తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు డిసెంబరు 16న ప్రారంభమైనాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై లఘు చర్చలు జరపడంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలకు మంత్రులు సంతృప్తి కరమైన సమాధానాలు ఇచ్చారు.
ఈ సమావేశాలలో వివిధ అంశాలపై లఘు చర్చ జరిపారు. వీటిలో ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వ్యవసాయ ఆధునీకీకరణ, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ చెల్లింపు, టీఎస్-ఐపాస్, సులభతర వ్యాపార నిర్వహణ, ఐటీ, రాష్ట్రంలో జాతీయ రహదారులు, రోడ్లు- భవనాలు, రోడ్లు, వంతెనలు, బలహీన వర్గాల గృహ నిర్మాణం, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, రెండు పడకగదుల ఇళ్ళ నిర్మాణంపై లఘు చర్చ జరిగింది. వీటితో పాటు పలు బిల్లులను ఆమోదింపచేశారు. వీటిలో.. జిల్లాల పెంపు, కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు తదితర ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి.
దశబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ భూములకు సత్వరం నీళ్లందించడం కోసమే భూసేకరణ బిల్లును తీసుకొని వచ్చామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. డిసెంబర్ 28న శాసనసభలో భూసేకరణ బిల్లు – 2016ను ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ బిల్లును సభ ఆమోదించింది.
కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరంవున్నదని, ఈ లక్ష్య సాధన కోసమే కొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకొని వస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం నిర్మించతల పెట్టిన ప్రాజెక్టులను ఆపేదిలేదని కె.సి.ఆర్. స్పష్టం చేశారు.
అలాగే, శాసనసభలో పలు అంశాలపై జరిగిన లఘుచర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆయా శాఖల మంత్రులు వివరాణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు.
రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాలు అమలు పరచిన బలహీన వర్గాల గృహ నిర్మాణంలో అప్పులపాలైన నిరుపేద లబ్దిదారులకు ఊరట కల్గించే ప్రకటన చేశారు. 2003 నుంచి 2014 వరకు బలహీన వర్గాల గృహ నిర్మాణంలో లబ్ధిదారులు తిరిగి చెల్లించవలసిన 3,920 కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ప్రకటించారు. ప్రతిపక్షాలు సయితం సి.ఎం. ప్రకటనపై హర్షం వ్యక్తం చేశాయి.
తెలంగాణ చట్టాలు (రద్దు చేయు) బిల్లు – 2016,
తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు మరియు అనర్హతల తొలగింపు (రెండవ సరవణ) బిల్లు-2016(2016 సం. ఎల్.ఎ. బిల్లు నెం. 13),
తెలంగాణ జిల్లా (ఏర్పాటు) (సవరణ) బిల్లు 2016 (2016 సం. ఎల్.ఎ. బిల్లు నెం. 14)
కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్ధిపేట, ఖమ్మం మహా నగరాలలో పోలీసు కమిషనరేట్‌లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించిన బిల్లు
తెలంగాణ వెనుకబడిన తరగతుల కొరకు కమీషను (సవరణ) బిల్లు, 2016 (2016 సం. ఎల్.ఎ. బిల్లు నెం. 19)
తెలంగాణ పురపాలక శాసనాలు, పట్టణాభివృద్ధి సంస్థల శాసనాల (సవరణ) బిల్లు 2016 (2016 సం. ఎల్.ఎ. బిల్లు నెం. 20)
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు-2016 (2016 సం. ఎల్.ఎ.బిల్లు నెం. 21) తదితర బిల్లులను ఆమోదింపచేశారు.
శాంతి భద్రతలకు తీవ్ర విఘాతంగా పరిణమించి పోలీసుల చేతిలో హతమైన నయీం ముఠా నేరాలు, ప్రభుత్వ చర్యలపై డిసెంబర్ 17న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర శాసనసభలో చేసిన ప్రకటన..
గత రెండున్నర దశాబ్దాలకాలంలో రాష్ట్రంలో నయీం ముఠా దారుణమైన నేర చర్యలకు పాల్పడింది. భువనగిరి కేంద్రంగా ప్రారంభమైన ఈ ముఠా కార్యకలాపాలు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. నయీం అరాచకాలకు ఎంతోమంది బలైపోయారు. ప్రజలు భయం గుప్పిట్లో బ్రతకాల్సిన పరిస్థితులు దాపురించాయి. గత ప్రభుత్వాల పరిపాలనలో నయీం యథేచ్ఛగా తన నేర చర్యలు కొనసాగించాడు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతోమంది నయీం బాధితులు న్యాయం చేయమని మొరపెట్టుకున్నారు. దీంతో తీవ్రమైన అసాంఘిక శక్తిగా మారిన నయీం ముఠాను కఠినంగా అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టవలసిందిగా పోలీసులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసుశాఖ నయీం కదలికల మీద నిరంతర నిఘా పెట్టింది.
గత ఆగస్టు 8వ తేదీన నయీం షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్ పరిసర ప్రాంతంలో మారణాయుధాలతో సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక ఎ.కె. 47 రైఫిల్‌తోపాటు, 9 ఎంఎం పిస్ట ల్, మందుగుండు సామగ్రి లభించింది.
