భారతదేశ చట్టసభల్లోకెల్లా స్పీకర్, ఛైర్మన్ పదవులు మహోన్నతమైనవని రాష్ట్ర శాసన మండలికి ఛైర్మన్‌గా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పరిషత్ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ శాసన మండలిలో ప్రకటించారు. వెంటనే, రోడ్లు , భవనాలు, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి టి.హరీష్ రావు, తదితర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు కలసి గుత్తాను వెంటపెట్టుకొని వెళ్ళి అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ, పెద్దల సభ ఎంతోహుందాగా ఉంటుందని, సభను సజావుగా నడపడానికి శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. అంతకు ముందు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు ప్రసంగిస్తూ, రైతు జీవితాలు బాగుపడాలని గుత్తాచేసిన కృషిని కొనియాడారు. గ్రామ వార్డు మెంబరు స్థాయి నుంచి 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో గుత్తా ఎన్నోపదవులు అధిరోహించారని, ఎంతో అనుభవంగల నాయకుడని పేర్కొన్నారు.