అన్నవరం దేవేందర్
మనుషులంత ఒకేతీరు ఒకే భావనలో కన్పిస్తారు. కని మనసుల్లో వేరువేరు అంత్రాలు నిర్మించుకుంటారు. ఉన్నోల్లు లేనోల్లు, సదువుకున్నోల్లు తెల్లబట్టలోల్లు, నౌకరిగాల్లు, ఎద్దు ఎవుసం చేసేటోల్లు, మాదండి ధనవంతులు ఇంకా అట్టడుగువాల్లు ఇట్లా మనషుల మనసుల్లో అంతరాల దొంతరలు ఉంటాయి. ఒక ఊరు ఉంటే పైన చెప్పినన్నీ, అన్ని ఊర్లల్ల ఉంటయి. కని ఎవలు ఏం మాట్లాడరు. అందరు పైకి మంచిగనే కన్పిస్తరు కని ఏదో అంతరంల తేడా కన్పిస్తది. మాట పద్ధతిలో, పిలుపు పద్ధతిలో ఇచ్చుకం, పుచ్చుకం కాడ ఇంటికస్తే అరుసుకునుడు కాడ ఈ తేడా కన్పిస్తది. అయితె సదువుకున్న యంత్రనాగరికత ఇంత జోరుగా ఉన్న రోజుల్లో సుత తేడా అన్నది సూచాయగా అనుభవించినోల్లకే తెలుస్తది.
వృత్తులను బట్టి కులాలు పుట్టినయో, ఆయా కులంల పుట్టినందుకే ఆ వృత్తులు చేస్తున్నరో తెల్వదుగానీ శ్రమజీవులు ప్రపంచం అంతటా ఉంటరు. శ్రమ చెయ్యకుండా బతికేవాల్లు అన్ని వృత్తుల్లోనూ ఉంటరు.
ప్రభుత్వ నిర్మిత కార్యాలయ వ్యవస్థలో కూడా మీది నుంచి కిందికి ఇట్లనే పోస్ట్‌లు వుంటయి. అట్లనే ఊర్లల్ల సుత మీది నించి కింది దాక పెద్దంత్రం, చిన్నంత్రం అనేవి ఉంటయి. సదువు పెరిగినకొద్ది కొంత పోతన్నయి. యింకా కొన్ని అక్కల్ల కొనసాగుతన్నయి. అయితే ఏదీ ఏమైన విద్యనే అన్ని రకాల వైరుద్యాలకు గుణపాఠం. మల్ల చదువుకోవడం అంటే అక్షరాలు నేర్పడం లాంటి వానకాలం సదువుకాదు. ఉన్నత శ్రేణి లక్ష్యాలతో చదవాలి.
ఒక పరిణతి పొందిన నిపుణుడిగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. అందుకు అవకాశాలు రాష్ట్రంలో బోలెడన్ని ఉన్నాయి. ప్రభుత్వ బడులల్లో ఖాళీలు ఉంటన్నయి. గురుకుల విద్యాలయాలు ఎన్నో రకాలుగా బోధన కొరకు ఉన్నయి. సకల అసమానతలు పోవాలంటే అద్భుతమైన విద్యలో మందుండాలె. ఆ తర్వాత కసితో ఉన్నత ఉద్యోగం, ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఎంచుకోవాలె అప్పుడు సమాన జీవన స్రవంతిలో కలువచ్చు.
అట్లనే గాకుండా గ్రామాల్లో రాజకీయరంగం స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి సర్పంచ్ యంపిటిసి సభ్యునిగా లేదా జడ్‌పిటిసి సభ్యునిగా నిలబడి నిజమైన ప్రజాసేవలో పాలు పంచుకోవాల్సిన రీతిలో మనుషులంత ఒక్కతీరే జీవించవచ్చును.
నిజానికి అన్ని చట్టాల ప్రకారం దేశంలో ఆడ మగ అందరూ సమానమే. అట్లనే అందరు మనుషులు సమానమే. కని ఆ సమాన స్థాయి గుర్తింపు సమాజంలో ఒకరికొరకు పొందడంలోనూ తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు మనుషులు సృష్టించుకున్నవే వాటిని ఎవలకు వాళ్లు పోగొట్టుకోవాల్సి ఉంది.
ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా గొప్పగా విస్తరిస్తున్న కాలం. మనం మాట్లాడిన మాటల దృశ్యంతో సహా ప్రపంచమంత క్షణంలో చేరే వ్యవస్థ నడుస్తున్నది. ప్రపంచీకరణ తర్వాత మన దేశంలోకి కూడా ఈ సాంకేతిక ప్రతి పల్లెటూరుకు విస్తరించింది. సెల్యులార్ ఫోన్ లేని మనిషి లేనట్టున్నది. రోజు కూలీ చేసుకునేవాళ్లకు కనీస అవసరంగా సెల్‌ఫోన్ అయ్యింది. అందులో ఇంటర్నెట్ వచ్చి సోషల్ మీడియా వైపు కూడా సదరు మనిషి పయనిస్తున్నడు. అయినా మనిషి మనిషిగా మానవత్వం నిండిన రుషిలాగా జీవించే రోజులు గత కాలమేనా అన్పిస్తుంది. మానవుల మధ్య ఉండాల్సిన ప్రేమ, సంఘీభావం రోజు రోజుకు తగ్గిపోవడం కృత్రిమ సంబంధాలు నెలకొనడం అవీ అవసరాల రీత్యానే కొనసాగడం జరుగుతున్నది. మనిషి డబ్బు చుట్టూ అధికారం చుట్టూ, పదవి చుట్టూ, గిరగిరా తిరుగుతున్నడు. ఇవేవి లేవు అన్న తర్వాత ఆ మనిషికి దూరమవుతున్న సందర్భాలున్నాయి. వ్యవస్థనే ఇట్లా గాకుండా కుటుంబాల సంబంధాలు కూడా ఇలాగే ముడి పడుతున్నాయి. బంధుత్వ సంబంధాలు కూడా పచ్చగా ఉన్నన్ని రోజులే వచ్చిపోతారు, పిట్టల్లా వాలుతారు. ఏమి లేని నాడు, పలకరించే వారుసైతం లేని రోజులు దాపురిస్తున్నాయి. ఇట్లాంటి జాడ్యం పట్నాల్లో అధికంగానే ఉండి పల్లెలను సుత కలుషితం చేస్తున్నాయి. ఇంటింటికి వచ్చిన టెలివిజన్ సీరియల్ కల్చర్ నుంచి అరచేతిలో కన్పించే యూట్యూబ్ వీడియో సైతం కొత్త తరం. ఇలా మానవ పరిమళం లేని ఆర్థిక స్నేహంగా మిగులుతున్నది. మనుషులంతా ఒకటే కని మనిషి తలకాయలోనే ఏదో అంతరం బుస కొడుతున్నది. దాన్ని చేదించేందుకు ఎవరికి వారే ఆత్మ పరిశీలనతో తేజాబ్‌తో కడుక్కోవాలి.