డా|| అయాచితం నటేశ్వర శర్మ
ప్రతియేటా మాఘమాసంలోని బహుళ చతుర్దశి నాడు సంభవించే మహా పర్వదినం ‘మహా శివరాత్రి’. ప్రతినెలలోనూ కృష్ణ చతుర్దశీ తిథులలో మాస శివరాత్రులు సంభవిస్తాయి. ఇవన్నీ లఘు శివరాత్రులు. మాఘ బహుళ చతుర్దశినాడు సంభవించే పండుగ మాత్రం బృహత్ శివరాత్రి. ఇందుకు కారణం మాఘ బహుళ చతుర్దశి శివుని జన్మనక్షత్రం అయిన ఆరుద్రతో కూడి ఉండడమే. అంతేగాక శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు కూడా ఇదే కావడం విశేషం.
ప్రాచీనులు ఐదు విధాలుగా శివరాత్రులుంటాయని చెప్పారు. నిత్యం రాత్రివేళ శివుని ఆరాధించడం నిత్య శివరాత్రి. పక్షానికొకనాడు రాత్రి వేళ శివుని పూజించడం పక్ష శివరాత్రి. ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్దశినాడు రాత్రి హరుణ్ణి సేవించడం మాస శివరాత్రి. ప్రతియేటా మాఘ కృష్ణ చతుర్దశి నిశీధివేళ లింగార్చన చేయడం మహా శివరాత్రి. యోగ సాధనతోనూ, తపస్సుతోనూ రాత్రి వేళ శివుణ్ణి ధ్యానించడం యోగశివరాత్రి ఇలా అయిదు శివరాత్రులు సంభవిస్తూనే ఉంటాయి.
పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్పవారని వాదించుకుంటూ ఉండగా, శివుడు మహా లింగాకృతిలో వారి ఎదుట ప్రత్యక్షమైనాడట. అప్పుడు వాళ్లిద్దరూ ఆశ్చర్యచకితులై ఆ శివలింగం ఆద్యంతాలను తెలుసుకోవాలని ప్రయత్నించారట. బ్రహ్మ హంసరూపంలో ఆకాశానికి ఎగసి శివలింగం ఆదిని తెలుసుకునేందుకు ఊర్ధ్వలోకాలకు ప్రయాణమయ్యాడట. ఎంతకూ శివలింగం ఆదిని కనుగొనలేక పోయాడట. దారిలో ఒక కేతకీ పుష్పం (మొగలిపువ్వు) కనబడిందట, అప్పుడు బ్రహ్మ కేతకీ పుష్పంతో – ‘నేను శివలింగం ఆదిని చూశానని విష్ణువుతో చెబుతాను, నీవు నాకు సాక్ష్యం చెప్పాలి’ అన్నాడట. బ్రహ్మ మాటకు మొగలి పువ్వు అంగీకరించిందట. ఆ తరువాత బ్రహ్మకు కామధేనువు కనబడగా, ఆ కామధేనువుతోను తాను శివలింగం ఆదిని చూసినట్లు సాక్ష్యం చెప్పాలని అన్నాడట. కామధేనువు అంగీకరించిందట.
మహా శివరాత్రి నాడు భక్తులు ఉపవాసం చేస్తారు. ఫలాలూ, జలాలూ తప్ప అన్న పదార్థాలను ముట్టుకోరు. నిశీధి వేళలో శివలింగార్చన ఎంతో పుణ్యదాయకం అని సమస్తపురాణేతిహాసాలూ చెబుతున్నాయి. మహాశివరాత్రి వేళ అర్చనలు చేస్తూ, రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారు. భక్తి గీతాలతోనూ, భజనలతోనూ రాత్రంతా కాలక్షేపం చేయడం పరిపాటి.
మరొకవైపు విష్ణువు వరాహరూపంలో శివలింగం అంతాన్ని కనుగొనేందుకు నేలను త్రవ్వుకొంటూ, పాతాళానికి వెళ్లాడట. అయినా శివలింగం అంతుమాత్రం చూడలేకపోయాడట. ఇంతలో బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వచ్చి – ‘నేను శివలింగం ఆదిని చూశాను. ఈ మొగలి పువ్వూ, కామధేనువులే ఇందుకు సాక్షులు’ అన్నాడట. విష్ణువు వారి మాటలు నమ్మి బ్రహ్మయే గొప్పవాడని పూజలు చేయడం ప్రారంభించాడట. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై బ్రహ్మను సమీపించి, ‘నీవు శివలింగం ఆదిని చూశావా?’ అని అడిగాడట. అందుకు బ్రహ్మ చూశానని పలికి మొగలి పువ్వును సాక్ష్యం చెప్పుమన్నాడట. అందుకు మొగలి పువ్వు – ‘నిజమే! బ్రహ్మదేవుడు శివలింగం ఆదిని చూశాడు’ అని సాక్ష్యం చెప్పిందట. హంస అబద్ధం చెబుతోందని కోపించిన శివుడు మొగలిపువ్వు అబద్ధం చెప్పింది కనుక దానికి పూజార్హత
ఉండదని శపించాడట. అటు తరువాత శివుడు కామధేనువును ప్రశ్నించగా, ఆ కామధేనువు నిజమే చూశాడని తలఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతూ చెప్పిందట. అప్పుడు శివుడు కామధేనువు తలఊపి అసత్యమాడింది కనుక కామధేనువు తల భాగం పూజార్హంకాదనీ, తోకతో చెప్పింది కనుక తోకవైపు భాగమే పూజనీయమనీ శాపం ఇచ్చాడట.
