మిషన్ భగీరథతో తెలంగాణ సరికొత్త రికార్డు
2017 డిసెంబర్ నాటికి ప్రతీ గ్రామానికీ మంచినీళ్లు
ప్రతీ ఇంటికి నల్లా ద్వారా కృష్ణా, గోదావరి జలాలు
ప్రతీ ఇంటికి నల్లా ద్వారా ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందివ్వాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ పథకం’ అనుకున్న వేగంతో పూర్తవుతున్నది. డిసెంబర్ 2017 నాటికి అన్ని గ్రామాలకు నదీ జలాలు చేరే విధంగా కార్యచరణ అమలవుతున్నది. ఆపై ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా గోదావరి, కృష్ణా జలాలు అందుతాయి. రాష్ట్రంలోని 24,248 గ్రామీణ ఆవాస ప్రాంతాల్లోని 52,18,225 కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు లభ్యమవుతుంది. 65 మున్సిపాలిటీల్లోని 12.52 లక్షల కుటుంబాలకు, ఓఆర్‌ఆర్ లోపల ఉన్న గ్రామాలకు ఇదే పథకం ద్వారా మంచినీరు లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి ప్రతీ రోజు వందలీటర్ల నీరు, మున్సిపాలిటీల్లో ప్రతీ రోజు 135 లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 లీటర్ల నీరు అందిస్తారు.
2015 జూన్ 8న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నల్గొండ జిల్లా చౌటుప్పల్ (ప్రస్తుత యాదాద్రి జిల్లా)లో ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. 2016 ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్ (ప్రస్తుత సిద్ధిపేట జిల్లా)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటి దశకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగు తున్నాయి. మిషన్ భగీరథ పథకానికి ప్రారంభంలోనే హడ్కో అవార్డు లభించింది. నీతి ఆయోగ్ కూడా ఈ పథకాన్ని ప్రశంసించింది. మిగతా రాష్ట్రాలు కూడా ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడానికి ఇలాంటి పథకాలు రూపొందించాలని సూచించింది. రాష్ట్ర బడ్జెట్ పై భారం పడకుండానే వివిధ ఆర్థిక సంస్థలు మిషన్ భగీరథ కోసం ఆర్థిక సహకారం అందిస్తున్నాయి.
ఎందుకీ పథకం?
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అయితే ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొంది ఎదగాల్సిన ప్రజలు ప్రధానంగా రెండు కారణాల వల్ల జబ్బున పడి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దీర్ఘకాలిక రోగాలకు గురవుతున్నారు. దానిలో ఒకటి గుడుంబా, నాటుసారా అలవాటు. గుడుంబాకు అలవాటైన వారు తక్కువ వయసులోనే చనిపోయి కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. మరో కారణం సరైన మంచినీరు అందుబాటులో లేకపోవడం. మంచినీరు లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఫ్లోరైడ్ బారిన పడి కాళ్లు చేతులు పనిచేయలేని స్థితికి చేరుకుంటున్నారు. ఈ రెండు విషయాల్లో గట్టి కృషి జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఓవైపు గుడుంబా నివారణకు కఠిన చర్యలు తీసుకున్నారు. మరోవైపు ప్రజలందరికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ పథకం చేపట్టారు.
ఏమిటీ పథకం ?
