శ్రీ ప్యారక శేషాచార్యులు
భగవంతుడు కాలస్వరూపుడు. సూర్యుడు నారాయణ స్వరూపుడని ఉపనిషత్తులు, పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ ధర్మశాస్త్రాలనుసరించి సూర్యుని గమనాన్ని పట్టి కాలం ఏర్పడుతుంది. దీనిలో కూడా కొన్ని అపవాద మార్గాలున్నాయి.
భగవంతుడు కాంతి స్వరూపుడు. కాంతి సూర్యుని ఉత్ప్రేరకం. సూర్యుని పరావర్తక కేంద్రమయిన చంద్రుడు కూడా కాంతి ఉద్దీపకుడే. సూర్యునినుండి వచ్చే కాంతి గమనానికి సౌరమానమని, చంద్రునినుండి లభించే వెలుతురు పయనానికి చాంద్రమానమని మనవాళ్ళు పేర్కొన్నారు. సూర్యచంద్రుల తీరులనుపట్టి ఋగ్వేద కాలంలో సూర్యవంశమని, చంద్రవంశమని పేర్లు ఏర్పడ్డాయి. సూక్ష్మంగా పరిశీలిస్తే పూర్వం ఈ వంశాలమధ్యే పెండ్లిండ్లు జరిగాయని, సూర్యవంశ ప్రస్థానానికి చిహ్నంగా రామాయణం, చంద్రవంశ ఉత్తానానికి మార్గంగా మహాభారతం కావ్యేతిహాసాలుగా మలచబడ్డాయి. సూర్యచంద్ర ద్యోతులను ప్రతీకలుగా చేసికొని భూమికి వాటికిగల సంబంధాన్ని నిర్మాణాత్మకంగా చెబుతూ సర్రియలిజం మార్గంగా రామాయణ మహాభారతాలను రూపొందించారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. సూర్యుని గమనం ఉత్తర దక్షిణ మార్గాలుగా జరుగుతుంది కాబట్టి సూర్యునిదారిని ఉత్తర`దక్షిణ ఆయనాలుగా భావించారు.
మకర సంక్రమణం పిదప సూర్యుడు ఉత్తరాయణంవైపు కదులుతాడు. దీనిని పుణ్యకాలంగా, శుభప్రదమైన కాలంగా విజ్ఞులు భావిస్తారు. మనుష్యులు శుభకార్యాలన్నింటినీ ఈ ఆరుమాసాలలో జరుపుకుంటారు. ఉత్తరాయణంలో ఉగాదికి ముందుగా ఫాల్గుణపౌర్ణమి రోజు కామదహనం జరుగుతుంది. కాంతి స్వరూపుడైన సూర్యునికి పరావర్తకుడైన నిండు చంద్రుని రోజు శివుడు కోరికలను నిర్మూలించాడని, ఇదే కామదహనోత్సవం అని పేర్కొంటారు. ఉత్తరాదివారు హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకొని మండుతున్న అగ్నికీలలో ప్రవేశిస్తుంది. కానీ నారాయణుని మహిమచేత ఆమెయే దహించబడినది. అందుకుగాను ఈ దినాన్ని హోళి పండుగగా ఔత్తరాహికులు భావిస్తారు. దీని తరువాత పదిహేను రోజులకు ఉగాది పండుగవస్తుంది. ఇది తెలుగువారికి ముఖ్య పర్వదినం. చైత్రవైశాఖాలను వసంత ఋతువుగా పేర్కొంటారు. ఈ కాలంలో పుష్కలంగా పూలు పూస్తాయని, పూలపై తుమ్మెద లు, సీతాకోకచిలుకలు ఇత్యాది కీటకాలు విహరిస్తాయని, మకరందానికి పట్టువులు అవుతాయని, మాధుర్యానికి పుట్టువులవుతాయని కావ్యాలు ఉదహరిస్తాయి. మన్మథుడు కోరికలకు ఆద్యుడు. ఈరికలకు ఆరాధ్యుడు. ఆ మన్మథుడు శివునిచేత దహింపబడిన దినమే హోళి అని పిలవబడుతున్నది. వచ్చే ఉగాది పర్వదినాన్ని కాలమానంలో మన్మథ సంవత్సరంగా పేర్కొంటారు. మనస్సు మధించే భావాలకు ఇది ఉనికి పట్టు.
ఈసారి మన్మథ దహనం కావించ బడిన పదిహేను రోజులకే మన్మథ నామ సం వత్సరం వస్తుంది. ఆకురాలు కాలం లాగ, మనస్సులో భావాలు మెలి పెట్టబడి కోరికల ఉద్యమంలో ఆత్మలు బలిపెట్టబడి మాడి మసైన ఉద్యమ విజయ
రూపంగా మన్మథుడు ఆవిర్భవిస్తు న్నాడు. అమరవీరుల ఆత్మత్యాగం తరువాత తెలంగాణ ఆవిర్భవించిన ట్లుగా, బంగారు ఉషస్సు ప్రభవించిన ట్లుగా.. తొలి తెలంగాణ ఉగాది పండుగ ఒక యుగాదికి సంకేతంగా పసిమితనానికి సంకల్పంగా మత్Gమథ ఆలోచనలకు అపురూపంగా ఈ ఉగాది మనకు సాక్షాత్కరిస్తున్నది.
