districts

పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో మూడుసార్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణా రాష్ట్రం ఈ ప్రాంతంలోనిదే కనుక మార్పు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది.

ఒకమార్పునుంచే మార్పును ఆహ్వానిస్తుంది. యీ మార్పులు పరిపాలనా సౌకర్యంకోసం అవసరమవుతాయి. ప్రస్తుత మార్పుతో 10 జిల్లాలతోపాటు

మరో 17 జిల్లాలు అవుతున్నాయి.

రంగారెడ్డి

ఖమ్మం తరువాత రెండో చిన్న జిల్లా రంగారెడ్డి. పూర్వం ఈ జిల్లాను అత్రాఫ్‌బల్దా జిల్లా అనేవారు. బల్దా అంటే నగరం అత్రాఫ్‌ అంటే చుట్టూ వున్న ప్రాంతం. ఈ జిల్లాలో 876 గ్రామాలుండేవి. 573 గ్రామాలు సర్ఫెఖాస్‌ (నిజాం స్వంత ఆస్తి) భాగం, కాగా జాగీరు గ్రామాలు 303 ఉండేవి. అత్రాఫ్‌ బల్దా జిల్లాలో దివానీ (ప్రభుత్వ) గ్రామాలు లేవు. దివానీ గ్రామాలను పరిసర మెదక్‌ జిల్లాలోని బాగాత్‌ జిల్లాలో కలిపివేశారు.

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైపోగానే ఈ జిల్లాలోని సర్ఫెఖాస్‌ గ్రామాలను, జాగీరు గ్రామాలను, దివానీ గ్రామాలను ఒకే చోట కలిపి 1948లో హైదరాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ జిల్లాలో హైదరాబాదు తూర్పు, హైదరాబాదు పశ్చిమ, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, షాబాద్‌, తాలూకాలు ఉండేవి. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పరిగి, మెదక్‌ జిల్లాలోని వికారాబాద్‌, గుల్బర్గా జిల్లాలోని తాండూరు దీనిలో కలిసిపోయాయి. 1965 ఏప్రిల్‌లో మేడ్చల్‌, హైదరాబాద్‌ తూర్పు, హైదరాబాద్‌ పశ్చిమ తాలూకాలోని నగరాన్ని ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాలతో హైదరాబాద్‌ అర్బన్‌ తాలూకా ఏర్పడింది. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ జిల్లా కార్యాలయాలన్నీ హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నాయి. కొత్తగా జిల్లా కేంద్రం ఏర్పాటవుతుందని ఆశలూరించారు. రాజధాని నగరం తరువాత తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా రెండవ అభివృద్ధి చెందిన ప్రాంతమని చెప్పవచ్చు. జిల్లా కేంద్రం లేకపోయినా పారిశ్రామిక కేంద్రాలు, విద్యాసంస్థలు ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌

ప్రస్తుతం మహబూబ్‌నగరుగా ఉన్న పట్టణ ప్రాంతం 17వ శతాబ్దంలో లోకాయెపల్లి సంస్థానంలోని పాలమూరు పేరుతో ఉండేది. సంస్థాన అధికారులు దీన్ని అభివృద్ధి పరిచి 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌పేర మహబూబ్‌నగర్‌ అని పెట్టుకున్నారు. 1904లో జిల్లా కేంద్రాన్ని నాగర్‌కర్నూలునుంచి మహబూబ్‌నగర్‌కు మార్చారు.

జాగీర్లను విలీనపరిచినప్పుడు అంటే 1950కి ముందు కల్వకుర్తి, పరిగి, నాగర్‌కర్నూలు, మక్తల్‌, అచ్చంపేట అనే 6 తాలూకాలు ఉండేవి. జాగీర్ల విలీనం కారణంగా వనపర్తి, షాద్‌నగర్‌, కొల్లాపూర్‌, ఆత్మకూరు తాలూకాలు దీనిలో కలిసిపోయి పది తాలూకాల జిల్లా అయింది. రాష్ట్రాల పునర్నిర్మాణ సమయంలో మూడవసారి మార్పుతో మరో మూడు తాలూకాలు-రాయచూరు జిల్లానుంచి గద్వాల, ఆలంపూరు తాలూకాలు, గుల్బర్గానుంచి కొడంగల్‌ తాలూకా దీనిలో చేరాయి. పరిగి తాలూకాను హైదరాబాద్‌ జిల్లాలో కలిపారు. దీనితో ఈ జిల్లాలో తాలూకాల సంఖ్య 12 అయింది. హైదరాబాద్‌ రాష్ట్రంలోని సగం సంస్థానాలు యీ జిల్లాలో ఉండడంవలన అభివృద్ధిలో ఈ జిల్లా కొంత వెనుకబడి ఉంది.

