వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)రెండోదశ యునిట్‌లో మే 30వ తేదీన ప్రయోగాత్మకంగా చేసిన విద్యుత్ ఉత్పత్తి విజయవంతం కావడంతో సీఎం కె.చంద్రశేఖరరావు ఇంజనీర్లను అభినందించారు. ఇదే స్పూర్తితో రాష్ట్రంలోని కొత్త విద్యుత్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాని ఆయన ఇంజనీర్లను కోరారు.
విద్యుత్‌శాఖామంత్రి జగదీష్‌రెడ్డి ఇంజనీర్లను అభినందించారు. ఇంజనీర్ల పట్టుదల ఫలితంగానే రెండోదశ పదినెలల తక్కువ కాలంలో పూర్తయ్యిందని ప్రశంసించారు. 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ యూనిట్ ఉత్పత్తిని జెన్‌కో సీఎండి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ప్రభాకర్‌రావు సమక్షంలో ప్రారంభించారు. కేటీపీపీ బాయిర్ లైటప్ ప్రక్రియ విజయవంతం కావడంతో గత పదినెలలుగా జెన్‌కో ఇంజనీర్ల బృందం నిరంతరం చేసిన కృషి నెరవేరినట్లయ్యింది.
లైటప్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయ వంతం కావడంతో ఇంజనీర్లు, ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జెన్‌కో సీఎండి ప్రభాకర్‌రావు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టులో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి చేసి రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన ఉద్యోగులకు, ఇంజనీర్లకు చెప్పారు.