పోతనలాగా మధురంగా పద్యం చెప్పడమే కాకుండా ‘పోతన చరిత్రము’ అనే బృహత్ కావ్యరచన చేసిన వానమామలై వరదాచార్యులకు అలనాడే మహాకవులు – దాశరథి, సి.నారాయణరెడ్డి అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న తెలంగాణ రచయితల సంఘం ” అభినవ పోతన” బిరుదునిచ్చి సత్కరించింది.
ఈ గ్రంథ రచనాకాలంలోనే వరదాచార్యులు క్షయవ్యాధి పీడితులై మైసూరులో మూడేండ్లు (1949-1953) ఉండి చికిత్స పొందారు. వీరి ఊపిరి తిత్తులకు పది పర్యాయాలు శస్త్ర్రచికిత్స చేశారు. ఒక ఊపిరితిత్తి పూర్తిగా చెడి, కత్తి కోతలకు గురైంది. ఏక శ్వాసకోశంతోనే వీరు చికిత్సానంతరం జీవించారు. ఒక సందర్భంలో వరదాచార్యులు పరమపదించారని విని తెలంగాణ రచయితల సంఘం, ఆచార్యుల వారి సంతాపసభ కూడా పెట్టింది. మృత్యుముఖం నుంచి బయటపడి వరదాచార్యులు హైదరాబాద్ తిరిగివచ్చాక ఆయనతో మహాకవి దాశరథి ‘నాకు జీవితంలో ఆనందాన్నిచ్చిన వార్తలు రెండే రెండు. ఒకటి నిజాంపై పోలీసుచర్య. రెండు నీకు జబ్బు నయమై బతకడం అన్నారు.
అయితే కొందరు దాన్ని హైదరాబాద్‌నగరంలోని శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో వరదాచార్యులను చూసిన అభిమానులు ‘మీరు పోయారనుకున్నాం’ అంటే దీనికి ఆచార్యులవారు ‘నేను పోతనా’ అన్నారని కథలల్లారు. ‘నేను పోతనా’ అంటే ‘నేను పోతనా, పోను’ అనే అర్థమే కాకుండా తానే పోతన అన్నట్టు ధ్వనించారు.
ఇంతటి మహాకవి ‘పోతన చరిత్రము’ కాకుండా మరో ఏభై దాకా గ్రంథాలు రచించారు. వారి శత జయంతిని పురస్కరించుకుని డా|| తిరుమల శ్రీనివాసాచార్య సలహాదారుగా 36 పేజీల శతజయంతి ప్రత్యేక సంచిక ‘శత వసంత సౌరభాలు’ను ఆలస్యంగానైనా అందంగా ప్రచురించారు. ఈ సంచికను మూడు ప్రధాన భాగాలుగా విడగొట్టారు. తొలి భాగంలో వరదాచార్యుల వ్యక్తిత్వాన్ని ద్యోతకం చేసే 27 విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రచురించారు. తృతీయ భాగంలోని 26 వ్యాసాలు వరదాచార్యుల ఇతర కృతులపై వ్రాసినవి.
వ్యాసాలన్నీ దాదాపు వరదాచార్యుల కవిత్వం పట్ల అనురక్తిగల వారే వ్రాశారు కాబట్టి న్యాయం చేశారు. ఎందుకు జరిగిందోకాని మూడో భాగంలో ఉండవలసిన గొప్ప గ్రంథం ”జయధ్వజం”పై వ్యాసం లేదు. ఆచార్యుల ” గొల్ల సుద్దులు”, ” హరికథలు”, అనువాద గ్రంథాలు ‘అలంకార శాస్త్రం’, ‘శకీర్‌గీతాలు’పై కూడా ప్రత్యేక వ్యాసాలు ఉండవలసిందే. వ్యక్తిత్వం విభాగంలో ప్రచురించిన ఆర్.అనంతపద్మనాభరావు వ్యాసం ‘వరదన్న ఆర్తి’ ‘స్తవరాజ పంచశతి’పై వ్రాసింది. అట్లాగే వానమామలై గాంధీ స్పృహను పల్లెసీమ ‘ఆహ్వానం’ గురించి వ్రాసింది. ఈ రెండు వ్యాసాలు మూడోభాగంలో ఉండాలి. డా|| సి.నారాయణరెడ్డి ‘మణిహారం’తో ప్రారంభమైన తొలి భాగంలోనే అంతకుముందు వేసిన డా కె.వి. రమణాచారి ‘మనం చూసిన పోతన మొదలుకుని నాకు తెలిసిన వానమామలై, ‘ మా అయ్యగారు’, ‘గురుభ్యోన్నమ:’, ‘వందనం’ కూడా వేస్తే సముచితంగా ఉండేది. ఏమైనా అభినవ పోతన వానమామలై వరదాచార్యుల శతజయంతి ఉత్సవ సమితి ఎంతో శ్రమతో ప్రచురించిన ఈ ప్రత్యేక సంచిక సాహిత్యాభిమానులు, వరదాచార్యుల శిష్యకోటి తప్పకుండా చదివి తీరవలసిందే.
– టి. ఉడయవర్లు