ఊర్లల్ల మనుషులల్ల మనుషులు వేరు వేరుగుంటరు. అండ్ల కొందరు పనిమంతులుంటరు. అంటే ప్రత్యేకమైన పనుల్లో వాళ్ళే నిపుణులు. వాళ్ళకు ఆ పనిపట్ల సహజ శ్రద్ధతో ఉంటరు. వాళ్ళను అందరు గౌరవిస్తరు. ఊల్లె భూముల లెక్కలు తీసుడు అందరితోకాదు. ఎంత లెక్కల పంతులైనా తియ్యని భూమి లెక్క గొలుసులు ఏసి ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు ఇద్దరి అన్నదమ్ములకు పంచుతె ఎట్ల తీసుకోవాలెననే ఇకమతులు చెప్పుతడు. అట్లనే బాయిల లోతు లెక్కలు తీస్తడు. ఆయనకు బగ్గ సదువు రాదు అయినా లెక్కలన్నీ బెహిత్రీన్‌గా చేస్తడు. అట్లనే అందరు బాయిలు తోడుతరు, కాని శాదబాయిలు తోడుడు అందరితోని కాదు. అది ఒక్కలిద్దరి అయితది. ఊరన్నకాడ అందరి అక్కరనే ఉంటది. అట్లనే ఇంటిమీద గూన పెంకలు సదిరే విద్య అందరికీ రాదు. ఇంటిమీద కుమ్మరిగూన, బెంగుళూరు గూన పలిగిపోతే మళ్ళీ పేర్చడం ఊరికి ఒక్కలకో ఇద్దరికో వస్తది. అట్లనే ఎవల ఇంట్లకన్న పాము వచ్చిందనుకో ఆ పామును అందరికి పట్టరాదు.. సంపరాదు.. దాన్ని ధైర్యంగ పట్టే మొనగాడు ఒక్కలే
ఉంటరు. ఎక్కడ పాము కనపడ్డా ఆ పాములుపట్టే మల్లేశంను పిలువు అంటరు. మంత్రాలు ఏసే ఆయన తేలుకుట్టినా, పాము కుట్టినా కండ్లు మూసుకొని ఊదుతడు. అయితే మంత్రాలు అనేవి ఉండవి కని అదో నమ్మకం. ఇట్లా మంత్రాలు ఏసే ఆయన ఉంటడు. ఇంకా పస్కలు అయితే మందు ఇచ్చే ఆయన, దగ్గు వస్తే మందులు ఇచ్చే ఆయన సుత ఉంటడు. ఇండ్లు కుట్టుకుంటే ఇప్పుడంటే ఇంజినీర్లు ఉన్నరుగని ఎన్కట ఎవలో ఒక ఆయన మూలసుక్కకు సూసి ముగ్గు పోసేది. ఇవన్నీ వాళ్ళ రంగాల్లో ప్రత్యేకతలు సంతరించు కున్నవాళ్ళు.
అట్లనే పాటలు పాడడం అందరితో కాదు. అక్కడక్కడ కొందరు చిరుతల రామాయణం పాటలు, చిందు బాగోతం పాటలు రాగయుక్తంగా పాడుతరు. ఆ గొంతువాళ్ళ సొంతం. ఆడవాళ్ళలో బతుకమ్మ పాటలు చెప్పేవాళ్ళు ఊరుకు ఇద్దరో, ముగ్గురో ఉంటరు. వాళ్ళు గంటలకు గంటలు రాగయుక్తంగా బతుకమ్మ పాటలు పాడుతుంటే మిగతావాళ్ళు కోరస్ అందుకుంటరు. ఇప్పుడంటే సౌండ్ సిస్టవ్స్‌ు వచ్చినై. ఇట్లా పాటలుపాడే ఆమెకు సద్దుల బతుకమ్మ నాడు మా గుంపులకు రా అంటే మా గుంపులకు రా అని పిలుసుకపోతరు. అట్లనే నాట్లు వేసేటప్పుడు పాటలు పాడేవాళ్ళు కొందరే ఉంటరు. వాళ్ళు ఆ పొలంలో దిగితే ఆ వరిపొలం ఒక కళావేదిక అయితది. ఇవేగాకుండా ఎడ్లకు ఏదన్నా రోగం వస్తే వైద్యం చేసుడు అందరితోనికాదు. ఊరికి ఒక్కరు ఇద్దరు ఉంటరు. ఎడ్లకు మెత్తకాళ్ళు వస్తే ఏంచేయాలె, నాలిక శేర్లు వస్తే, ఉప్పు, పసుపు