ఈ ఉగాదికి మన్మథనామ సంవత్సరం అని పేరు. మహాయుగానికి మొదటిదినం యుగాది. దాని వికృతి స్వరూపం ఉగాది. దీనికి రాజు శని. ఇతడు సూర్యుని కొడుకు. సూర్యగమనానికి ప్రతీక అయిన మన్మథునికి శని రాజవుతున్నాడు. మంత్రి కుజుడు అవుతున్నాడు. సైన్య`అర్ఘ్య` మేఘ అధిపతి చంద్రుడు. సస్య`నీరస అధిపతి ` శుక్రుడుÑ రస అధిపతి సూర్యుడు. ధాన్యాధిపతి బుధుడు. నవ నాయకులలో ఆరుగురు శుభస్థానంలో ఉన్నారు. ముగ్గురు పాపస్థానంలో ఉన్నారు. కావున మంచి పాలన జరుగునని విశ్వసించవచ్చును. నూతన పరిశ్రమలకు అంకురార్పణ జరుగును.
ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధిపథంలో ప్రాంతములు పయనించగలవు. క్రీడారంగంలో మనవారు ఉన్నతపథంలో ఉండగలరు. అంతరిక్షరంగంలో నూతన ప్రయోగాలు విస్తరించ గలవు. మనస్సుపై శని ఆధిపత్యం, కుజ దృష్టి ఉండడంవలన ప్రకృతి వైపరీత్యాలు అధికం. ఉగ్రవాదచర్యలు విస్తరింపబడగలవు. వడదెబ్బ ఎక్కువగా ఉండగలదు. పిడుగుపాట్లు అధికంగా ఉండగలవు. శుక్ర మౌఢ్యమి, గురు మౌఢ్యమి ఆషాఢ బహుళ ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ షష్ఠి వరకు ఉండగలవు.
గోదావరి పుష్కరాలు: 06.07.2015 దినాన రాత్రి 10 గం. 23 ని.లకు సింహరాశిలోనికి గురువు ప్రవేశించుచున్నాడు. కాన 07.07.15 నుండి 18.07.2015 వరకు (పన్నెండు దినాలు) గోదావరి పుష్కరవాహిని అగుచున్నది.
ఈ సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నవి. 04.04.2015న సంపూర్ణ చంద్రగ్రహణం 28.09.2015న కూడా సంపూర్ణ చంద్రగ్రహణమే కాని ఇది ఉత్తర హిందూస్థానంలో కనిపించును.
13.9.2015 దినాన ఖండగ్రాస సూర్యగ్రహణం ఏర్పడును. ఇది భారతదేశంలో కనిపించదు. కాని 9.3.2016నాడు కనిపించు పాదాధిక గ్రాస సూర్యగ్రహణం దేశంలో కనిపించును.
బంగారం ధర తగ్గుతుంది: వెండి, ‘బంగారు’ ధాన్యం ధరలు పడిపోగలవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యం కొరవడుతుంది. విద్యుత్తు ఉత్పత్తి పెరుగుదలకు అవకాశం కలదు. సరిహద్దు ప్రాంతంలో భయానక సంఘటనలు జరుగుతాయి.
ఆరు గ్రహాలు శుభగ్రహాలు అయినందున ప్రజలు సుఖశాంతులతో ఉండగలరు. ఉగాది రోజున ప్రజలందరూ అభ్యంగన స్నానం, నింబకుసుమ భక్షణము, నూతన వస్త్రధారణ, పంచాంగ శ్రవణం చేయవలసి ఉంటుంది. నింబకుసుమ భక్షణమంటే పచ్చడి అని అర్థం. ఆరు రుచుల కలయికయే పచ్చడి. మన జీవితంలోని వైవిద్యాలను సమానంగా స్వీకరించాలనే ఉద్దేశ్యం దీనిలో గోచరిస్తుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, జాతక కర్మలను తెలిసి కోవడమే పంచాగ శ్రవణ లక్ష్యం. అది ఈ రోజున ప్రారంభించాలె. ప్రతి రోజు సాధించాలె. అందుకు మనస్సు మధించాలె. మన్మథనామ సంవత్సరం ఈ పరంపరకు నాంది కావాలని, తెలంగాణ అభివృద్ధికి పునాది కావాలని మనం కాంక్షిద్దాం.
సర్వేజనా: సుఖినోభవంతు