ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు గత నెలలో వెళ్ళాను. అదేమిటంటే, ఉపాధి పొందేందుకు కావసిన నైపుణ్యాల గురించి శిక్షణ. ఆ సందర్భంగా కొందరు విద్యార్ధులు అడిగిన ప్రశ్నలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మన విద్యా సంస్థలలో విద్యార్థులకు నేర్పుతున్న విద్య ఇదేనా అని కొంత బాధ కలిగింది.
‘‘కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి సార్? నేను ఇంగ్లీషు బాగా మాట్లాడుతాను. కానీ, ప్రతి ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని నన్ను ఆ ఉద్యోగానికి ఎంపిక చేయటం లేదు.’’
మరో విద్యార్థి.. ‘‘అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఏంటిసార్?’’
‘‘టీమ్ వర్క్ అంటే ఏంటిసార్? అదిలేదని నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు.’’
మరో విద్యార్థి ఆవేదన.
ఇలా చాలామంది విద్యార్థులు నాపై ప్రశ్నల వర్షం కురిపించారు.
పై వన్నీ ఆచరణలో ఎదురయ్యే సమస్యలు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగం కావాలంటే మంచి మార్కులు వస్తే చాలనుకుంటారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐ.ఐ.టి వంటి సంస్థలలో చదివిన విద్యార్థులకు కూడా ఈ విషయాలు తెలియకపోవడం విచారకరం.
ఇన్పోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి ఒకసారి ఏమన్నారంటే, ‘‘ఐ.ఐ.టి లో చదువుతున్న విద్యార్థుల్లో కూడా 80 శాతం మంది మంచి ప్రావీణ్యంతో పనిచేయలేకపోతున్నారు. ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు వారిలో వుండటం లేదు. వారు ఉద్యోగ నిర్వహణలో వెనుకబడుతున్నారు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ విషయంపైన దృష్టి సారిస్తున్నాయి.
ఉపాధి పొందేందుకు కావసిన నైపుణ్యాలు నేటి యువతలో చాలా తక్కువగా ఉన్నమాట నిజం. అసలు నైపుణ్యాలు అంటే ఏమిటో, వాటిని ఎలా సాధించవచ్చో ముందుగా తెలుసుకుందాం. ఉద్యోగార్థులకు మంచి మార్కులతోపాటు కావసిన ప్రధాన నైపుణ్యాలు 1) భావ వ్యక్తీకరణ నైపుణ్యం (కమ్యూనికేషన్ స్కిల్స్) . 2) కలసి పనిచేయగలగటం (టీమ్ వర్క్). 3) సమస్య పరిష్కారం చేసే నైపుణ్యం (ప్రాబ్లం సాల్వింగ్). 4) చొరవ. 5) ఎంటర్ ప్రెన్యూర్ స్కిల్. 6) ప్రణాళిక, నిర్వహణ (ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్). 7) స్వయం నిర్వహణ. 8) నేర్చుకోవడం. 9) సాంకేతిక పరిజ్ఞానం.
పై నైపుణ్యాలను ‘స్కిల్స్’ అంటాం. ఈ నైపుణ్యాలు వున్నవారు ఏ సంస్థలోనైనా రాణిస్తారు. ఎలాంటి పనినైనా సులువుగా సాధించగలుగుతారు. ఆఫీసుల్లో కష్టపడి పని చేసేవారికి, రోజూ పనికి ఉత్సాహంగా వెళ్లే వారిలో ఈ నైపుణ్యాలు బాగా ఉన్నట్టు లెక్క. అవి లేనివారు ‘ఎందుకొచ్చిందిరా దేవుడా’ అనుకుంటూ పనిని తిట్టుకుంటూనే ఉంటారు. అసలు ఆఫీసుకు వెళ్ళాలంటేనే వీరు భయపడతారు. ఎప్పుడూ ఆఫీసును, పై అధికారిని, తోటి ఉద్యోగులను ఎదో ఒక వంకతో విమర్శిస్తూనే వుంటారు. ఎప్పుడూ చాలా వత్తిడికి గురవు తుంటారు. చివరికి ఉద్యోగమేకాదు, ఆరోగ్యం కూడా చెడిపోతుంది.
ఉద్యోగంలో మంచి స్థాయిలో స్థిరపడాలంటే తప్పకుండా పై నైపుణ్యాలు నేర్చుకొని ఉండాలి. అంతేకాదు, వాటిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం.’ కృషి చేస్తే ఇవి అందరికీ సాధ్యపడే విషయాలే. అసాధ్యమంటూ ఏదీ లేదు. సాధనతోనే అంతా సాధ్యమని విశ్వసించాలి.
ఇక ఒక్కో నైపుణ్యం గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.
