అమెరికాకు చెందిన 6 రాష్ట్రాల ప్రతినిధుల బృందం నవంబరు 15న పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును సచివాలయంలో కలిసింది. డెలవారె రాష్ట్ర గవర్నర్ జాక్ మార్కెల్ నాయకత్వంలో వచ్చిన ఈ ప్రతినిధి బృందం తెలంగాణలోని వ్యాపార, పెట్టుబడి అవకాశాలను చర్చించింది. కొత్త రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్నమైన ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. పారిశ్రామిక పాలసీలోని విశిష్టమైన అవకాశాలను వివరించారు. తాజాగా ప్రపంచ బ్యాంకు, కేంద్రం ఇచ్చిన ర్యాకింగుల్లో మొదటి స్థానం దక్కడం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు నిదర్శనంగా తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం 14 రంగాలను ప్రాధాన్యత ఉన్న అంశాలుగా పెట్టుకుని ముందుకు పొతున్నదన్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో టాప్ 4 పెద్ద సాప్ట్ వేర్ కంపెనీలు హైదారాబాద్‌ను తమ కేంద్రంగా ఎంచుకున్నాయని, ప్రాజెక్టులు పూర్తయితే 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. అమెరికా పెట్టబడుల కోసం చేపట్టిన పర్యటనల సందర్భంగా అక్కడి పరిశ్రమల నుంచి వచ్చిన స్పందనను తెలిపారు. ఫార్మ, బయో సైన్సెస్, ఏరో స్పెస్ రంగాల్లో పెట్టుబడులకు పలు హమీలు వచ్చాయని తెలిపారు. అమెరికాలో ఏర్పాటు చేయనున్న స్టేట్ డెస్క్ ఏర్పాటు, టి బ్రిడ్జి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ టి బ్రిడ్జి ద్వారా ఇన్నోవేషన్ రంగంలో రెండు ప్రాంతాల మధ్య వారధి ఏర్పడుతున్నదని, స్టార్ట్ అప్స్ విస్తరణ, ఫండింగ్ వంటి అవకాశాలను మెరుగుపరుస్తుందన్నారు.
రెండున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ చేపట్టిన పారదర్శక విధానాలను తెలుసుకున్న ప్రతినిధి బృందం వాటిని అభినందించింది. తెలంగాణతో నైపుణ్య శిక్షణ రంగంలో కలిసి పనిచేసేందుకు పలు రాష్ట్రాల ప్రతినిధులు ఆసక్తి చూపించారు. జర్మనీతో డెలవారె రాష్ట్రం సైతం టి బ్రిడ్జిలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రికి గవర్నర్ వివరించారు. తెలంగాణతో అమెరికన్ రాష్ట్రాలు సబ్ నేషనల్ ఒప్పందాలు చేసుకునే అంశాలను పరిశీలస్తామన్నారు. పురపాలక శాఖ మంత్రి కూడా అయిన కేటీ రామారావు నగరాలు, పట్టణాల మౌలిక వసతుల కల్పనకు తీసుకుంటున్న చర్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ రంగంలో పెట్టుబడులు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నదని, ఈ విషయంలో అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని మంత్రి తెలిపారు. సమావేశానంతరం మంత్రి ప్రతినిధులను సన్మానించారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌లు పాల్గొన్నారు.