magaతెలంగాణ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు .. కొండ కోనలే కాదు వాటిపై నుంచి జాలు వారే వాగు వంకలు …. అందునా ….. ఇది ఓ దట్టమైన కీకారణ్యం. నలువైపులా పచ్చని కొండలు. ఆ కొండకోనల నడుమ సొగసైన జల దండోరా. చెల్లాచెదురైన నీటి పాయలు ఒద్దికగా మారిపోయి, శాంతి ప్రవాహంలా జారిపోయే ముగ్ధ మనోహర దృశ్యం. కన్నార్పనివ్వని నీటి సిరుల సోయగం.

గంగ సిగ విప్పి కురులు జార విడిస్తే .. జలపాతం

మహోధృతితో ఆమె శిరస్సు నుంచి వీపుమీదుగా దూకి

నడుందాటాక నెమ్మదించి చెల్లాచెదురైన కేశాలు ఒక్కటిగా చేరి..

ఎక్కడలేని ఒద్దికను తెచ్చుకొని..

శాంత ప్రవాహంలా మారి సాగిపోతున్నట్టుండే బొగత జలపాతం. ఒక్క మాటలో చెప్పాలంటే అది మన తెలంగాణ నయాగరా జలపాతం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలో దట్టమైన కీకారణ్యంలో పచ్చని చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తూ గోదారి నదిలో మమేకం అవుతుంది .. బొగత జలపాతం….. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచంలో సుందరమైన జలపాతం నయాగరానే అంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ సౌందర్యాన్ని కళ్లారా చూడాలని చాలామంది కల. అయితే అందుకు అమెరికా దాకా వెళ్లాల్సిన పనిలేదు. మన దగ్గరే నయాగరాను తలదన్నే అద్భుతమైన జలపాతముంది. అభయారణ్యంలో తెల్లని నురగలు గక్కుతూ వయ్యారంగా కిందికి జాలువారుతుంటుంది. జయశంకర్‌ భూపాలపల్లి వాజేడు అడవుల్లో ద్రవీభవించిన అద్భుత జలతరంగిణీ రాగం బొగత జలపాతం.

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో సుమారు 50 కిలోమీటర్ల దూరాన ఉన్న నల్లందేవి గుట్ట దగ్గర పుట్టింది బొగత. అక్కడి నుంచి గుట్టల మీదుగా దుర్గమ అరణ్యాలను చీల్చుకుంటూ వాజేడు మండలంలోని పెనుగోలు దగ్గర పాలవాగుగా మారుతుంది. అక్కడి అడవుల్లోని ఔషధ గుణాలను తనలో సంగమించుకొని పెనుగోలు ఊరు దాటాక ఆల్బర్ట్‌ వాగుగా రూపాంతరం చెందుతుంది. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని గుట్టలను ఒరుసుకుంటూ పారి.. చీకుపల్లికి అర కిలోమీటరు దూరంలోని బండరాళ్ల మీద నుంచి జాలు వారి.. బొగత జలపాతంగా మారుతుంది. గతంలో దీన్ని బంధాల వాగు అనే పిలిచేవారు. బంధాల వాగు బొగత జలపాతంగా మారే ప్రాంతంలో చాలా లోతుగా .. బండరాళ్లపై నుంచి జాలువారుతున్న తరుణంలో నురగలు కక్కుతూ కిందకు దుంకుతుంది … ఇక్కడి గిరిజనులకు ఇదో పవిత్రమైన చోటు … బొబ్బోలు కొడుతూ కిందకు పడుతున్న ఈ జలపాతం సోయగాల చాటున పెద్ద చరిత్రనే దాగి ఉంది …. బొగత జలపాతం అడుగునుంచి పాతాళంకు మార్గం ఉందని ఇక్కడి ఆదివాసుల అపార నమ్మకం … పాండవులు అజ్ఞాత వాసం చేసినప్పుడు… రాముడు ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు ఇక్కడే బసచేసి, ఇక్కడున్న శివయ్యకు పూజలు చేశారని … ఈ విగ్రహ మూర్తులను స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించా రని ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు … ఇదే కాకుండా బొగత జలపాతం నల్లందేవి గుట్టల నుంచి వచ్చే నీటికి ఔషధ గుణాలు ఉంటాయన్నది నమ్మకం.. జలపాతం ఉన్నచోటున లోతును ఇప్పటి వరకు ఎవ్వరూ అంచనా కూడా వేయలేకపోయారు.. కనీసం అక్కడికి వెళ్లేందుకు కూడా ఎవ్వరు సాహసం చేయలేదు .. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉండే సొరంగాలు పాతాళానికి వెళ్లే మార్గాలని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు . నిజానికి బొగత జలపాతం చాలా ఏళ్ల ముందే ఉనికిలోకి వచ్చినా ఎవ్వరూ అక్కడికి వెళ్లే వారు కాదు. జలపాతంలో దేవతామూర్తులు కొలువై ఉంటారని పవిత్రంగా చూసేవారు..

