గటిక విజయ్ కుమార్
ప్రజాసంక్షేమం, అభివృద్ధి విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన విభాగంలో నూతన శకాన్ని ఆరంభించింది. భారతదేశంలో మరే రాష్ట్రం కూడా తలపెట్టని విధంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని భూ రికార్డులన్నంటినీ సమగ్రంగా ప్రక్షాళన చేసింది.
తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్య్రానికి పూర్వం… నిజాం కాలంలో 1932-34 మధ్య కాలంలో భూ సర్వే, సెటిల్మెంట్, బందోబస్తు నిర్వహించారు. అప్పుడే భూములకు సర్వే నెంబర్లు కేటాయించారు. ఏ భూమికి ఎవరు యజమానో తేల్చారు. దాని ఆధారంగానే 1954లో హైదరాబాద్ రాష్ట్రంలో కాస్రా పహాణీలు తయారు చేశారు. ఆ తర్వాత క్రమంగా భూ రికార్డుల నిర్వహణ నిర్లక్ష్యానికి గురైంది. భూముల అమ్మకం, కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేటు భూములను ప్రజోపయోగం కోసం ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ భూమిని పేదలకు పంచారు. వ్యక్తుల వద్ద ఉన్న భూమి సైతం తమ వారసులకు ఇచ్చారు. వారు మరొకరికి అమ్ముకున్నారు. మొత్తంగా భూమికి సంబంధించి అనేక మార్పులు జరిగాయి. జరిగిన మార్పులన్నీ వ్యక్తిగత స్థాయిలోనే నమోదవుతూ వస్తున్నాయి తప్ప ప్రభుత్వం వద్ద సరైన రికార్డులు లేవు. ఎప్పటికప్పుడు జరిగిన మార్పులు సరిగా నమోదు కాలేదు. దీంతో ఏ భూమికి ఎవరు యజమాని? ఏ సర్వే నెంబరులో ఎంత భూమి ఉంది? తదితర విషయాల్లో స్పష్టత కొరవడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా పోయింది. ఫలితంగా భూ యాజమాన్య హక్కుల విషయంలో వివాదాలు చెలరేగాయి. కోర్టు కేసులు అనివార్యమయ్యాయి. చివరికి భూ వివాదాలు శాంతి భద్రతల సమస్యలకు దారితీసే దుస్థితి వచ్చింది.
ఈ పరిస్థితిలో మార్పు తేవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంచుకు ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళనకు కార్యాచరణ రూపొందించారు.
వందరోజుల పాటు భూ రికార్డుల ప్రక్షాళన
2017 సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ మినహా ఇతర 30 జిల్లాల్లోని 568 మండలాల్లోని 10,823 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అధికారులే గ్రామాలకు వెళ్ళి సగటున పది రోజుల పాటు అక్కడే ఉండి గ్రామ సభలు నిర్వహించారు. రైతులు, ఇతర భూ యజమానులతో మాట్లాడారు. తమ వద్ద ఉన్న రికార్డులను అధికారులు గ్రామాల వారీగా బహిర్గతం చేశారు. అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. వారసుల విజ్ఞప్తులను పరిగణన లోకి తీసుకున్నారు. చివరికి రైతులు, ప్రజల ఆమోదంతో రికార్డులను వాస్తవ పరిస్థితుల ఆధారంగా, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి సరిచేశారు. కోర్టు కేసులు, ఇతర వివాదాలున్న భూములను పార్ట్ బి కింద చేపట్టాలని నిర్ణయించారు. పార్ట్ ఎ కింద అన్ని రకాల భూముల రికార్డులను సరిచేశారు. గ్రామం యూనిట్‌గా ఈ కార్యక్రమం జరిగింది. ఏ గ్రామంలో ఏ రైతు వద్ద ఎంత భూమి ఉంది? ప్రభుత్వ కార్యాలయాల కింద ఎంత భూమి ఉంది? ప్రజోపయోగం కోసం వినియోగించిన భూమి ఎంత? అటవీ భూమి ఎంత? వ్యవసాయ భూమి ఎంత? తదితర వివరాలపై స్పష్టత వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చింది. పార్ట్ బి ప్రక్షాళన కూడా త్వరలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మార్చి 11న కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతం కావడంతో 93 శాతం భూముల యాజమాన్యం విషయంలో ఇప్పుడు స్పష్టత వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 72,12,111 ఖాతాల కింద వ్యవసాయ భూములున్నట్లు తేలింది. ఈ ఖాతాల ఆధారంగా రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఈ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎవరు పడితే వారు దిద్దడానికి వీలులేకండా (ట్యాంపరింగ్ ఫ్రీ) పాస్ పుస్తకాల ముద్రణ జరిగింది. గతంలో పాస్ పుస్తకాల్లో 31 కాలమ్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని బాగా తగ్గించి ఏడు కాలమ్స్ కు కుదించారు. పాస్ పుస్తకాలు, పహాణీల్లో వాడే భాషను కూడా సరళతరం చేశారు. గతంలో ఇతర భాష పదాలు, అర్థంకాని పదాలుండేవి. ఇప్పుడు అందరికీ సులువుగా అర్థమయ్యే పదాలనే పొందుపరిచారు. గతంలో బ్యాంకులు రుణాలు ఇచ్చే సందర్భంలో పాస్ పుస్తకాలను కుదవ పెట్టుకునే వారు. కానీ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికింది. రైతుల పాస్ పుస్తకాలు రైతుల వద్ద మాత్రమే ఉండాలని, వాటిని కుదవ పెట్టుకునే హక్కు బ్యాంకులకు లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని బ్యాంకర్లకు కూడ తెలిపింది.
కోర్ బ్యాంకింగ్ తరహాలో ‘ధరణి’ నిర్వహణ
రాష్ట్రంలోని ప్రతీ ఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ, ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల వెబ్‌సైట్ ‘ధరణి’ని కోర్ బ్యాంకింగ్ తరహాలో నిర్వహించనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఐటి విభాగాన్ని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ వివరాలు, పేరు మార్పిడి వివరాలు అదే రోజు ఈ ధరణిలో నమోదు అవుతాయి.మండల కార్యాలయం నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల ఈ వెబ్ సైట్ నుంచి వివరాలు తీసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారు కూడా ధరణి ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపుకోవడానికి వీలవుతుంది.
ఎమ్మార్వోలకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు
రైతులు, ఇతర ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతీ మండల రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 584 మండలాలున్నాయి. ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిని యధావిధిగా కొనసాగిస్తారు. ఈ 141 సబ్ రిజిస్ట్రార్ల పరిధి వారి కార్యాలయమున్న మండలానికే పరిమితం అవుతుంది. మిగతా 443 చోట్ల ఎమ్మార్వోలకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగిస్తారు. ఎమ్మార్వోలు తామిచ్చిన అపాయింట్మెంట్ తేదీలకు అనుగుణంగా శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మార్వోలు హాజరుకాలేకపోతే, ఆ బాధ్యతలను డిప్యూటీ తహసిల్దార్లకు అప్పగిస్తారు.
పారదర్శకంగా, కాలయాపన లేకుండా రిజిస్ట్రేషన్లు
భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో వందకు వంద శాతం పారదర్శకత సాధించడం, అవినీతి నిరోధించడం, నకిలీ పాస్ పుస్తకాలను అరికట్టడం లాంటి లక్ష్యాలతో సంస్కరణలు తీసుకొచ్చారు. రైతులు, ఇతర ప్రజలు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పే విధంగా కొత్త విధానం తయారైంది. కేవలం ఒకే సారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. పాస్ పుస్తకం వారి ఇంటికే కొరియర్ ద్వారా చేరుతాయి. ఎవరి వద్దకూ వెళ్లకుండానే తమ పని ఒక్కరోజులో పూర్తవుతుంది. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని విధంగా రిజిస్ట్రేషన్ల విధానం ఉంటుంది. నూటికి నూరుశాతం పారదర్శకంగా పనులు జరుగుతాయి. నకిలీ పాసుపుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించడం ఇక సాధ్యం కాదు. నకిలీ పాసుపుస్తకాల ద్వారా రుణాలు పొంది ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడం వీలుకాదు. భూ రికార్డుల నిర్వహణను ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుంది. ప్రతీ విషయం ‘ధరణి’లో నమోదవుతుంది.
