మనసుపెట్టి చదివితే ఈ పుస్తకంలోని కథలన్నీ జీవన దిక్సూచీలాగా పాఠకులకు దిశానిర్దేశం చేస్తున్నాయా అన్నట్టుగా వున్నాయి. మనస్సుకు హత్తుకునేవిధంగా సాగిన కథలన్నీ, పఠనాసక్తి వున్నవారినే కాకుండా, యథాలాపంగా పుస్తకాన్ని తిరసేవారినికూడా కథల్లోకి లాక్కెళ్ళి చదివింపజేస్తాయి. ఈ పుస్తకంలో మొత్తం ఇరవై కథలున్నా వేటికవే వైవిధ్యంగా వున్నాయి. ప్రతి కథలోనూవున్న పాత్రల చిత్రణ, మన నిత్య జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడ్డ వ్యక్తులుగానే అనిపిస్తాయి. ఒకసారి కథను చదవడం ప్రారంభిస్తే తుదికంటా చదివింపజేసే రచనాశైలితో రచయిత పాఠకుల మనసును గెలిచాడని చెప్పొచ్చు.
పుస్తకంలోని అన్ని కథల్లో ఆఖరున వున్న ‘పసిడి మనసులు’ కథ వట్టికోట ఆళ్వారుస్వామి స్మారక రచనల పోటీల్లో ప్రథమ బహుమతిని పొందింది. ఆ కథ పేరునే పుస్తకానికి పెట్టడం అభినందనీయం. వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలన్నింటినీ ఒక సంపుటిగా తీసుకురావడంవల్ల పుస్తకంగా భద్రపరచుకొని చదివిన కథలను సయితం అప్పుడప్పుడూ మళ్ళీ చదివినా ఆయా పాఠకులు మానసికంగా రిప్రెష్ అవుతారని చెప్పవచ్చు.
పసిడి మనసులు
పేజీలు: 168,
వెల: రూ. 100/-; ప్రతులకు: సి.యస్. రాంబాబు, 11-1-530, 202, కీర్తనా హోమ్స్, మైలార్‌గడ్డ, సీతాఫల్‌మండి, హైదరాబాద్-06.