1) భావ ప్రకటనా నైపుణ్యం (కమ్యూనికేషన్ స్కిల్స్)
కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంగ్లీషులో బాగా మాట్లాడగలగటం, బాగా రాయ గలగటం అని. కానీ, ఇది భాషకు సంబంధించిన నైపుణ్యం కాదు. అలా వుంటే దానిని భాషాపరమైన నైపుణ్యం అంటారు. మేధావుల పరిశోధన ప్రకారం, ఏ వ్యక్తిలోనైనా శారీరక హావభావాలు (బాడీలాంగ్వేజ్) (55శాతం), మాట్లాడే తీరు (వాయిస్ మాడ్యులేషన్) (38 శాతం), మాట తీరు (వెర్బల్) (7 శాతం) ఉంటే , అతను మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉన్నాడని భావిస్తారు. చదువుకున్న యువతీ,యువకులు, చదువుకుంటున్న విద్యార్ధులపై ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా తమలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగేలా నేర్చుకోవాలి. లేదా శిక్షణ పొందాలి. అప్పుడు మనం వ్యక్తం చేసే భావం అవతలి వ్యక్తికి తేలికగా తెలిసిపోతుంది. మనం ఎంత చెప్పాం?, ఏమి చెప్పాం? అనేదానికన్నా, అవతలి వాళ్ళకి అర్థమైంది ఏమిటి? అనేది ముఖ్యం. అలాగే, మనం చెప్పినదానికి అవతలివ్యక్తి ఎలా ప్రతిస్పందించాడన్నది ముఖ్యం. దానిని బట్టి మన నైపుణ్యం ఎంతో బేరీజు వేసుకోవచ్చు.
ఈ నైపుణ్యాలతోపాటు, ఇంగ్లీషు భాషపై మంచిపట్టు వుండటం అదనపు లాభం క్రిందికి వస్తుంది. ఇంగ్లీషు ఎందుకు ప్రామాణికంగా మారిందంటే, సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రపంచానికి సంబంధించింది. అది అనునిత్యం కొత్తకొత్తగా రూపుదిద్దుకుంటూ వుంటుంది. కాబట్టి, అవసరమైతే ప్రపంచంలో ఏ వ్యక్తితోనైనా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల మనం ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఏ స్థాయిలో వున్నవారైనా ఇంగ్లీషుపై పట్టు సాధిస్తే భవిష్యత్తు బాగుంటుంది. మనం చెప్పాలనుకుంటున్న విషయం గురించి తెలుసుకోవడం, దానిని ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం.
2) ఇతరులతో కలిసి పనిచేయడం (టీమ్ వర్క్)
టీమ్ వర్క్ అంటే, అందరూ కలసి పనిచేయడం అనుకుంటారు. అది నిజమే. కానీ, అదొక్కటే కాదు. దానితోపాటు టీమ్‌లో వున్న ప్రతి ఒక్కరి బలాలు (స్ట్రెన్త్) మాత్రమే ఉపయోగంలోకి తెచ్చి, బలహీనతలను మరుగున పరిచే ఒక మహత్తర పరిస్థితి ఇది. దీనివల్ల గెలుపు నిరంతరం సాగుతూనే వుంటుంది. గ్రూప్ లోని అందరి మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
పరస్పరం ఎదుగుదలకు దోహదపడుతుంది. ఒక సినిమా విజయవంతమైతే, అందులో ప్రతివ్యక్తి ఇతరులను అభినందిస్తుంటారు. అది ఎలా అంటే, దర్శకుడు హీరోని అభినందిస్తాడు. ఆ హీరో నటన వల్లే చిత్రం విజయవంతం అయిందంటాడు. హీరో హీరోయిన్‌ను పొగుడుతాడు. హీరోయిన్ తనదేమీ లేదని అంతా నిర్మాత గొప్పదనమేనని అభినందిస్తుంది. ఇక, నిర్మాత అందరినీ అభినందిస్తాడు.
అలా ఒక టీమ్ వర్క్ చేస్తే, అది ఎంతో సానుకూల బంధాలను ఏర్పరుస్తుంది. అందులో ఇమిడిపోయి, అందరిలో కలసిపోయి, తానూ ఒక చెయిన్ లింకులాగా వుండగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదే టీమ్ వర్క్ నైపుణ్యం. దీనిని చదువుకొనే రోజుల్లో కాలేజీల్లో జరిగే కార్యక్రమాల్లో కానీ, కుటుంబంలో జరిగే శుభకార్యాలలో పాల్గొనడం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటి నలుగురితో కలసి పనిచేస్తే ఈ సామర్థ్యం పెరుగుతుంది. ఇలా మిగతా నైపుణ్యాత గురించి తరువాత సంచికలో తెలుసుకుందాం.