నూతన రిజిస్ట్రేషన్ విధానం
- అఅమ్మే వారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ను అపాయింట్మెంట్ టైమ్ అడగాలి. (పాస్ పోర్టులు, వాహన రిజిస్ట్రేషన్ల్ మాదిరిగా)
- భూమి అమ్మకానికి సంబంధించిన డాక్యుమెంటు తయారు చేయడానికి లైసెన్సుడు డాక్యుమెంటు రైటర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉంచుతారు. వారికి ఫీజు నిర్ధారించబడుతుంది. వారు రాసిన కాగితాలను అనుమతిస్తారు.
- అమ్మేవారు/కొనేవారు తామే స్వయంగా డాక్యుమెంటు రాసుకున్నా అనుమతిస్తారు. దీనికోసం వారికి సంబంధిత ఫారాలు/టెంప్లేట్స్ అందుబాటులో ఉంచుతారు.
- అపాయింట్మెంట్ ఇచ్చిన తేదీ/సమయానికి అమ్మేవారు, కొనేవారు ఇద్దరూ తమ పాసుపుస్తకాలతో సబ్ రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలి.
- బయోమెట్రిక్ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు తీసుకుంటారు.
- ఎంత భూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్ పుస్తకం నుంచి సబ్ రిజిస్ట్రార్ తొలగిస్తారు. అదే సమయంలో కొన్న వారి పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ముద్ర వేసి, సంతకం చేస్తారు.
- భూమిని కొత్తగా కొంటున్న వారయితే, కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. అందులో కొన్న భూమి వివరాలు నమోదు చేస్తారు.
- ఇద్దరి పాస్ పుస్తకాలను అదే రోజు అదే సమయంలో ఎమ్మార్వోకు పంపుతారు.
- సదరు భూమి యజమానిగా అమ్మిన వారి పేరు తొలగించి, కొన్న వారి పేరుపై మార్పిడి(మ్యుటేషన్) చేస్తారు.
- ఈ వివరాలను ఎమ్మార్వో కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు.
- ఎమ్మార్వో కార్యాలయంలోని ఐటి అధికారికి ఈ వివరాలు పంపాలి. ఐటి అధికారి ఆ వివరాలను వెబ్ సైట్ లో ఎంటర్ చేస్తారు.
- వెబ్ సైటులో నమోదైన వివరాలు కొన్న వారికి, అమ్మిన వారికి వెంటనే ఎస్.ఎం.ఎస్. పోతుంది. (బ్యాంకు లావాదేవీల మాదిరిగా)
- పాస్ పుస్తకాలను ఇప్పటి మాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్) బాధ్యత, అధికారి పూర్తిగా ఎమ్మార్వోదే.
- పేరు మార్పిడి(మ్యుటేషన్) జరిగిన తర్వాత ఎమ్మార్వో కార్యాలయం ముద్రవేసి, ఎమ్మార్వో సంతకం చేస్తారు. ఆ పాస్ పుస్తకాలను అదే రోజు తిరిగి సబ్ రిజిస్ట్రార్ కు పంపుతారు.
- ఎమ్మార్వో నుంచి తనకు అందిన పాస్ పుస్తకాలను సబ్ రిజిస్ట్రార్ కొరియర్ ద్వారా అమ్మిన వారికి, కొన్న వారికి పంపుతారు. కొన్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు పంపుతారు. (పాస్ పోర్టుల మాదిరిగా)
- సబ్ రిజిస్ట్రార్ కార్యాయంలో డిస్పాచ్ అయిన వెంటనే ఇద్దరికీ ఎస్.ఎం.ఎస్. వెళ్తుంది.
