ ప్రాణీ కదలలేదు ప్రాణాలు నిలువ జాలవు. చరాచరాలలో చైతన్యం నిలువదు. కనుక ఈ విశ్వాసాన్ని నడుపుతున్న దివ్యశక్తిని మహాకాళి రూపంలో ఆరాధించడమే బోనాల పండుగలోని అంతర్యం. కాలాన్ని నియంత్రించే దివ్యశక్తి కాళిక. ఆమె మహాకాళి రూపంలో బోనాల పండుగవేళ ఆరాధింపబడుతూ, సకల ప్రపంచాన్ని ఆయురారోగ్య భాగ్యాలతో కాపాడుతోంది. సృష్టి, స్థితి,లయలకు మూలమైన ఆ తల్లికి కోటి దండాలు!

తిగుళ్ల అరుణ కుమారి

Other Updates