డా|| అయాచితం నటేశ్వరశర్మ
tsmagazineప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ రాజధానిలోని సికిందరాబాదు (లష్కర్‌)లో ఉజ్జయిని మహంకాళికి జరిగే పెద్ద జన జాతర ‘బోనాల పండుగ’. ‘లష్కర్‌బోనాలు’గా పిలువబడే ఈ జనప్రియ పర్వదినం అంగరంగవైభవంగా కొనసాగుతూ అశేషజనావళిని ఆకట్టుకొంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం జూలై 29న ఆదివారంనాడు జరుగబోయే ఈ మహాకుంభమేళాకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేయడమేగాక, సకలజనావళి సంక్షేమాన్ని కోరుతూ అమ్మవారికి 3.80 కిలోల బంగారు బోనాన్ని కూడా సమర్పించాలని నిర్ణయించడం విశేషం.

‘బోనం’ అనే మాట ‘భోజనం’ అనే అర్థాన్ని ఇస్తుందని పెద్దలమాట. ‘భువనం’ అనే అర్థం కూడా ఇందులోనే ఉంది. ‘అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌’ అని వేదం చెబుతోంది. అంటే అన్నమే పరబ్రహ్మ అన్నమే ఆదిశక్తి అన్నమే సర్వస్వం. అన్నమే ప్రాణం. అన్నం లేనిదే ఏ ప్రాణీ బ్రతుకలేదు. కనుక మనిషి తనకు ప్రాణప్రదమైన అన్నాన్ని ‘బోనం’ రూపంలో అమ్మవారికి సమర్పించడమే బోనాల పండుగలోని ఆంతర్యం. అన్నం లేకుంటే ఈ భువనం (ప్రపంచం) లేదు. కనుక భువనం అన్నమే. అదే బోనంగా మారింది. బోనాల పండుగలో నిత్యం అమ్మవారికి అన్నంతో బాటు పాలు, పెరుగు, బెల్లం, ఉల్లిపాయలు మొదలైనవి మట్టికుండలలో పెట్టి, శిరస్సుపై నిలుపుకొని, ఊరేగింపుగా మంగళవాద్యాల తోనూ, నృత్యగానాలతోనూ తరలివెళ్లడం, సమర్పించడం ఆనవాయితీగా జరుగుతోంది. బోనాల కుండలపై భాగంలో వేపకొమ్మలు, పసుపు, కుంకుమ, తెల్లని ముగ్గు కూడా ఉంచుతారు. దీపాన్ని కూడా వెలిగిస్తారు.
tsmagazine
ఆషాఢమాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందనీ, ఆ సమయంలో అమ్మవారు తమ ఇంటికే వస్తోందనే భావనతో భక్తులు ఈ బోనాల పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. ఈ బోనాల పండుగనే తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లు పెట్టి పిలవడం కనబడుతుంది. పెద్ద పండుగ, ఊరపండుగ, ఊరడి అనే పర్యాయపదాలు వినబడుతాయి. బోనాల పండుగనాడు స్త్రీలు చక్కగా పట్టు చీరలను ధరిస్తారు. నగలను అలంకరించుకొంటారు. లయబద్ధంగా నృత్యాలు చేస్తూ తమ మనస్సులలోని ఆనందాలను వ్యక్తం చేస్తారు. tsmagazineఈ వేడుకలో మహిళలు తామే అమ్మవారి స్వరూపాలుగా భావించి, ఆమెవలె పూనకంతో హావభావాలను ప్రకటిస్తారు. అమ్మవారి సోదరునివలె భావించే పోతరాజు ముందుకుసాగుతూ, డప్పు వాద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. బోనాల పండుగలో నైవేద్యాలే ప్రధానమైనవి కనుక, వాటిని అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా ఆరగిస్తారు. జానపదులు, నాగరికులు అనే తేడా లేకుండా అందరూ ఈ బోనాల పండుగను జరుపుకొంటారు. ఈ పండుగలో రెండవరోజు ఉదయం ‘రంగం’ అనే తంతు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమ్మవారి మాటగా భవిష్యత్తును చెప్పడం విశేషంగా కనబడుతుంది. అమ్మవారి ఆకారంలో రాగి కలశాన్ని ‘ఘటం’ అని సంబోధిస్తారు. అర్చకులు ఈ ఘటాన్ని తలపై ధరించి ఊరేగింపుగా ప్రయాణిస్తారు. లాల్‌దర్వాజ నుండి నయాఫూల్‌ వరకు వేలాదిమంది ఘటాలను తలపై మోస్తూ ప్రయాణిస్తారు. పాత నగరంలోని హరిబౌలి, అక్కన్నమాదన్న, లాల్‌దర్వాజ, ఉప్పుగూడ, మీర్‌ ఆలంమండి, మొదలైన చోట్ల మహంకాళి ఆలయాలనుండి ఊరేగింపులు బయలుదేరుతాయి. సుల్తాన్‌షాహి జగదాంబ గుడి, షాలిబండ, గౌలీపుర మొదలైన చోట్లగల అమ్మవారి ఆలయాలనుండి కూడా ఈ వేడుకలు జరుగుతాయి.tsmagazine

ఆదిశక్తి సృష్టినీ, స్థితినీ, ప్రళయాన్నీ నియంత్రించగల సమర్థురాలని అనాదికాలంగా భక్తుల విశ్వాసం. బ్రహ్మకూ, విష్ణువుకూ, శివునికీ వారివారి కర్తవ్యాలైన సృష్టి స్థితి లయాలలో ఆదిశక్తి అందించే ఆలంబనయే ప్రధానమనీ, వాళ్లు ముగ్గురూ తమతమ శక్తులపైనే ఆధారపడుతారనీ, వారు లేనిదే కనీసం కదలడానికి కూడా సమర్థులుకారనీ వేదాది వాజ్ఞ్మయాలు బోధిస్తున్నందువలన త్రిమాతృరూపిణి అయిన మహంకాళిని, బోనాలతో ఆరాధించడం తెలంగాణలో సంప్రదాయంగా మారింది. ఈ ఏడాది బోనాలపండుగ రాష్ట్ర సమగ్ర వికాసానికీ, జనుల ఆయురారోగ్యభాగ్యాభివృద్ధికీ దోహదం చేస్తుందని ఆశిద్దాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తి పూర్వకంగా బోనాలను సమర్పిద్దాం!

Other Updates