నయీం నేర చర్యలకున్న విస్తృతిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను నియమించింది. దర్యాప్తు సమర్థవంతంగా జరగాలని సిట్ నేతృత్వంలో నాలుగు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నయీం మరణంతో బాధితుల్లో భయం తొలగిపోయి, ప్రభుత్వంపై భరోసా ఏర్పడి సిట్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదుల ఆధారంగా 174 కేసులు నమోదయ్యాయి. 741మంది సాక్షులను పోలీసులు విచారించారు. 124మంది నిందితులను అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నయీం ముఠాకు చెందిన స్థావరాలలో పోలీసులు జరిపిన సోదాలలో 21 తుపాకులు, 21 కార్లు, 26 మోటారు సైకిళ్లు, 2 కోట్ల 95లక్షల 9వేల 80 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నయీం బంధుమిత్రుల పేరుమీద రిజిస్టర్ చేయబడిన దాదాపు 1015 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను, ఒక లక్షా 67 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇండ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలను, 27 గృహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల మొత్తం రిజిస్ట్రేషన్ విలువ 143 కోట్ల 94లక్షల 5వేల 198 రూపాయలు. 27 హత్య కేసుల్లో ఇప్పటికే నయీం ముఠా పాత్రను గుర్తించి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. మరో 25 హత్యలకు నయీం ముఠా పాల్పడినట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలో పోలీసులు నయీం ముఠా పాల్పడిన నేరాలకు సంబంధించి అనేక వివరాలను, ఆధారాలను ఇప్పటికే సేకరించారు. రెండు చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేశారు. మరో 15 చార్జిషీట్లు తయారయ్యాయి. త్వరలోనే వాటినీ విచారణ నిమిత్తం కోర్టుకు సమర్పించను న్నారు. అయితే, నయీం ముఠా సాగించిన నేరాల విస్తృతిరీత్యా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది.
తన అకృత్యాలతో ప్రజల్ని వేధించిన నయీం ముఠా అంత మొందడంతో ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం ఇటువంటి అరాచక శక్తులను అణచివేయడంలో ప్రదర్శిస్తున్న కఠినవైఖరిని ప్రజలు అభినందిస్తున్నారు. నయీం విషయంలో పోలీసులు ప్రదర్శించిన సమర్థతను ప్రభుత్వం అభినందిస్తున్నది.
జాతీయ రహదారుల సాధనలో విజయాలు
తెలంగాణలో నూతన జాతీయ రహదారుల నిర్మాణం- ప్రభుత్వ కృషి: అసెంబ్లీలో సీఎం
తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రాన్ని అంగీకరింపజేయడంలో, అవసరమైన నిధులను పెద్ద మొత్తంలో మంజూరు చేయించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించిందని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఈ విజయం బంగారు తెలంగాణ సాధనలో ఒక మేలి మలుపు. ఏడు దశాబ్దాల చరిత్రలో గత ప్రభుత్వాలు సాధించలేకపోయిన అద్భుతమైన ఫలితాన్ని కేవలం రెండున్నరేళ్ల కాలంలో అకుంఠిత దీక్షతో, నిరంతర కృషితో తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్నిరంగాల్లో తీవ్రమైన వివక్ష అమలయినట్లుగానే జాతీయ రహదారుల గుర్తింపు విష యంలోనూ అమలయింది. కాలానుగుణంగా, పెరిగిన అవసరా లకు తగినట్లుగా కొత్త జాతీయ రహదారులు ఏర్పడలేదు. ఇది తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. మా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే ఈ పరిస్థితిని మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రా నికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభు త్వం ముందుంచింది. నూతన జాతీయ రహదారుల నిర్మాణం అవసరాన్ని కేం ద్రం ముందు బలంగా ప్రతిపాదించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మనకున్న జాతీయ రహదారి కేవలం 2,527 కిలోమీటర్లు, ఆనాడు దేశంలో జాతీయ రహదారుల సగటు 2.80 కిలోమీటర్లు. ఆంధ్ర సగటు 3.15 కిలోమీటర్లు అయితే, తెలంగాణ సగటు 2.20 కిలోమీటర్లు మాత్రమే. రాష్ట్రం ఏర్పడే నాటికి జాతీయ రహదారుల సగటులో దక్షిణ భారతదేశంలో తెలంగాణ అట్టడుగున ఉన్నది. ఈ పరిస్థితిని మార్చి తీరాలని ప్రయత్నాలు ప్రారంభించాం. కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీని అనేక పర్యాయాలు కలిసి జాతీయ రహదారులను విస్తరించాల్సిందిగా విన్నవించాం. నేను స్వయంగా పూనుకొని పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రిని కలిసి సమగ్ర నివేదికలను, ప్రతిపాదనలను అందించాను.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలోని సహేతుకతను కేంద్రం గుర్తించింది. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి ముందుకొచ్చింది. 2776 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను రాష్ట్రానికి మంజూరు చేయించుకోవడంలో ప్రభుత్వం సఫలమైంది.
(1) చౌటుప్పల్-ఇబ్రహీంపట్నం-ఆమనగల్-షాద్‌నగర్-చేవెళ్ల-శంకర్‌పల్లి-కంది186 కి.మీ
(2) మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి 133 కి.మీ
(3) హైదరాబాద్ ఓఆర్‌ఆర్-ఘట్‌కేసర్-ఎదులాబాద్-వలిగొండ-తొర్రూరు-నెల్లికుదురు- మహబూబాబాద్-ఇల్లందు-కొత్తగూడెం 234 కి.మీ
(4) వరంగల్-ఖమ్మం 120 కి.మీ
మొత్తం 2776 కి.మీ
త్వరలోనే మన రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5303 కిలోమీటర్లకు పెరుగనుందని సభకు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు దేశంలో జాతీయ రహదారుల సగటు 3.81 కి.మీ. తెలంగాణ రాష్ట్రంలో అది 4.62 కి.మీ. అంటే ప్రభుత్వ కృషివల్ల తెలంగాణలో జాతీయ రహదారుల సగటు జాతీయ సగటును మించిపోయింది. దక్షిణ భారతదేశంలో నిన్నటిదాకా అట్టడుగున ఉన్న మన రాష్ట్రం, నేడు అగ్రభాగాన నిలిచిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాను.
