సోషలిస్టు సిద్ధాంతాలపై అచంచల విశ్వాసంగల మధుదండావతే మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. తరువాత ఆచార్య నరేంద్రదేవ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చి కాంగ్రెస్-సోషలిస్టు పార్టీ స్థాపకుల్లో ఒకరయ్యారు. ఎంతమంది పార్టీ ఫిరాయించినా ఆయన మాత్రం వెనుదిరిగి చూడలేదు. పార్లమెంటులో ప్రతిపక్ష బెంచీలలోనే కూర్చుంటూ తన నిర్మాణాత్మకమైన సూచనలతో, విమర్శలతో సభలకు వన్నె తెచ్చారు.
నాలుగు వందలమంది సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా వెలిగి పోతున్న రోజులలోనే లోక్‌సభలో బోఫోర్స్ వ్యవహారంలోని కీలకమైన అనేక గుట్టులను బయటపెట్టి మధుదండావతే సంచలనం సృష్టించారు. ఆయన వాగ్ధాటికి తట్టుకోలేని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ మరేమీ తోచక దండావతే ఇంగ్లీషులోని తప్పులెన్నబోయారు. దానికి ప్రతిస్పందించిన దండావతే, ”ప్రధానమంత్రిగారు నేను మాట్లాడుతున్న ఇంగ్లీషులో తప్పులున్నాయంటారా? ఉండొచ్చండి. ఎయిర్ హోస్టెస్‌ల దగ్గరనుంచి ఇంగ్లీషు నేర్చుకోగల అవకాశం నాకు లభించలేదు మరి” అంటూ చురక అంటించారు. రాజీవ్‌గాంధీ మరి మాట్లాడలేకపోయారు.
నాటి జనతా పార్టీ ప్రభుత్వంలో ఆయన రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే ఆయన రైళ్ళలో మొదటి తరగతికి లభించే కొన్ని సౌకర్యాలు, రెండో తరగతికి కూడా లభ్యమయ్యే వీలు కల్పించారు.కాబట్టే ఈనాడు రెండో తరగతి ప్రయాణీకులకు కూడా మెత్తని కుషన్ సీట్లు లభ్యమయ్యాయి. ఇంతటి విప్లవాత్మకమైన నిర్ణయాలుగల బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన దండా వతేని ‘మధ్యతరగతి మహాత్ముడు’ అనేవారు.
మంత్రిగా ఉంటూ ఆయన అతి నిరాడంబ రుడుగా జీవించాడు. ఆయన నివాస గృహంలో చెప్పుకోతగ్గ ఆధునిక సౌకర్యాలు లేవు. ఆఖరికి ఒక కలర్ టీవీ కూడా లేదు. వి.సి.ఆర్. లేదు. దేశానికంతటికీ బడ్జెట్ నిర్దేశించే కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి వి.సి.ఆర్. లేకపోవడం ఆనాటి పరిస్థితులనుబట్టి అబ్బురమే!
ఏదైనా సంభవమే..
తమిళనాడులో అన్నాదొరై ముఖ్యమంత్రిగా ఉండగా నెడుంజెలియన్ రెండవ స్థానంలో ఉండేవారు. 1962-67లో నెడుంజెలియన్‌్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. కరుణానిధి ఉప ప్రతిపక్ష నాయకుడు. అన్నా కేన్సర్ హాస్పిటల్‌లో ఆడ్మిట్ అయినప్పుడు నెడుంను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అయితే ఎం.జి.ఆర్., కరుణానిధి, షణ్ముగం, సత్యవాణి ముత్తు మొదలైన వారు కలిసి కరుణానిధి నాయకత్వంలో పోటీ చేయాలని నిర్ణయించారు. అన్నా మరణించగానే గవర్నర్ నెడుం చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిం చారు. నెడుం ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రు లందరూ యధాతథంగా కొనసాగించారు. తననే ముఖ్యమంత్రిగా లెజిస్టేటివ్ పార్టీ ఎన్నుకుంటుందని ధీమా ఉన్న నెడుంకు 1969 ఫిబ్రవరి 9న జరిగిన లెజిస్టేటివ్ పార్టీ సమా వేశంలో చుక్కెదురైంది. పెరుగుతున్న కరుణా నిధి బలాన్ని దృష్టిలో పెట్టుకుని నెడుంజెలియన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని కరుణా నిధి ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం కలిగించాడు. నెడుం మంత్రివర్గంలో చేరలేదు. పార్టీలో తన స్థానం పటిష్టపరచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
కరుణానిధి పార్టీ అధ్యక్ష పదవి నొకటి సృష్టించి తన చేతుల్లో ఉంచుకున్నాడు. ముఖ్య మంత్రులే పార్టీ అధ్యక్షులు కావడం డి.ఎం.కె. లో కొనసాగుతున్నది.