ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ నరసింహన్ ఫిబ్రవరి 19న ఉదయం 11.30 గంటలకు 10 మంది కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. శాసనసభ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో గత డిసెంబరు 13న ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు, ఆయన మంత్రివర్గ సహచరునిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్ అలీకి అప్పట్లో హోమ్ శాఖ కేటాయించారు. తిరిగి ఇప్పుడు కొత్తగా 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం సంఖ్య 12కి చేరుకుంది. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస గౌడ్, చామకూర మల్లారెడ్డి ఉన్నారు.
రాజ్ భవన్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, కౌన్సిల్ ఛైర్మన్ స్వామిగౌడ్‌లతోపాటు పలువురు శాసన సభ్యులు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వివిధ శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కొత్త మంత్రులు:శాఖలు
ఈటల రాజేందర్: వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలు
వేముల ప్రశాత్ రెడ్డి: శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాలు, రవాణా, గృహనిర్మాణం
అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి : దేవాదాయ, ధర్మాదాయ శాఖ, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, న్యాయశాఖలు
జి.జగదీశ్ రెడ్డి : విద్యాశాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా
తలసాని శ్రీనివాస యాదవ్ : పశుసంవర్ధక శాఖ, మత్స్య, డెయిరీ డెవలప్ మెంట్, సినిమాటోగ్రఫీ శాఖలు
వి.శ్రీనివాస గౌడ్ : ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం, సంస్క తి, ఆర్కియాలజీ శాఖలు
కొప్పుల ఈశ్వర్ : ఎస్సీ డెవలప్ మెంట్, గిరిజన, బీసి, మైనారిటీ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖలు
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి : వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
చామకూర మల్లా రెడ్డి : కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్ మెంట్ శాఖలు