జాతీయ రహదారుల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం 2690 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సెంట్రల్‌రోడ్ ఫండ్‌నుంచి 1020 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఎన్‌హెచ్‌ఎఐ పరిధిలో చేపట్టే మరోఐదు హైవేలను ఫోర్ లేన్లతో నిర్మించడానికి 8వేల కోట్ల రూపాయలను ఇస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్‌లో ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. ఆ రహదారుల వివరాలు ఇలా ఉన్నాయి.
(1) సంగారెడ్డి-నాందేడ్ రోడ్‌కు 2500 కోట్లు
(2) సూర్యాపేట-ఖమ్మం రోడ్‌కు 1000 కోట్లు
(3) జగిత్యాల-కరీంనగర్-వరంగల్ రోడ్‌కు 2300 కోట్లు
(4) మంచిర్యాల-చంద్రాపూర్ రోడ్‌కు 1500 కోట్లు
(5) కోదాడ-ఖమ్మం రోడ్‌కు 700 కోట్లు
మిషన్ కాకతీయతో పెరిగిన సాగు విస్తీర్ణం
‘మిషన్ కాకతీయ’పై స్వల్ప వ్యవధి చర్చ సందర్భంగా సాగునీరు, మార్కెటింగ్ శాసనవ్యవహారాలశాఖమత్రి టి. హరీష్‌రావు శాసనసభలో చేసిన ప్రకటన..
అనాది ఆధారాలైన చెరువుల పునరుద్ధరణ ఒక తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష. 60 ఏండ్ల సమైక్య పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురై ధ్వంసమైనాయి. ఉద్యమం సందర్భంగా చెరువుల పునరుద్దరణ జరుగాలని ప్రజలు కలగన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పేరిట చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినప్పుడు ప్రభుత్వానికి దీని ఫలితాలపై స్పష్టమైన అంచనాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 2014లో మొదటిసారిగా తెలంగాణలో చెరువుల సమగ్ర సర్వే జరిగింది. అన్ని జిల్లాల్లో మొత్తం చెరువుల సంఖ్య 46531గా తేలింది. ఇందులో గొలుసుకట్టు చెరువులు సుమారు 5వేలకు పైనే ఉన్నట్టు లెక్క తేలింది.
ప్రతీ సంవత్సరం చెరువుల పునరుద్ధరణకు 20 శాతం చెరువులను ఎంపిక చెయ్యాలని ప్రభుత్వం భావించింది. 12 మార్చి 2015 రోజున నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ గ్రామంలోని పాత చెరువు పునరుద్ధరణ పనులతో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభించారు.
మొదటి దశలో 8,165 చెరువులకు ప్రభుత్వం రూ.2,595 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 8,059 చెరువుల్లో పనులను ప్రారంభించడం జరిగింది. ఈ అన్ని చెరువుల పనులు పూర్తి అయ్యాయి.
రెండో దశలో 9,113 చెరువులకు రూ.3,130 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. 8,806 చెరువుల పనులని చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు రెండో దశలో 1536 పనులు పూర్తి అయినాయి. మిగతా చెరువుల పనులని జూన్ 2017 లోపు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.
మూడో దశ పనులు జనవరి 2017 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడో దశలో మొత్తం కట్టు కాలువలని పునరుద్ధరించాలని, అవకాశం ఉన్నచోట కొత్త చెరువులను నిర్మించాలని నిర్ణయించడం జరిగింది.
మిషన్ కాకతీయ ఫలితాలు:
ఈసారి చెరువుల క్రింద సాగు విస్తీర్ణం రెండింతలు అయ్యిందని ప్రాథమిక సమాచారం. వ్యవసాయశాఖ చెరువుల క్రింద సాగు విస్తీర్ణాన్ని అంచనా వేస్తున్నది. మిషన్ కాకతీయ పనుల కారణంగా చెరవుల క్రింద సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించడం జరిగింది.
పూడికమట్టి చల్లుకున్న చేను చెలకల్లో పత్తి పంట, మిరప, సోయాబీన్, వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్ల తోటలు, పూల తోటలు మొదలైన పంటల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తేలుతున్నది. పంట ఏపుగా పెరిగిందని రైతులు పేర్కొ న్నారు. ఖరీఫ్‌లో పంట దిగుబడి తప్పకుండా పెరుగుతుందని అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం కూడా తగ్గిందని వారు అన్నారు. ఇందుమూలంగా రైతులకు రూ. 3,750 ఒక హెక్టారుకు లాభము చేకూర్చడం జరిగింది.