నల్లగొండ

విప్లవాల పుట్టిల్లుగా ప్రసిద్ధి చెందిన నల్లగొండకు నీలగిరి అని పేరుండేది. రెండు నల్లరాతి కొండల మధ్య ఉండడంవల్ల నల్లగొండ అనే పేరువచ్చి ఉంటుంది. 1901 నాటికి ఈ జిల్లా నల్లగొండ, సూర్యాపేట, దేవరకొండ, భువనగిరి తాలూకాలు, కొన్ని జాగీరు గ్రామాలతో కలిసి ఉండేది. 1905లో వరంగల్లు జిల్లానుండి కోదాడ, చీరాల ఫిర్కాలను ఈ జిల్లాలో కలిపి పోచంచర్ల తాలూకా (ప్రస్తుతం హుజూర్‌నగర్‌)ను ఏర్పాటు చేశారు. 1901-1951 మధ్య అయిదు దశాబ్దాల కాలంలో జిల్లాలో పెద్ద మార్పులు లేవు. ఐతే 1953లో ఖమ్మంజిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు ఈ జిల్లాలోని జనగామ తాలూకాను వరంగల్‌జిల్లాలో చేర్చారు. 1959లో ఈ జిల్లా భూభాగంలోనికి చొచ్చుకొని ఉన్న కృష్ణాజిల్లాలోని మునగాల పరగణాను యీ జిల్లాలో కలిపారు. ఆ తర్వాత ఈ జిల్లాలో మార్పులు జరుగలేదు.

నిజామాబాద్‌

పూర్వం ఇందూరుగా పేరున్న జిల్లా నిజామాబాద్‌గా మారింది. ఇంద్రపురి ఇందూరు అయిందంటారు. 1878లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి సాలార్‌జంగ్‌ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిపినప్పుడు ఇందూరు ఈ జిల్లా కేంద్రమైంది. 1905లో జిల్లాల పునర్నిర్మాణం జరిగినప్పుడు ఇందూరు జిల్లాను మెదక్‌ సుబాలో చేర్చి నిజామాబాద్‌ పేరు పెట్టారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నాందేడ్‌జిల్లా దెగ్లూర్‌ తాలూకాలోని బిచ్‌కుంద, జుక్కల్‌ సర్కిల్‌ ఈ జిల్లాలోని బాన్సువాడ తాలూకాలో కలిపివేశారు. ప్రస్తుతం ఈ జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, మద్నూర్‌ ఏడు తాలూకాలున్నాయి.

కరీంనగర్‌

1905కి పూర్వం కరీంనగర్‌ జిల్లా కేంద్రం స్థానం ఎల్గందల్‌లోఉండేది. ఎల్గందల్‌ గ్రామం కరీంనగర్‌కు సమీపంలో ఉంది. బమ్మెర పోతన రచించిన భాగవత గ్రంథంలోని నశించిపోయిన కొన్ని భాగాలను పూరించిన వెలిగందల నారయ ఈ ప్రాంతంవాడే. జాగీర్లు రద్దయినప్పుడు మెట్‌పల్లిని ఎనిమిదవ తాలూకాగా చేశారు. ఖమ్మం జిల్లా ఏర్పడినప్పుడు ఈ జిల్లాలోని పర్కాల తాలూకాను వరంగల్‌ జిల్లాకు మార్చారు. మహాదేవపూర్‌ మంథనిగానూ, జమ్మికుంట హుజూరాబాద్‌గా పేర్లు మార్పు చెందాయి. ప్రస్తుతం జిల్లాలో కరీంనగరు, జగిత్యాల, మెట్‌పల్లి, సిరిసిల్ల, హుజూరాబాద్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ అనే ఏడు తాలూకాలున్నాయి.

ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌ జిల్లా పరిపాలన సౌలభ్యంకోసం ఏర్పడిన జిల్లానేగాని చారిత్రకంగా, భౌగోళికంగా ప్రాముఖ్యమైనది కాదు. 1905లో ఈ జిల్లా సిర్పూరు-తాండూరు పేరుతో బీదర్‌ డివిజన్‌లో భాగంగా ఉండి, కొన్ని జాగీరు గ్రామాలను, కరీంనగర్‌ జిల్లాలోని చెన్నూరు, లక్సెట్టిపేట తాలూకాలు, నిజామాబాద్‌ జిల్లాలోని నర్సాపురం, నిర్మల్‌ తాలూకాలు, ఆదిలాబాద్‌ తాలూకాను విభజించి కిన్వట్‌ తాలూకాగా ఏర్పాటు చేశారు. 1911-1921 మధ్యకాలంలో ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ల పునర్విభజన జరిగి ఉట్నూరు, బోధ్‌ తాలూకాలు ఏర్పడ్డాయి. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ జిల్లాలో మరాఠీ మాట్లాడే ప్రజలున్న రాజూరా, కిన్వట్‌ లను మహారాష్ట్రకు బదిలీచేసి, నాందేడుజిల్లా ముధోల్‌ను ఆదిలాబాద్‌జిల్లాలో కలిపారు. విస్తీర్ణంలో సిర్పూర్‌ తాలూకా అతి పెద్దది. ఖానాపూరు తాలూకా అతి చిన్నది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, బోధ్‌, చెన్నూరు, ఖానాపూర్‌, లక్సెట్టిపేట, ముథోల్‌, నిర్మల్‌, సిర్పూరు పది తాలూకాలున్నాయి. దేశంలోని గోండు జాతి ఆదిమవాసీలు ఈ జిల్లాలో ఎక్కువమంది ఉన్నారు.

