మంచితనం, మానవత్వం, విద్య మనిషకి ఆభరణాలంటారు . ఈ గొప్ప సుగుణాలే మనిషిని మనిషిగా బతికిస్తాయి. ఉన్నతంగా ఆలోచించడం, సంస్కారవంతం గా జీవించడం, పరిపూర్ణ విలువలతో బతకడం నేర్పిస్తాయి. కానీ నేడు, మానవత్వం ఎన్ని వందల మైళ్ళు నడక సాగిస్తేనో కానీ దాని సువాసనలు కొద్దో గొప్పో మన హృదయాన్ని తాకుతున్నాయి.
మనిషి ఎటువైపు పయనిస్తున్నాడు? మానవీయ విలువలు నేర్పని విద్య దేనికోసం? పౌరున్ని పౌరునిగా నిలబెట్టలేని ఆధునిక సాంకేతిక ప్రగతి ఎందుకు? సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అనే ధర్మ బద్ధమైన ప్రశ్నలతో ధర్మాగ్రహాన్ని, ఆవేదననీ ప్రతి ఫలిస్తుందీ ‘మానవీయ ఉపాధ్యాయుడు’ పుస్తకం.
డా|| శివార్చక విజయకుమార్ తనదైన శైలిలో రాసని ఈ పుస్తకం ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, వారి ఆలోచనా సరళిని స్పష్టంగా తెలియజేస్తుంది. జాతి ప్రగతి నిర్దేశకులుగా నిండనై మానవత్వాన్ని పెంపొందించు కోవాలంటుంది.
ప్రముఖ ధర్మ ప్రవక్తల మాటలు, విద్యార్థుల స్పందనలు సంక్షిప్తంగా అందించడం బావుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని, వారి సామాజిక స్థితిగతుల్ని, ఆర్ధిక పరిస్థితుల్ని పట్టికలు, గ్రాపులు రూపంలో ఇవ్వడం, అవసరమైన చోట చిత్రాలు గీయించడం పాఠకులకి ఆసక్తిని కలిగించే విషయం.
ఈ పుస్తకంలో.. ఆరు అధ్యాయాలున్నాయి. ఇందులోని అంశాలన్నీ ఉపాధ్యాయులు అవలోకనం చేసుకోవాల్సినవే.
‘గొప్ప వాళ్ళకి, మహనీయులకు, మహాత్ములకు వ్యకగ్తిత జీవితాలు ఉండవు. వారి జీవితాలన్నీ మానవ కళ్యాణానికి, సమాజ శ్రేయస్సుకు అంకతిమవుతాయి. ఆహుతి కాబడతాయి’ అనే ఇతిహాసపు సత్యాన్ని ఆధునిక సమాజం తెలుసుకోవాలి. మానవీయ ఉపాధ్యాయులు ఈ కోవలోకే వస్తారు అని చెప్పడానికి శివార్చక విజయకుమార్ చేసిన ప్రయత్నం సీరియస్ గానే కనిపిస్తుంది. ప్రతి ఉపాధ్యాయుడు గర్వంగా తన చేతిలో ఉంచుకోవాల్సిన కరదీపిక. హృదయంలో దాచుకోవాల్సిన విషయ సంపద ఇది.
– డా|| గన్నవరం వెంకటేశ్వర్లు