భూగర్భ జలాల వృద్ధిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని భూగర్భ జలశాఖవారి అధ్యయనంలో తేలింది. 2016 మేనెల నుంచి సెప్టెంబర్ దాకా వారి అధ్యయన ఫలితాలను క్రోడీకరించారు. రాష్ట్ర సరాసరి చూసినప్పుడు భూగర్భ జలమట్టం 8.42 మీ|| పెరిగినట్టుగా తేలింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 15.17 మీ||, అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 1.81 మీ|| భూగర్భ జల మట్టం పెరిగినట్టుగా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
5వేలకుపైగా మిషన్ కాకతీయ చెరువుల్లో మత్స్యశాఖ వారి తరపున 40 కోట్ల చేప పిల్లలని వదలడం జరిగింది. సంవత్సర కాలంలో మత్స్యకారుల చేతికి పంట అందుతుంది. మిషన్ కాకతీయ ఫలితంగా మత్స్యకార కుటుంబాలకు నిశ్చితమైన ఆదాయం సమకూరే పరిస్థితి ఏర్పడింది.
‘నీతి ఆయోగ్’ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా, ప్రముఖ వ్యవసాయ శాస్త్రజ్ఞులు, గ్రీన్ రెవల్యూషన్ దార్శనికుడు డా.ఎం.ఎస్. స్వామినాథన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైదరాబాద్ వారు ‘వాటర్‌మాన్ ఆఫ్ ఇండియా’గా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ‘రామన్ మెగసెసె అవార్డు గ్రహీత’ రాజేందర్‌సింగ్, కేంద్ర జలవనరులమంత్రిత్వశాఖ ఓఎస్డీ అమర్‌జీత్‌సింగ్, బ్రిటిష్ పార్లమెంటరీ బృందం మిషన్ కాకతీయ పనులపై, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై ప్రశంసలు కురిపించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం: సీఎం ప్రకటన
నిరాశ్రయులైన ప్రజలు తలదాచుకో వడానికి ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం చాలా కాలంగా బలహీనవర్గాల గృహ నిర్మాణ పథకం అమలవుతున్నది. ఉమ్మడి ఏపీలో 2003 వరకు 17 లక్షల 34వేల 826 గృహాలు నిర్మించారు. వీటికోసం పెట్టిన ఖర్చు 1,805.26 కోట్ల రూపాయలు. 2004 నుంచి 2014 వరకు 24 లక్షల 91వేల 870 గృహాలు పేదలకు నిర్మించి ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దీనికోసం పెట్టిన ఖర్చు 9,075 కోట్ల రూపాయలు. రాజీవ్ స్వగృహ కింద 1621 కోట్ల వ్యయంతో 12,089 ఇండ్లు, రాజీవ్ గృహకల్ప కింద 392 కోట్లతో 37,217 గృహాలు నిర్మాణమయినట్లు ప్రభుత్వ నివేదికల్లో ఉంది. ఇంకా జీహెచ్‌ఎంసీ పరిధిలో జేఎన్‌యూఆర్‌ఎంకింద 46,519 ఇండ్లు, వాంబే పథకం ద్వారా 6,608 ఇండ్లు కట్టినట్లు రికార్డుల్లో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో 43 లక్షల 29వేల 124 ఇండ్లు బలహీనవర్గాలకోసం నిర్మించబడ్డాయి. ఈ లెక్కన చూస్తే ఈ రాష్ట్రంలో అసలు ఇండ్లులేని కుటుంబాలు ఉండకూడదు. కొత్తగా ఇండ్లు కట్టించాల్సిన అవసరమే ఏర్పడకూడదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ లక్షలాది మంది పేదలు తమకు ఇండ్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు. దీన్నిబట్టి తేలుతున్నదేమిటంటే ప్రభుత్వ లెక్కల్లో ఉన్నట్లు ఇండ్ల నిర్మాణం కాలేదన్నది అసలు వాస్తవం. అదే సమయంలో ఇండ్ల కోసం వెచ్చించబడినదిగా చెప్పబడుతున్న ప్రజాధనం అవినీతిపరుల జేబుల్లోకి చేరిందన్నది కూడా అంతే వాస్తవం.
ప్రజల ప్రాథమిక అవసరం నెరవేర్చాలని ప్రారంభమయిన గృహ నిర్మాణ పథకం లక్ష్యంమారి పార్టీల కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెట్టే పథకంగా మారింది. ముఖ్యంగా 2004నుంచి 2014 వరకు జరిగిన అవినీతిని విచారిస్తే అనేక నిజాలు బయటపడ్డాయి. ఎన్ని ఇండ్లు నిర్మించామని చెప్పి బిల్లులెత్తారో అన్ని ఇండ్లు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేవు. గ్రామంలోని కుటుంబాల సంఖ్య కంటే ఇండ్లు ఎక్కువ మంజూరు చేయించుకుని బిల్లులు కాజేసిన సంఘటనలు కోకొల్లలు. మంథని నియోజకవర్గంలో కుటుంబాల సంఖ్యకన్నా 40శాతం అధికంగా ఇండ్లు మంజూరు కావడం, వాటికి బిల్లులు కూడా చెల్లించబడడం అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఓ ఉదాహరణ. పాలకులు, అధికారులు మిలాఖతై విశృంఖలంగా పాల్పడ్డ అవినీతిపై అప్పటి ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. ప్రజాధనం నిస్సిగ్గుగా దోచేయ బడిందని ఎంక్వయిరీలో వెల్లడైంది. దీంతోపాటు థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా జరిగింది.