ప్రాకృతిక అందాలతో పాటు చరిత్రాత్మకంగా వేల సంవత్సరాల చరిత్ర ఉన్న బొగత జలపాతం ఇన్నాళ్ళు వెలుగులోకి రాకుండా .. అభివృద్ధికి దూరంగా ఉన్నది అంటే దానికి కారణం సమైక్య పాలకుల చిన్నచూపే. కనీసం రహదారి మార్గాన్ని ూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఏర్పాటు చేయలేదంటే అర్ధం చేసుకోవచ్చు.. పచ్చని కొండ కోనలు ఊటీని తలపిస్తుంటే… కొండ కోనల మధ్య పారే వాగులు … అరకును తలపించే విధంగా ఉండి ఇక్కడి జలపాతం ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా చెప్పుకునే నయాగరా జలపాతంతో పోల్చదగ్గ బొగత జలపాతాన్ని బాహ్యప్రపంచానికి తెల్వకుండా ఓ రకంగా కుట్రనే జరిగిందని ఇక్కడి గిరిపుత్రులు అంటుంటారు… వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉధతికి చీకుపల్లి కాజ్‌వే నీటిమయమవుతుంది. కాజ్‌వే చిన్నది కావడంతో కొన్ని దశాబ్ధాలుగా ఇదే సమస్య. ఒక్కోసారి వారం, పదిరోజులు మొదలుకొని నెలరోజులు వరకు చీకుపల్లి కాజ్‌వేపై వరద ఉధృతి తగ్గదు. ఆ వరద తగ్గనన్ని రోజులూ వాజేడు మండలంలోని సుమారు 30 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. చీకుపల్లి కాజ్‌వే మునిగినప్పుడున్న ఏకైక ప్రత్యామ్నాయం నాటుపడవలు. తెలంగాణలో ఇలాంటి అందాలు తెరమరుగుగా ఉండడానికి సీమాంధ్ర సర్కారే కారణమనుకోక తప్పదు. చీకుపల్లి కాజ్‌వే పై ఎత్తయిన వంతెన నిర్మించకపోవడంవల్లే ఈ తిప్పలు. ప్రపంచానికి బొగత జలపాతం పరిచయం కాకపోవడానికీ కారణం అదే! వాజేడు, ఏటూరునాగారం రెండు ప్రాంతాల మధ్య ఉండే గోదావరి నదిపై కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జిని మంజూరు చేసినా, వాటిని నిర్మించేందుకు నాటి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. కాని తెలంగాణ వచ్చినంక.. ముఖ్యమంత్రి కేసీర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి అత్యంత వేగంగా నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడంతో యుద్ధప్రాతిపదికపై పనులు పూర్తి చేశారు.. దీంతో వందల కిలో మీటర్ల దూరం కాస్తా, పది కిలో మీటర్లకు తగ్గింది.. దీంతో హైదరాబాద్‌ వరంగల్‌ నుంచి వచ్చే పర్యాటకులకు బొగతకు వచ్చేందుకు సులభతరం అయ్యింది… దీనిని చేరుకునేందుకు ఇప్పుడు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

వాజేడు మండల కేంద్రం నుంచి ఆదివాసీల ఆవాసాల గుండా 15 కిలోమీటర్ల ప్రయాణం. ఆ ప్రయాణం నిండా బోలెడన్ని మధురానుభూతులు. ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. అడవిలో మూడు కిలోమీటర్లు ప్రయాణించాక అందమైన సెలయేళ్లు మనసుకు స్వాంతన చేకూరుస్తాయి. చెట్ల పొదల మధ్య నుంచి అల్లంత దూరాన బొగత జలపాతం కనిపిస్తుంటే- అప్పటిదాకా పడ్డ కష్టం దూదిపింజలా ఎగిరిపోతుంది. ఒక అనిర్వచనీయమైన అనుభూతి మనసును గిలిగింతలు పెడుతుంది. సాక్షాత్తు ఆకాశగంగే భువికి దిగి వస్తున్నట్టుగా మరులు గొలుపుతుంది. జలపాతపు నీటి సవ్వడులు తప్ప ఇంకో శబ్ధం వినిపించదక్కడ. పాల నురగల్లాంటి నీటి తుంపరలు ప్రభాతరాగంలా మార్ధవంగా తడుముతుంటాయి. ఆ బండరాళ్ల మీద మనసు చిన్నపిల్లాడిలా గంతులేస్తుంది. జులై నుంచి నవంబర్‌ వరకు బొగత జల దండోరా వినితీరాల్సిందే. నయాగరా అయినా ఒక టైమ్‌ లో గడ్డ కడుతుందేమో గానీ బొగత మాత్రం 365 రోజులూ సడి చేస్తూనే ఉంటుంది. ఇటీవలి భారీ వర్షాలకు మరింత సుందరంగా తయారైంది.