నాలికమీద పోసి రాసుడు చేస్తరు. ఇవన్నీ ప్రత్యేకమైన వాళ్ళు మాత్రమే చేస్తరు. అట్లనే మనుషులకు నడుము నొప్పి వస్తే, నాయి నొప్పి వేస్తే, కాళ్లు గుంజుతుంటే.. ఇట్లాంటి కొన్ని కొన్ని వైద్యాలకు అక్కడక్కడనే ఈ చెట్టు పసరు పోయి, ఆ చెట్టు ఆకు రసం తీసుకవచ్చి రాయి అంటూ సలహాలు ఇస్తుంటరు. అట్లనే వంటలు చేయడం అందరితోకాదు పండుగలకు పభోజనాలకు పెద్దపెద్ద అండలు దించాలె. అందుకు వంటల మనిషి వేరే ఉంటడు. ఇయ్యాలరేపు అయితే వీళ్ళకు పైసలు ఇస్తుండ్రు. ఇదే వృత్తిగా జీవిస్తున్నరుకని పూర్వకాలంలో అక్కడక్కడ ఉండేవాళ్ళు. పంటలు పండించేకాడూడా కొందరి నిపుణత వస్తది. వాళ్ళ సలహాలే తీసుకుంటరు.
అట్లనే పంచాయితీలు చెప్పే పెద్ద మనుషులు కొందరే ఉంటరు. రెండువర్గాల కొట్లాట మాటలను ఇంటరు. ఇని న్యాయవాది లాగ లాజికల్‌గా మాట్లాడుతరు. ఆ తర్వాత ఎవలకి అన్యాయం జరుగకుండా పంచాయితీ తీర్పు చేస్తరు. ఇట్లా పెద్ద మనిషిలా వ్యవహరించే వ్యవహారం అందరితోకాదు. వాళ్ళను కోరుకొని ఇరువర్గాలవాళ్ళు తీసుకపోతరు. ఇదొక ప్రత్యేకత. కరెంట్ పని చేసుడు, ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకొనుట, మిషన్ కుట్టుడు, కరెంట్ మోటార్లు కాలిపోతే అల్లుడు ఇవన్నీ ఆధునిక వృత్తులు. ఈ పనులు ూడా అందరు అలవోకగా నేర్చుకోరు. కొందరే వాటికి ఆకర్షితులైతరు. అట్లనే నేర్చుకుంటరు. ఊరు ఒక విశాల ప్రపంచం. అందులో రకరకాల కులవృత్తులవాళ్ళు ఉంటరు. ఆయా పనోల్లకు గౌరవం ఉంటది. వడ్లోల్లకు, అవుసులోల్లకు, కమ్మ రోల్లకు, కుమ్మరోల్లకు.. ఇట్లా
అందరికీ వ్యవసాయ కుటుంబాల దగ్గర పనోళ్ళు అనే గౌరవం
ఉంటది. ఏ వృత్తులవాళ్ళయిన కుల వృత్తిలా వస్తుంది.కానీ ప్రత్యేకమైన ఆటలు, పాటలు గానం, నటన.. ఇలాంటివన్నీ కొందరి వస్తుంటయి.
వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళే గాకుండా గౌరవనీయంగా ఉంటరు. ఊర్లె ఇంక కొందరు ఉంటరు నోటికి ఇప్పకాయ లేకుంట మాట్లాడుతరు. కొందరు దొంగతనం ూడా గమ్మత్తుగా చేసుడు మొదలుపెట్టి సరదాగా కొనసాగిస్తరు. కొందరు ఊ పంచాయితీలు అందరితోని పెట్టుకుంటరు.. ఇంక కొందరు ఊరి ఊర్లు తిరుగుతరు. పైరవీలు చేస్తరు.. కొందరు రాజకీయంల తిరుగుతరు. ఇంకా కొందరు ఓట్ల విశ్లేషణలో దిట్ట. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తయి.. అనే రాజకీయ శాస్త్రంలో పండితులుగా ఉంటరు. ఇంకా కొందరు వాళ్ళకు వీళ్ళకు పంచాయతీలు పెట్టిస్తరు. రకరకాల మనుషుల ంద్రం ఊరు. ఊరు అంటేనే కొందరు ప్రత్యేకం.