2004-2014 మధ్య కాలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అవినీతికి సంబంధించి 225మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 122మంది అధికారులు, 113మంది మధ్య దళారులు, రాజకీయ నాయకులూ ఉన్నారు. ఒక జెడ్పీటీసీ, ముగ్గురు ఎంపీటీసీలు, 14మంది సర్పంచులు, ముగ్గురు సింగిల్ విండో చైర్మన్లు ఈ అవినీతిలో భాగం పంచుకున్నట్లు గత ప్రభుత్వమే తేల్చింది. లక్షా 95వేల 519మంది అనర్హులు ఇండ్లు పొందినట్లు తేలింది. ఈ అనర్హుల్లో ఒక లక్ష 4వేలమందికి 235.90 కోట్ల రూపాయలు చెల్లించారు. మరో 140మందిని సస్పెండ్ చేశారు. వీరిలో 122మందిపై ఆరోపణలు రుజువై శిక్షలు పడ్డాయి. 2.86 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. సమైక్య రాష్ట్రంలో విస్తృతస్థాయిలో జరిగిన ఈ అవినీతి వివరాలు పూర్తిగా బయటకు రావాలనే ఉద్దేశ్యంతో మేము ప్రభుత్వంలోకి రాగానే 2014 జూలై 26న సీబీసీఐడీ విచారణకు ఆదేశించాము. విచారణ కొనసాగుతున్నది.
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతిపై విచారణ జరుగుతున్న సందర్భంలో నిజంగానే ఇల్లు కట్టుకున్న పేదలకు అన్యాయం జరుగవద్దని మేము భావించాము. అందుకే ఇందిరమ్మ ఇండ్లపై సర్వే చేసి, వాస్తవంగా ఇండ్లు కట్టుకున్న వారిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించాము.రెవిన్యూ బృందాలు గ్రామాల్లో పర్యటించి లక్షా 19వేలమంది బోగస్ లబ్ధిదారులున్నారని, 2,46,170మంది నిజంగానే ఇండ్లు కట్టుకుంటున్నట్లు తేలింది. ఇందులో 56,059 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. 2లక్షల 4వేల ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. వీటికి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లకు 369.48 కోట్ల రూపాయలు చెల్లించాము. ఇందిరమ్మ ఇండ్లన్నీ పూర్తయిన తర్వాత 1,159.85 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2014కు ముందు మంజూరై ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇండ్లకు కూడా ప్రస్తుత ప్రభుత్వము బిల్లులు చెల్లిస్తున్నదనే వాస్తవాన్ని సభ ముందు ఉంచుతున్నాను.
ప్రజాపోరాటంద్వారా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో పేదల నిజమైన అవసరాలు తీర్చే విధంగా గృహ నిర్మాణ పథకాన్ని రూపొందించాలని, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా దానిని అమలు చేయాలని సంకల్పించాం. ఒక్క గదిలో కుటుంబ సభ్యులంతా కలిసి నివసించాల్సి రావడం చాలా ఇబ్బందికరం. ఇటువంటి ఇంట్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు వర్ణనాతీతం. ఈ పరిస్థితి ఉండకూడదనే ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చాం. ప్రభుత్వం కొంత ఇచ్చి లబ్దిదారులు కొంత సమకూర్చుకుని ఇండ్లు నిర్మించుకునే పద్ధతికి మా ప్రభుత్వం పూర్తి స్వస్తి పలికింది. లబ్దిదారులమీద ఒక్కపైసా భారం పడకుండా ఉండేవిధంగా ఈ పథకం రూపొందించాం. ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. దీనివల్ల బలహీనవర్గాల గృహనిర్మాణానికి అయ్యే ఖర్చు గతంలో ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుతో పోల్చి చూస్తే ఎన్నో రెట్లు పెరిగింది. 560 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు గ్రామాల్లో 5 లక్షల 4వేల రూపాయలు, పట్టణాల్లో 5 లక్షల 30వేల రూపాయలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏడు లక్షల రూపాయల చొప్పున కేటాయించాం.
గతంతో పోలిస్తే ఇండ్ల నిర్మాణం కోసం చేసే వ్యయం చాలా ఎక్కువవుతోంది. అందుకే బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు వివిధ ఆర్థిక సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇండ్ల నిర్మాణం కోసం కావాల్సిన 17,660 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చుకున్నదని సభకు తెలియజేస్తున్నాను. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 1433 కోట్ల రూపాయలు కేటాయించాం. కేంద్రంనుంచి కూడా గృహ నిర్మాణ పథకాలకు 333 కోట్ల రూపాయలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1,766 కోట్ల రూపాయలు సమకూర్చగా, హడ్కో గతేడాది 3,344.76 కోట్ల రూపాయలు, ఈ ఏడాది 12,549 కోట్ల రూపాయలు… మొత్తం 15,893.76 కోట్ల రూపాయలు అందించడానికి అంగీకరించింది. మొత్తం 17,660.40 కోట్లు ఇండ్ల నిర్మాణంకోసం సిద్ధంగానే ఉన్నాయని ఈ సభకు తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చే నాటికి గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణంకోసం 11వేల కోట్లు ఖర్చు చేస్తే, రెండున్నరేళ్లలోనే 17,660 కోట్లు కేటాయించాం.
ఈ విషయం అర్థం చేసుకోలేకపోయిన పేదలు ప్రభుత్వం తమకు ఇల్లు కట్టిస్తుందనే ఆశతో ముందుకొచ్చారు. ఎక్కువ భారం వారే మోసి, అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అసలుకు మిత్తికూడా తోడై మోయలేని భారంతో పేదలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బ్యాంకు రుణాలు వసూలు చేయడంకోసం ప్రభుత్వాధికారులు వారి ఇంటి దర్వాజలను ఊడదీసుకుపోవడం, అధికారులు వస్తున్నారంటేనే ప్రజలు ఇండ్లకు తాళాలువేసి వెళ్లిపోవడం లాంటి సంఘటనలెన్నో మనమంతా చూశామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గృహ నిర్మాణ పథకం పేదలకు నిలువనీడ కల్పించాల్సిందిపోయి, వారిని రుణగ్రస్తులను చేసి, అవమానాలపాలుచేసే పథకంగా మారింది.