ప్రకృతి రమణీయత నడుమ వయ్యారాలు పోతున్న ఆ సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల పర్యాటకులు, ఎన్నారైలు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బాధలన్నీ మరిచిపోయి హాయిగా ఎంజాయ్‌ చేస్తారు. ఫ్యామిలీ అంతా కలిసి జలపాతంలో కేరింతలు కొడుతారు. అక్కడే వండుకొని తిని రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నారు. వాటర్‌ ఫాల్స్‌ దగ్గరకు వెళ్లాలంటే దట్టమైన అడవి గుండా కొండాకోనలు రాళ్లూరప్పలు దాటుకుంటూ నడవాలి. ఇది సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాని ఇప్పుడు బొగత జలపాతంపై తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ప్రత్యేక దష్టి కేంద్రీకరించింది.దాంతో పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో స్థానికంగా ఉన్న గిరిబిడ్డలకు ఉపాధి ఢోకాలేకుండా పోయింది.

బొగత జలపాతం చుట్టుపక్కల మరిన్ని అందమైన ప్రాంతాలు ఉన్నాయి. కొప్పుసూరు అటవీ ప్రాంతంలోని గుండ్లవాగు ప్రాజెక్టు చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి. టేకులగూడేనికి ఆరు కిలోమీటర్ల దూరంలో లొట్టపిట్ట గండి దగ్గర వెలిసిన బీరమయ్య క్షేత్రానికీ చారిత్రక ప్రాధాన్యం ఉంది. సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి! బీరమయ్య క్షేత్రం దగ్గర గోదావరి అందం మరింత ఇనుమడిస్తుంది.

నరసింహస్వామి పుణ్యక్షేత్రం..

బొగత జలపాతం వద్దనే నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ప్రతి అదివారం ఇక్కడికి వందలాదిమంది భక్తులు వస్తుంటారు. మామూలు రోజుల్లో విహారయాత్రికుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా సెలవుదినాల్లో రద్దీ ఎక్కువ. వివిధ దేవుళ్ల మాలలు ధరించిన భక్తులు ఈ నరసింహస్వామి సన్నిధిలోనే పూజలు చేసుకుంటారు. మహిమగల దేవుడిగా ఈ నరసింహస్వామి ప్రసిద్ధి. స్థానికుల కొంగు బంగారంగా కీర్తి గడించాడు. ఈ ప్రాంత ప్రజలకు ఇది పిక్నిక్‌ స్పాట్‌గా కూడా గుర్తింపు పొందింది. స్కూల్‌ విద్యార్థులు, ఉద్యోగుల నుంచి అధికారులు సైతం ఈ బొగత జలపాతాన్ని సందర్శించడానికి, నరసింహస్వామిని దర్శించుకోవడానికి క్యూ కడుతుంటారు. రోజంతా గడిపి పరవశించి పోతుంటారు … కొలిచిన వారి కొంగు బంగారంగా నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. బొగత పర్యాటకులు నరసింహ స్వామిని దర్శించుకొని తిరిగి వెళుతుంటారు.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది… బొగతను తెలంగాణ ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు పలుమార్లు జలపాతం దగ్గర సౌకర్యాలను పరిశీలించారు. బొగతను టూరిస్టు స్పాట్‌గా తీర్చిదిద్దడానికి, పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించడానికి నివేదికలు రూపొందించారు. ప్రభుత్వం బొగత జలపాతాన్ని ఐదో తరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గోదావరి నది పైన బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి చేయడంతో ఇప్పుడు హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి నగరాలకు బొగత మరింత చేరువ అయింది..

ఇరుకు గదుల్లో ఉక్కపోత జీవితాల నుంచి ఉపశమనం పొందాలంటే బొగత లాంటి అద్భుత జలసౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. మరి ఇంకెందుకు లేటు? వీలుంటే ఈ వీకెండే బొగత టూర్‌ ప్లాన్‌ చేసుకోండి.

– ముత్యాల యుగంధర్‌

Other Updates