ఇంతకూ బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివలింగం ఆద్యంతాలను కనుగొనలేకపోయామని శివునితో చెప్పారట. ఆ దినం మాఘ కృష్ణ చతుర్దశి అయినందువల్ల ఆనాటి అర్ధరాత్రిని లింగోద్భవకాలంగా భావించి, మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. శివుడు లింగరూపంలో
ఉద్భవించిన పుణ్యతిథి కావడం వల్ల ప్రపంచమంతా ఈ దినాన శివారాధనలో తన్మయత్వాన్ని చెందుతుంది.
శివుడు అభిషేకప్రియుడు కనుక శివరాత్రినాడు శివాలయాలలో రుద్రాభిషేకార్చనలూ, మహాన్యాసపూజలూ విశేషంగా జరుగుతాయి. ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థమూ శివుడే అనే అర్థాన్ని కలిగిన రుద్రాధ్యాయమంత్రాలను చదువుతూ, పంచామృతాలతోనూ, ఫలోదకాలతోనూ, పవిత్ర నదీ జలాలతోనూ శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తారు. బిల్వదళాలు శివునికి ఎంతో ప్రీతి పాత్రాలు కనుక బిల్వార్చనలతో అన్ని ఆలయాలూ భక్తితాత్పర్యాలతో కూడి ఉంటాయి.
మహా శివరాత్రి నాడు భక్తులు ఉపవాసం చేస్తారు. ఫలాలూ, జలాలూ తప్ప అన్న పదార్థాలను ముట్టుకోరు. నిశీధి వేళలో శివలింగార్చన ఎంతో పుణ్యదాయకం అని సమస్తపురాణేతిహాసాలూ చెబుతున్నాయి. మహాశివరాత్రి వేళ అర్చనలు చేస్తూ, రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారు. భక్తి గీతాలతోనూ, భజనలతోనూ రాత్రంతా కాలక్షేపం చేయడం పరిపాటి.
‘నా-రుద్రో రుద్రమర్చయేత్’ అని ప్రాచీన సూక్తి.
రుద్రుని అభిషేకించే సమయంలో ప్రతి వ్యక్తి తాను శివునిగా మారుతాడు. తనలో శివతత్త్వాన్ని ఆవాహన చేసుకుంటాడు. సమస్తం శివమయం అనీ, శివుడు లేని చోటు ప్రపంచంలో లేనే లేదనీ భావించడం సంప్రదాయం. శివారాధనకు ఉపయుక్తమైన వేదమంత్రాలనూ, స్తోత్రాలనూ పఠిస్తారు. సహస్రనామార్చనలు నిర్వహిస్తారు. పుష్పదంతుడు అనే గంధర్వరాజు రచించిన శివమహిమ్న స్తోత్రంతో కూడా శివునికి అభిషేకాలూ, పూజలూ చేయడం కొన్ని చోట్ల కనబడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పేరుగాంచిన పన్నెండు శివక్షేత్రాలలో శివునికి అభిషేకాలూ, అర్చనలూ, పెద్ద ఎత్తున జరుగుతాయి. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంలో, కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయంలో, వరంగల్లులోని వేయి స్తంభాలగుడిలో, రామప్ప దివ్యక్షేత్రంలో, బిక్కనూరు
శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో, నాగర్‌కర్నూలు జిల్లాలోని
ఉమామహేశ్వర క్షేత్రంలో, ఇంకా ఎన్నో శివాలయాలలో మహాశివరాత్రి పూజలు, వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
శివారాధన ఐహిక ఫలాలనూ, మోక్షాన్నీ ప్రసాదిస్తుందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. భోళా శంకరుడుగా భక్తుల హృదయాలలో వెలిగే శివుడు కోరిన వెంటనే వరాలు ఇస్తాడని నమ్మకం. అందుకే అడుగడుగునా శివారాధన చేయడం లోకమంతా కనబడుతుంది.
ఓం నమశ్శివాయ!