ఇటువంటి కష్టం ఇక మీద పేద ప్రజలకు కలుగకూడదనే మా ప్రభుత్వం నిర్ణయించుకుంది. రెండు బెడ్‌రూముల ఇండ్ల నిర్మాణంలో ఒక్క పైసా భారం కూడా పేదలపై వేయకుండా వందశాతం ప్రభుత్వ ఖర్చుతోనే ఇంటిని నిర్మించి ఇస్తున్నాం.
ఈ సందర్భంలో సభ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పథకం అవినీతిపరుల పాలైతే మునుపటికన్నా ఎక్కువ మొత్తం ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. అవినీతికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించింది. ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగేలా విధివిధానాలు రూపొందించాం. ఇదివరకటి మాదిరిగా ఇంచార్జి మంత్రి కోటా, ఎమ్మెల్యే కోటా అనే కోటా పద్ధతిని రద్దు చేశాం. దీనిద్వారా రాజకీయ జోక్యాన్ని సమూలంగా నివారించాం. ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే, గ్రామాల్లోని లబ్దిదారులను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తున్నది. మొదట దరఖాస్తులు స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత గ్రామసభలో ప్రజల మధ్య చర్చించి, ప్రజల ఆమోదంతోనే లబ్దిదారులను ఎంపిక చేసే పద్ధతిని పాటిస్తున్నాం. గ్రామానికి మంజూరు చేసిన ఇండ్ల సంఖ్యకన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు లాటరీ పద్ధతిని అనుసరిస్తున్నాం.
ఇండ్ల నిర్మాణం తగిన నాణ్యతా ప్రమాణాలతో జరగాలి. ప్రభుత్వం ఆశించిన ఆదర్శం నెరవేరాలి. ఇందుకోసం నిర్మాణ సామర్థ్యం, అనుభవం ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు ఇండ్ల నిర్మాణాన్ని అప్పగించాలని కలెక్టర్లను కోరాము. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలకోసం అవసరమైన స్థలాలను కలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేశారు. మొత్తం 2 లక్షల 60వేల ఇండ్లు మంజూరు చేశాము. టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. 14,224 ఇండ్లకు టెండర్లు ఖరారయ్యాయి. 1217 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ప్రజలు నివాసం ఉంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 9588 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి.
ఇక్కడొక వాస్తవం సభముందు పెట్టదలచుకున్నాను. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణంలాంటి పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎక్కువ వర్కింగ్ ఏజెన్సీలు ఈ పనుల్లోనే ఉన్నాయి. రెండో కారణం.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ఎక్కువ లాభం ఉండే అవకాశం లేదని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు.
అయినా, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు ప్రారంభించింది. ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నాం. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి కావల్సిన ఇసుకను ఉచితంగా అందిస్తున్నాం. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా సిమెంటును 230 రూపాయల ధరకే ఇచ్చేటట్లు 31 కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం. అనుకున్న ప్రకారం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు సాధించుకున్న స్వరాష్ట్రంలో, పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా నివాసగృహాలను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉన్నదని సవినయనంగా సభకు తెలియజేస్తున్నాను.
పెద్ద నోట్ల రద్దుపై సీఎం ప్రకటన
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఫలితంగా మన రాష్ట్రంపై దాని ప్రభావంపై డిసెంబరు 16న రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మాట్లాడారు. దేశంలో విపరీతంగా పెరుగుతున్న నల్లధనాన్ని నిర్మూలించడం, నకిలీ నోట్ల చలామణిని అడ్డుకోవడం, రాజకీయ అవినీతిని సమూలంగా నిర్మూలంచడం, రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడం, తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని నియంత్రించడం, తద్వారా అవినీతి రహిత భారతదేశ నిర్మాణం లక్ష్యమని చెబుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ చలామణిలో వున్న పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న ప్రకటించారు. ప్రజలు తమవద్ద ఉన్న పాత 500, 1000 నోట్లను డిసెంబర్ 30లోగా బ్యాంకుల్లో జమ చేసుకోవాలని కోరారు.
దేశ ప్రయోజనాలకోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. అదే సమయంలో అన్ని రూపాలలో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించే దిశగా భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. కేవలం కరెన్సీ రూపంలోనే కాకుండా, వజ్రాలు, బంగారం నిలువల రూపంలో, షేర్ల రూపంలో, విదేశీ కరెన్సీ రూపంలో, క్రోనీ కాపిటలిజం మార్గంలో.. ఇంకా బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌నుంచి, మారిషస్, సింగపూర్ దేశాలనుంచి మనీ లాండరింగ్ ద్వారా మన దేశంలోకి ప్రవహిస్తున్న నల్లధనాన్ని పూర్తిగా కట్టడిచేసే దిశగా భారత ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన సూచిస్తున్నాము. ఈ ప్రక్రియ పూర్ణక్రాంతిని సాధించే వరకు కొనసాగినప్పుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది.
ఈ అంశం అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో, ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతున్నది. ఎప్పటికప్పుడు తగు పరిష్కారాలు సూచిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవంబర్ 19న నేను స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని నివేదించాను. చేపట్టాల్సిన చర్యలు సూచించాను.