- రైతులకిచ్చే పాసుపుస్తకంలో రైతు ఫోటో, ఖాతా నంబరు, పాసు పాసుపుస్తకం యూనిక్ కోడు, గ్రామం కోడు, మండలం కోడు, యజమాని ఆధార్ నంబరు ఉంటాయి.
- గతంలో మాదిరగా తెలంగాణలో ఇకపై రెండు పాస్ పుస్తకాలుండవు. ఒకే ఒక్క పాస్ పుస్తకం ఉంటుంది.
విధి నిర్వహణ పట్ల ఇంతటి చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన ఉద్యోగులకు ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది విఎఓలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు మొత్తం 35,749 మంది ఉద్యోగులకు ఒక నెల మూల వేతనం అదనంగా అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. విధి నిర్వహణ పట్ల ఇంతటి చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన ఉద్యోగులుండడం తెలంగాణ ప్రజలు, రైతుల అదష్టంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. తెలంగాణ ప్రజలు, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు మనసారా కతజ్ఞతలు తెలిపారు
భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలు
తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం 1,12,077 చదరపు కిలోమీటర్లు
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం భూభాగం 2.80 కోట్ల ఎకరాలు
ఎలాంటి వివాదాలు లేని వ్యవసాయ భూమి 1.42 కోట్ల ఎకరాలు
కోర్టు కేసులు, వివాదాలు, చిక్కులు కలిగిన భూములు 17.89 లక్షల ఎకరాలు
రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూములు 11.95 లక్షల ఎకరాలు
చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వే లైన్లు, సబ్ స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింద భూములు, కోర్టు కేసుల్లోని అటవీభూములు: 84.00 లక్షల ఎకరాలు
నగరాలు, పట్టణాలు, గ్రామాల నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీభూమి: 24 లక్షల ఎకరాలు
పరిశీలించిన భూమి విస్తీర్ణం 2,56,70,814 ఎకరాలు
స్పష్టత వచ్చిన భూమి విస్తీర్ణం 2,39,81,994 ఎకరాలు (93 శాతం)
స్పష్టంగా తేలిన ఖాతాలు: 72,12,111 ఎకరాలు
55% స్పష్టత వచ్చిన భూమిలో వ్యవసాయ భూమి విస్తీర్ణం 1,43,15,767 ఎకరాలు
4.7% రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూమి విస్తీర్ణం 11,99,489 ఎకరాలు
5.4% ప్రభుత్వ ఆస్తులున్న భూమి విస్తీర్ణం 13,85,192 ఎకరాలు
7.8% అసైన్డ్ దారుల వద్ద ఉన్న ప్రభుత్వ భూమి 20,13,868 ఎకరాలు
2.8% ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి 7,12,264 ఎకరాలు
16.3% అటవీ భూములు 42,35,682 ఎకరాలు
0.3% దేవాదాయ భూములు 74,155 ఎకరాలు
0.2% వక్ఫ్‌భూములు 45,570 ఎకరాలు
7% స్పష్టత రాని భూమి విస్తీర్ణం 16,88,976
0.4% సివిల్ కోర్టు వివాదాల్లో ఉన్న భూమి: 1,11,196 ఎకరాల
0.2% రెవెన్యూ కోర్టు వివాదాల్లో ఉన్న భూమి: 42,318 ఎకరాలు
0.9% అటవీ, రెవెన్యూ హద్దు వివాదాల్లోని భూమి 2,04,729 ఎకరాలు
0.9% అసైన్డ్ ల్యాండ్ వివాదాలు 2,41,749 ఎకరాలు
0.6% శివాయి జమేదార్ భూములు 1,63,264 ఎకరాలు
1.0% సాదా బైనామా వివాదాలు, అభ్యంతరాలు 2,45,974 ఎకరాలు
0.4% ఎల్.టి.ఆర్. కేసులు 95,214 ఎకరాలు
1.6%కుటుంబం, కాస్తు, సరిహద్దు, రద్దు బదిలీ వివాదాలు 2,73,843 ఎకరాలు
1.6% వక్ఫ్ డెడ్ ఖాతాలు, భూదాన్, సీలింగ్ తదితర వివాదాలు: 3,10,684 ఎకరాలు