magaముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి చర్చించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పలు ఆర్డినెన్సులను మంత్రివర్గం ఆమోదించింది. పంచాయితీ రాజ్‌ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రామ పంచాయితీ ఎన్నికలు, కొత్త పంచాయితీ రాజ్‌ చట్టం, తండాలను గ్రామ పంచాయితీలు చేయడం, శివారు పల్లెలకు ప్రత్యేక గ్రామపంచాయితీ హోదా కల్పించడం, గ్రామాలకు దండిగా నిధులిచ్చి వాటిని అభివృద్ధి చేయడం, గ్రామ పంచాయితీలకు నిధులు సమకూర్చడం, వాటికి విధులు నిర్దేశించడం తదితర అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. అందరు మంత్రులు, సీనియర్‌ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు.

గ్రామ పంచాయితీలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించే విధంగా కొత్త చట్టం రూపొందిచాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. రాజ్యాంగం చెప్పిన విధంగా నిర్ణీత గడువులోగానే గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్తగా ఎన్నికయిన పంచాయితీలు కొత్త చట్టానికి లోబడి పనిచేస్తాయి. పరిపాలనా రంగంలో విశేష అనుభవం గడించిన అధికారులు, న్యాయ కోవిదులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని మంత్రివర్గం ముఖ్యమంత్రికి అప్పగించింది. గిరిజన తండాలను, కోయ గూడేలను, గోండు గూడేలను, చెంచు పల్లెలను గ్రామ పంచాయితీలుగా మార్చాలని, ప్రధాన గ్రామానికి దూరంగా ఉండి గ్రామ పంచాయితీగా లేని పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా మార్చాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సిఎం చెప్పారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పడు వ్యవహరించినట్లుగానే కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఉదారంగానే ఉండాలని మంత్రివర్గం నిర్ణయంచింది. కొత్తగా తెచ్చే పంచాయితీరాజ్‌ చట్టం విప్లవాత్మకంగా ఉంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయితీ చట్టం తెచ్చిన తర్వాత ప్రజలకు బాగా సేవలందించే విధంగా మున్సిపాలిటీలను మార్చడానికి కొత్త మున్సిపల్‌ చట్టం కూడా తేవాలని సిఎం ప్రతిపాదించారు. కొత్త పంచాయితీ రాజ్‌ చట్టం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని సిఎం ఆకాంక్షించారు.

గ్రామ పంచాయితీలకు నిధులిచ్చే విషయంలో కూడా కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించారు.

1. రాష్ట్ర బడ్జెట్లో పంచాయితీలకు నిధులకు కేటాయిస్తారు. గ్రామ జనాభాను బట్టి ఏ గ్రామానికి ఎంత అని నిర్ధారిస్తారు.

2. నరేగా (పనికి ఆహార పథకం) లాంటి కేంద్ర పథకాల ద్వారా కూడా గ్రామాలకు నిధులు సమకూరుతాయి.

3. గ్రామ పంచాయితీకి పన్నుల ద్వారా నిధులు వస్తాయి.

4. ఫైనాన్స్‌ కమీషన్‌ ద్వారా నిధులు వస్తాయి.

5. శ్రమదానం ద్వారా కొన్ని పనులు చేసుకోవాలి.

6. విరాళాల ద్వారా నిధులు సమకూర్చే కార్యక్రమానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.

7. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు సమకూరుతాయి.

ఇలా సమకూరిన డబ్బులతో గ్రామాలను పూర్తి స్థాయి లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ పంచాయితీలకు నిధులతో పాటు వారు నిర్వహించే విధుల విషయంలోకూడా స్పష్టత వస్తుందని, విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయితీలపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండే విధంగా చట్టంలో నిబంధనలు పొందు పరిచి, అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని సిఎం ప్రతిపా దించారు. దీనిని మంత్రి వర్గ సభ్యులు ఆమోదించారు

Other Updates