ఇదే క్రమంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నవంబర్ 2న ఒక లేఖను, నవంబర్ 26న మరో లేఖను రిజర్వు బ్యాంక్ గవర్నర్‌కు రాశారు. రాష్ట్రానికి అవసరమైన సుమారు 5000 కోట్ల రూపాయలను చిన్న నోట్ల రూపంలో పంపించవలసిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. రిజర్వు బ్యాంకు అధికారులు డిసెంబర్ 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాధానమిస్తూ, రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినట్లు నగదు పంపనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణరావు నవంబర్ 21న రిజర్వుబ్యాంకు అధికారులకు లేఖరాస్తూ, రాష్ట్ర అవసరాలకు తగినంత నగదు పంపడంలో జరుగుతున్న లోపాలను పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లు ఇచ్చే విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. రైతులు, చిన్న వ్యాపారలు, దినసరి కూలీలపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. ఐదువేల కోట్ల రూపాయల మొత్తాన్ని రూ. 500, రూ. 100 నోట్ల రూపంలో సత్వరమే పంపాలని కోరారు. ఇదే విషయంపై ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర కూడా డిసెంబర్ 8న లేఖరాస్తూ, ఏటీఎంలలో తగినంత డబ్బు ఉండడంలేదనే విషయాన్ని దృష్టికి తెచ్చారు.
తెలంగాణ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ రెండుసార్లు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో చిన్న నోట్లు ఎక్కువగా పంపిచవలసిన అవసరాన్ని బలంగా తెలియజేశారు. ప్రభుత్వ శాఖలలో పాతనోట్ల ద్వారా బిల్లుల చెల్లింపుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పం దించి, దేశమంతా అన్ని రాష్ట్రాల్లో పాతనోట్ల ద్వారా బిల్లుల చెల్లింపుకు అనుమతిచ్చింది. తర్వాత గడువును పెంచమని చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆర్‌బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా మన రాష్ట్రానికి వచ్చిన నగదు 19,109 కోట్ల రూపాయలు. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తం 57,479 కోట్ల రూపాయలు, ప్రజల సమన్యలను మానవీయ దృక్పథంలో అర్థం చేసుకున్న ప్రభుత్వం బ్యాంకులవద్ద మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయవలసిందిగా బ్యాంకర్లను కోరింది.
పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా అంచనావేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నది. వెనువెంటనే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు ప్రారంభించింది. నగదు రహిత లావాదేవీలు జరపడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధ్యయన సంస్థలు ఇప్పటికే తేల్చాయి. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే అదే నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చగలిగింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో నగదు రహిత లావాదేవీల కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించింది. ప్రతీ జిల్లాలో కూడా కొన్ని గ్రామాలను త్వరలోనే నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలుగా ప్రకటించేందుకు ప్రయతాలు కొనసాగిస్తున్నట్లు కలెక్టర్లు చెప్పారు.
నగదు రహిత లావాదేవీల విషయంలో విధానపరమైన నిర్ణయాలకోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అమలును వేగవంతం చేయడంకోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రజలలో విశ్వాసం కలిగించే విధంగా నగదు రహిత లావాదేవీలకోసం టీఎస్ వ్యాలెట్‌ను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకురాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.
పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్
టిఎస్ ఐ పాస్‌పై డిసెంబర్ 26న జరిగిన చర్చలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. తెలంగాణ ఏర్పడితే పరిశ్రమలు తరలిపోతాయని జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేసి.. విద్యుత్తు, నీరు, శాంతిభద్రతలు, ప్రోత్సాహకాలతో హైదరాబాద్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చామని అన్నారు.
రాష్ట్రం ఏర్పాటైన రెండున్నర ఏండ్లలో 34వేల కోట్ల పెట్టుబడితో 7379 పరిశ్రమలను రప్పించామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. తమ ప్రభుత్వ నిరంతర కషి వల్లనే ప్రపంచంలోని టాప్-5 కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌కు తరలివచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన టీఎస్ ఐపాస్‌ను ప్రధానితో పాటు దేశ విదేశాల్లో పలువురు ప్రశంసించారని, ఇంత మెరుగైన విధానం అమెరికాలో కూడా లేదని అక్కడి పారిశ్రామికవేత్తలే చెప్పారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా 14 రంగాలను ప్రాధాన్యంగా ఎంచుకొని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామన్నారు. ఫార్మాసిటీతోపాటు మెడికల్ డివైజెస్ పార్క్, టెక్స్‌టైల్ పార్క్, లెదర్ పార్క్, ఫర్నిచర్ పార్క్, స్పైసెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఐటీ రంగ ఎగుమతులు రూ. 75 వేల కోట్లకు చేరుకున్నాయని, వచ్చే రెండేండ్లలో వీటిని రెట్టింపు చేస్తామన్నారు. టీఎస్ ఐపాస్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..
పెట్టుబడులు రావన్నారు..
సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం.. తెలంగాణ వచ్చాక పెట్టుబడులు రావని, ఉన్న పెట్టుబడులు కూడా పోతాయని కొందరు ప్రచారం చేశారు. వారి పేర్లు ఇక్కడ అనవసరం. ఆనాడు పారిశ్రామిక వేత్తలు విద్యుత్ ఇవ్వాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. ఎన్నో బాలారిష్టాలు దాటుకుని, సవాళ్లు ఎదుర్కొని శరవేగంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి పారిశ్రామికవేత్త టీఎస్ ఐపాస్‌ను అమలుచేస్తున్న ఆదర్శరాష్ట్రంగా తెలంగాణను చూస్తున్నారు. ఎన్నో ప్రోత్సాహకాలతోనే అపిల్, అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చాయి. సీఎం కేసీఆర్, నాటి పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు ఏడు గంటల పాటు పారిశ్రామిక వేత్తలతో చర్చించి పారిశ్రామిక పాలసీ రూపొందించారు. దానిని సమర్థవంతంగా అమలు చేస్తున్నందువల్లనే టీవీ18 బెస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆవార్డు ఇచ్చింది. వీటితో పాటు ఇండియాటుడే గత మూడు సంవత్సరాలుగా మనకే అవార్డు ఇస్తున్నది. అన్ని అవార్డులకంటే మాకు ప్రజలిచ్చిన అవార్డే గొప్ప. ఎక్కడ ఎన్నికలు జరిగినా మాకే గెలుపు సర్టిఫికెట్ ఇస్తున్నారు.
నంబర్1 కోసం ఎంతో కష్టపడ్డాం..
రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలని కేంద్రం ఈవోడీబీని ప్రవేశపెట్టింది.
2015-16లో మనకు 13వ ర్యాంక్ వచ్చింది. సీఎం కేసీఆర్‌తో పాటు అధికారులందరూ బాధపడ్డారు. తరువాత 66 సమావేశాలు పెట్టి 26చట్టాలు సవరించాం. 58 జీవోలు, 12 సర్క్యూలర్లు జారీ చేశాం. 19 వెబ్ పోర్టల్స్ డెవలప్ చేశాం. 113 సేవలను ఆన్‌లైన్ చేశాం. ఫలితంగా ఈ సంవత్సరం మనం 98.78శాతంతో నంబర్‌వన్‌గా నిలిచాం.
మౌలిక సదుపాయాలు కల్పించాం..
పరిశ్రమలు పెట్టేవారికి శాంతిభద్రతలు, విద్యుత్, నీరు కావాలి. పోలీసులు శాంతిభద్రతలను పకడ్బందీగా కాపాడుతున్నారు. పరిశ్రమలకు కరెంటును మూడు షిప్టులకు ఇస్తున్నాం. మిషన్ భగీరథ కింద 10శాతం నీరు కేటాయించాం. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగానే దేశానికి తెలుసు. కానీ ఒక ఉద్యమకారుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
ఫార్మాసిటీకి 12వేల ఎకరాలు ఎందుకంటే..
హైదరాబాద్ ఫార్మాసిటీకి 12వేల ఎకరాలకు మించి సేకరించే పనిలో ఉన్నాం. ఎందుకంటే కేంద్రం నిబంధనల ప్రకారం 12వేల ఎకరాలు ఉంటే కేంద్రం దీన్ని నిమ్జ్‌గా గుర్తిస్తుంది. తద్వారా వివిధ ప్రోత్సాహకాలు లభిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో గాలి, నీరు కలుషితం కాని విధంగా ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని 1545 పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు బయటకు దశలవారీగా తరలిస్తాం. జహీరాబాద్ నిమ్జ్‌కు 2800 ఎకరాలు సేకరించాం. వరంగల్‌లో 2వేల ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను నిర్మిస్తాం. ఫైబర్ టూ ఫ్యాబ్రిక్, వస్త్రాలు అన్నీ ఇక్కడే తయారవుతాయి. ఇక్కడే టెక్స్‌టైల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. సంగారెడ్డి సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజేస్ పార్క్‌ను అభివద్ధి చేస్తున్నాం. రావిరాల, మహేశ్వరంలో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. మైక్రోమాక్స్, సెల్‌కాన్, డేటావిండ్ సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయి. మైక్రోమాక్స్ ఆర్&డీ సెంటర్ చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. జనగాంలో మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ఫర్నిచర్ పార్క్‌ను డెవలప్ చేయబోతున్నాం. తెలంగాణ మొత్తంగా 7ఆటో నగరాలను 30 ఎకరాల చొప్పున అభివద్ధి చేస్తాం. రూరల్ ఇండస్ట్రియల్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తున్నాయి. సత్తుపల్లిలోని బుగ్గపాడులో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాం. ఆలంపూర్‌లో మరొక్కటి నిర్మాణంలో ఉంది. నిజామాబాద్‌లో 40 ఎకరాల్లో స్పైస్ పార్క్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఆరు ఇండస్ట్రియల్ కారిడార్లను గుర్తించాం. మొదటి దశలో హైదరాబాద్-వరంగల్ చేపట్టాం.
ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్..
2005-14 మధ్య కాలంలో తెలంగాణలో 13702 పరిశ్రమలు రూ.29183 కోట్లతో వచ్చాయి. 2014 నుంచి ఇప్పటి వరకు 7379 వచ్చాయి. టీఎస్‌ఐపాస్ ద్వారా 2929 వచ్చాయి. టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు పొందిన వాటిలో 1100 సంస్థలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉంటే, మరో 400సంస్థలు ప్రారంభించే దశలో ఉన్నాయి. సిక్ ఇండస్ట్రీలను ఆదుకునేందుకు ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్‌ను ప్రవేశపెట్టబోతున్నాం.
2018 నాటికి ఫార్మా సిటీ మొదటి దశ
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫార్మా సిటీ ప్రాజెక్టులో మొదటి దశను 2018నాటికి అమలులోకి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో రూ.75వేల కోట్ల పెట్టుబడులు వస్తుండగా, మూడు లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.