వరంగల్‌

పెద్ద తటాకాలతో, గుళ్ళు, గోపురాలతో, చారిత్రక ప్రాధాన్యంగల శిల్పాలతో, కాకతీయ వైభవాన్ని ఈ జిల్లా గుర్తుకు తెస్తుంది. నాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉన్న ఈ జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యంగా విభజించి ఖమ్మంజిల్లాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జిల్లాలో వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లు, వరంగల్‌, పర్కాల, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, నర్సంపేట (పాకాల) ఆరు తాలూకాలున్నాయి. ములుగు విశాలమైన తాలూకాగానూ, పరకాల చిన్న తాలూకాగానూ ఉన్నాయి. సాంస్కృతిక, విద్యారంగాలలో తెలంగాణరాష్ట్రంలో ఈ జిల్లా రెండవ స్థానంలో ఉంది. మానుకోటను మహబూబాబాద్‌గా మార్చారు.

ఖమ్మం

పరిపాలనా సౌలభ్యంకోసం వరంగల్‌ జిల్లానుంచి 1953లో విడివడి ఖమ్మంజిల్లా కొత్తగా ఏర్పడింది. ఖమ్మం జిల్లా ఐదు తాలూకాలు ఖమ్మం, ఇల్లెందు, మధిర, బూర్గంపాడు, పాల్వంచ (ప్రస్తుతం కొత్తగూడెం) ఉన్నాయి. 1959లో తూర్పు గోదావరిజిల్లాలోని భద్రాచలం, సూగూరు తాలూకాలను ఖమ్మంలో కలిపారు. కొత్తగూడెం, మధిర తాలూకాలోని కొన్ని గ్రామాలతో 1974 ఫిబ్రవరిలో సత్తుపల్లి తాలూకాను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధమైన సింగరేణిలో బొగ్గుగనులు ఈ జిల్లాలో ఉండడం వల్ల ఈ జిల్లాకు ‘నల్లబంగారం’ అని వాడుక వచ్చింది.

మెదక్‌

ఈ జిల్లా చిన్నదే అయినా చారిత్రకంగా ప్రసిద్ధమైనది. సంగారెడ్డి సమీపంలో కొండాపురం గ్రామంలో ప్రాచీన నాణేలు లభ్యం కావడంతో శాతవాహనుల కాలంనాటి చరిత్రకు ఇది ఊపిరి పోసింది. గోలకొండ సుల్తానుల కాలంలో గుల్షనాబాద్‌గా ఉన్న ఈ జిల్లా పేరు నిజాంకాలంలో మెదక్‌గా మారింది. మెదక్‌ పదం మెతుకు అనే పదానికి నామాంతరం. తెలంగాణ జిల్లాలోకెల్ల యీ ప్రాంతంలో వరి ఎక్కువ పండడంతో దీనికి మెదక్‌ అని పేరు పెట్టి ఉంటారు. ఈ జిల్లాకున్న ప్రాముఖ్యత ఏమిటంటే తెలంగాణాలోని రెండు సుబాలలో ఒకటి వరంగల్‌ పోగా రెండవది మెదక్‌. సంగారెడ్డి ఈ జిల్లాకు కేంద్రస్థానం. 1905కి పూర్వం ఈ జిల్లాలో మెదక్‌, రామాయంపేట, బాగత్‌, కలబ్‌గూరు, ఆందోల్‌, టేక్మల్‌ అనే తాలూకాలుండేవి. ఆ తర్వాత సిద్దిపేటను కొత్త తాలూకాగా ఏర్పరిచారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు బీదరు జిల్లానుండి నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌ తాలూకాలను కలిపారు. ఈ జిల్లానుంచి వికారాబాద్‌ తాలూకాను విడదీసి హైదరాబాద్‌ జిల్లాలో కలిపారు. ప్రస్తుతం ఈ జిల్లాలో సంగారెడ్డి (కలబ్‌గూరు), ఆందోల్‌, మెదక్‌, సిద్ధిపేట, గజ్వేలు, నర్సాపూర్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌ తాలూకాలున్నాయి. బాగాత్‌ తాలూకాను రద్దుచేసి రంగారెడ్డిజిల్లాలో కలిపారు.

జి. వెంకటరామారావు

Other Updates