ఐస్ స్కేటింగ్ మన రాష్ట్రంలో చేయడం సాధ్యమా? అంటే ఎవ్వరైనా కాదు అని చెపుతారు. ఐస్ స్కేటింగ్ చేయాలంటే మంచుతో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే సాధ్యం. కాని మన రాష్ట్ర విద్యార్థులు ఐస్ స్కేటింగ్‌లో ఓవరాల్ ఛాంపియన్లుగా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఎప్పుడూ మంచులో ఉండే రాష్ట్ర క్రీడాకారులతో సైతం పోటీ పడి విజేతగా నిలిచారు.
2015 డిసెంబర్ 31 నుంచి జనవరి 1,2 తేదీలలో జమ్ము కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో జరిగిన 12వ జాతీయ ఐస్‌స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో 33 పతకాలను కైవసంచేసుకొని తమ సత్తా చాటారు.
33 పతకాలు :
మన రాష్ట్రం నుంచి 18 మందితో కూడిన స్కేటింగ్ బందం మొత్తం 33 పతకాలను కొల్లగొట్టింది. ఇందులో 19 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్య పతకాలున్నాయి. జుహిత్ చలంచర్ల 4 స్వర్ణపతకాలు, కోణంకి వంశిక చౌదరి 3 స్వర్ణాలు, ఓ రజతం, దుండిగల్ల వేద 2 స్వర్ణాలు, వీరబెల్లి అన్విత 2 స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం సాధించారు. రుద్రంగి లలిత ఓ స్వర్ణం, కాంస్యం, సాయివేదాంత 3 స్వర్ణాలు, రజతం, అర్నవ్ శీల్‌వంత్ స్వర్ణం, రజతం, ఓంకార్ రుద్రంగి ఓ స్వర్ణం, కాంస్యం, అరుణిమ వీరబెల్లి 2 స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం, సాయిశ్రీ శ్వేత 3 పసిడి, రజతం, హర్షిత 2 స్వర్ణాలు, క్రిష్ణసాయి రాహుల్ 2 స్వర్ణాలు, 2 రజతాలు, వెంకట హర్షసుహిత్ 3 స్వర్ణాలు, రజతం, తిరువల్లం అనన్యమూర్తి 3 స్వర్ణాలు, రజతం, సాయిప్రణీత్ 2 స్వర్ణాలు, 2 రజతాలు, వడ్ల సుజన్ స్వర్ణం, ఓ కాంస్యం, అకునూర్ కీర్తన 3 స్వర్ణాలు, రజతం, అనూప్‌కుమార్ యామ ఓ స్వర్ణం, అల్ట్రిన్ మాథ్యూ 3 స్వర్ణాలు, రజత పతకాలను సాధించారు.
షాబాద్ రాళ్లపై శిక్షణ:
ఐస్‌స్కేటింగ్‌లో ఓవరాల్ విజేతగా నిలవడం వెనుక కఠోర శ్రమ దాగి ఉంది. మన రాష్ట్రంలో ఐస్ ఫ్లాట్‌ఫామ్ లేకపోవడంతో టోర్నీ కోసం షాబాద్ రాళ్లతో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌పై శిక్షణ తీసుకున్నారు. అర్జున అవార్డు గ్రహీత, మన రాష్ట్ర స్టార్ స్కేటర్ అనూప్‌కుమార్ యామ తన సొంత ఇంటిలో షాబాద్ రాళ్లతో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌పై 18 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చాడు. స్కేటింగ్‌కు అనుకూలంగా ఉండేలా షాబాద్ రాళ్లను పాలిషింగ్ చేయించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించాలనే అకుంఠిత దీక్షకు, అనూప్ శిక్షణ తోడైంది. సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో గంటల తరబడి శిక్షణ తీసుకుని మైనస్ 12 డిగ్రీల అతిశీతల ప్రాంతంలో, సముద్ర మట్టానికి 8500 అడుగుల ఎత్తులో ప్రతిభ చాటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.