హైదరాబాద్‌లో కూర్చొని బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించే గత పాలకుల విధానాలకు భిన్నంగా, కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం వినూత్న విధానాన్ని అమలుచేసింది. తెలంగాణకు ఇప్పుడు కావలసింది ప్రజల ప్రాధాన్యాలను ప్రతిబింబించే బడ్జెట్. ఇందుకోసం వినూత్నంగా ‘మన ఊరు ` మన ప్రణాళిక’ అనే కార్యక్రమం చేపట్టింది. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలనుంచి ప్రతిపాదనలు సేకరించింది. అందుకోసం ప్రభుత్వం స్వయంగా ప్రజలవద్దకు వెళ్ళింది. ప్రజల సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మార్గదర్శకత్వంలో ఈ పథకాలు రూపొందాయి. ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి పైసా వృధా కాకూడదని, బలహీనవర్గాల అభివృద్ధికి ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఆగస్టు 19న ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ప్రజా సంక్షేమ పథకాలు అనుకున్న లక్ష్యం చేరడానికి ఈ సర్వే ఫలితాలు ఎంతగానో ఉపయోగపడతాయి.