తెలంగాణ రాష్ట్రానికి కుడి ఎడమన కృష్ణా, గోదావరి నదులున్నప్పటికీ భూగర్భ జలాలపై ఆధారపడే ఇప్పటి వరకు మంచినీటి పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారు. దీని వల్ల రెండు రకాల ఇబ్బందులున్నాయి. వేసవిలోనూ, వర్షాభావ పరిస్థితులున్నప్పుడూ భూగర్భ జలమట్టం పడిపోతుంది. స్థానిక వాగులు, వంకలు, చెరువులు కూడా ఎండిపోతాయి. అప్పుడు గ్రామాల్లో నీటికి కటకట ఏర్పడుతుంది. మంచినీటి పథకాలున్నప్పటికీ సుక్క నీరు రాని దుస్థితి నెలకొంటున్నది. ఇక మరో ఇబ్బంది భూగర్భజలాలు కలుషితం కావడం. భూగర్భజలాలకన్నా ఉపరితల జలమే మంచినీటికి శ్రేయస్కరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మొదలుకుని అన్ని సంస్థలు తేల్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలకు సురక్షిత మంచినీరు ఇవ్వడం కోసం గోదావరి, కృష్ణ నీళ్లనే ప్రతీ ఇంటికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఉపరితల జలాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. కరువు కాటకాలు ఏర్పడినా మంచినీటికి ఢోకా ఉండదు. సాగునీటి ప్రాజెక్టుల్లో పదిశాతం నీటిని మిషన్ భగీరథ పథకం కోసం రిజర్వు చేశారు. అంటే ప్రతీ రిజర్వాయరు, డ్యాములో ఖచ్చితంగా డెడ్ స్టోరేజి మెయిన్టెయిన్ చేయాలి. దీనివల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులుంటే కూడా మంచినీటి సరఫరాకు అంతరాయం కలగదు.
బృహత్తర పథకం
మిషన్ భగీరథ పథకం దేశంలోనే అతి పెద్ద మంచినీటి పథకంగా పేరొందింది. రూ.43,791 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 24,248 ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంచినీరు అందిస్తుంది. మిషన్ భగీరథ పథకం ద్వారానే రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రైల్వే స్టేషన్లు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, విమానాశ్రయం, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర సంస్థలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. మొత్తం లక్షా 600 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు వాడుతున్నారు. గోదావరి, కష్ణా నదుల నుంచి 42.67 టిఎంసిల నీటిని తోడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 19 ప్రాంతాలను ఎంపిక చేశారు. అక్కడ ఇన్‌టేక్ వెల్స్ నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి నీటిని తోడి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని గ్రామాలకు అందివ్వడం కోసం సంపులు, వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 407 సంపులు, 147 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ (జి.ఎల్.బి.ఆర్.) 579 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ (ఓ.హెచ్.బి.ఆర్.) లు, గ్రామాల్లో 18,276 ఓవర్ హెడ్ స్టోరేజి రిజర్వాయర్స్ (ఓ.హెచ్.ఎస్.ఆర్.) నిర్మిస్తున్నారు. వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 52,18,225 ఇండ్లకు నల్లాలు బిగించి సురక్షిత మైన మంచినీరు సరఫరా చేస్తారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ కోసం ప్రత్యేక విద్యుత్ సరఫరా వ్యవస్థను కూడా రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం 220 కెవి సబ్ స్టేషన్లు 2, ఒక 132 కెవి సబ్ స్టేషన్, 33 కెవి సబ్ స్టేషన్లు 48, 11 కెవి సబ్ స్టేషన్లు 106 నిర్మిస్తున్నారు. ఈ సబ్ స్టేషన్ల నుంచి నేరుగా ఇన్ టేక్‌వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేక లైన్లు కూడా వేస్తున్నారు. వీటి నిర్మాణం కూడా 2017 డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యే విధంగా కార్యాచరణ అమలవుతున్నది. ఇప్పటికే అమల్లో ఉన్న మంచినీటి పథకాలన్నింటినీ మిషన్ భగీరథలో భాగం చేస్తారు.
మిషన్ భగీరథ మంచినీటి పథకం
ఇన్ టేక్ వెల్స్ 19
అవసరమయ్యే నీరు 42.67 టిఎంసిలు
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 50
సంపులు 407
జి.ఎల్.బి.ఆర్.లు 147
ఓ.హెచ్.బి.ఆర్.లు 579
ఓ.హెచ్.ఎస్.ఆర్.లు 18,276
విద్యుత్ సబ్ స్టేషన్లు 157
ఆవాస ప్రాంతాలు 24,248
కుటుంబాలు (గ్రామీణ ప్రాంతాలు) 52,18,225
మున్సిపాలిటీలు కుటుంబాలు 65- 12.52 లక్షలు
పైపులైన్లు 1,00,600 కిలోమీటర్లు
వ్యయం రూ.43,791 కోట్లు
గటిక విజయ్‌కుమార్