రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తున్నదని, అధికారులు అంకిత భావంతో పనిచేయడం వలనే ఇది సాధ్యమవుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డిలో జూన్ 21న కలెక్టర్లు, ఎస్పీ, డిఎఫ్‌ఓలు, హౌసింగ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. హడ్కో లాంటి సంస్థలు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చాయి. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు, నూతన పారిశ్రామిక విధానానికి మంచి ఆదరణ లభించింది. చాలా మంది కేంద్రమంత్రులు, నాయకులు నాతో మాట్లాడినప్పుడు మన పథకాల గురించి ప్రస్తావించి, ప్రశంసించారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలకు మంచి పేరు వచ్చింది. మంచి ఉద్దేశ్యంతో చేసే పనులకు భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది’’ అని అన్నారు.
ఈ సమావేశంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారుతో సి.ఎం. సమీక్షించి, తగు ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం (ప్రాణహిత) పథకానికి, యాదగిరిగుట్ట వరంగల్ రహదారి విస్తరణ కోసం అవసరమైన భూసేకరణ, భూ కొనుగోలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు.
అనాథపిల్లల చదువు
పదవ తరగతి వరకు అనాథ పిల్లల చదువు, వసతి కోసం ఏదో ఒక ఏర్పాటు ఉన్నప్పటికీ, పదవ తరగతి తర్వాత వారి కోసం ఏమి చేయాలనే విషయంపై సీరియస్‌గా ఆలోచించాలరన్నారు. తల్లిదండ్రులు లేని అనాథలకు ప్రభుత్వమే అమ్మా, నాన్నలా చూసుకోవాలన్నారు. జిల్లాల వారిగా అనాథ పిల్లల వివరాలు సేకరించాలని, వారి కోసం ఏమి చేయాలనే విషయం కూడా ఆలోచన చేయాలన్నారు.
అనాథ పిల్లల కోసం ఎంత ఖర్చయినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని ముఖ్యమంత్రి అన్నారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక హాస్టళ్లు కాకుండా, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలోనే వారిని పంపాలని సిఎం అన్నారు. అనాథ పిల్లలకు ఏమి చేయాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తున్నదని, అధికారులు కూడా తగిన సూచనలను చేయాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నగరంలో ఏ దిక్కూలేని వారు తలదాచుకోవడానికి షెల్టర్ షెడ్స్, నైట్ షెల్టర్స్ నిర్మించాలని సిఎం చెప్పారు. నగరంలో దాదాపు 20 లక్షల మంది ఫుట్‌పాత్‌లపై, రైల్వే ప్లాట్‌పార్మలపై, బస్‌స్టాండ్లలో, ఇతర ప్రదేశాల్లో పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గృహ నిర్మాణం
బలహీన వర్గాలు, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో రెండు బెడ్ రూముల ఇల్లు కట్టించాలని నిర్ణయించామని, ఒకసారి ఒక కుటుంబానికి ఇల్లు సమకూరితే, అది కనీసం రెండు తరాలకు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు దశల వారీగా కట్టాలని సిఎం అన్నారు.
ప్రపంచంలో, దేశంలో మరెక్కడా లేని విధంగా 560 చదరపు అడుగు విస్తీర్ణంలో ఐదు లక్షల నాలుగు వేల రూపాయల వ్యయంతో ఒక్కో ఇల్లు నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఐడిహెచ్ కాలనీలో ఇలాంటి ఇండ్లు నిర్మించిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. అయితే సిమెంట్, స్టీల్ పైన వ్యాట్ ఎత్తివేయడం, తక్కువ ధరలకు ఇసుక అందివ్వడం, కాంట్రాక్టర్లకు వ్యాట్ మినహాయింపు ఇవ్వడం లాంటి చర్యల ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, మరిన్ని ఎక్కువ ఇండ్లు తక్కువ సమయంలోనే నిర్మించడం సాధ్యం అవుతుందని సిఎం అన్నారు. రేట్లు తగ్గించే విషయంలో సిమెంట్, స్టీల్ ఫ్యాక్టరీ యజమానులతో ప్రభుత్వం చర్చిస్తుందని సిఎం చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 50 వేల ఇండ్లు నిర్మిస్తామని, ఇప్పటికే వరంగల్, మహబూబ్‌నగర్ నగరాలకు ఇచ్చిన హామీ మేరకు ఎక్కువ ఇండ్లు ఇస్తామని సిఎం చెప్పారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా మొదటి ఏడాది ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిఎం సూచించారు. వ్యవసాయదారులుండే ప్రాంతాల్లో ఇండిపెండెంటు ఇండ్లు, వ్యవసాయేతర పనులు చేసే వారు నివసించే పట్టణ ప్రాంతాల్లో జి+1 లేదా, జి+2 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో గృహనిర్మాణానికి ప్రత్యేక పద్ధతి అవలంబించాలరన్నారు. లేఅవుట్ చేసిన స్థలాలున్న చోట ఇళ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం అధికారులకు సూచించారు.
- వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌ల కు కేజీ వీల్స్ అమర్చడం వల్ల రహదారులు పాడవుతున్నాయని, కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లు తిరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, కొత్తగా వేసిన రోడ్లు ఏడాది తిరగకుండానే పాడవుతున్నాయనే విషయం ప్రజలకు చెప్పాని సిఎం కోరారు.
- తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు నడపకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో కట్టుదిట్టం చేయగానే, పరిసర ప్రాంతాలకు, ఇతర పట్టణాలకు, ఫామ్ హౌజ్‌కు క్లబ్బులు తిరుగుతున్నాయని సిఎం అన్నారు. ఎక్కడా పేకాట ఆడకుండా సిఐ, ఎస్‌ఐ వరకు అందరినీ అప్రమత్తం చేయాలని చెప్పారు.
- జూలై 3 నుండి 10 వరకు ‘తెలంగాణకు హరిత హారం’ వారోత్సవం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
- హైదరాబాద్ నగర చుట్టుపక్కల కనీసం మూడు ప్రాంతాల్లో చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణానికి స్థల సేకరణ జరపాలని ముఖ్యమంత్రి రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లను కోరారు.
- ఖరీఫ్ సీజన్‌లో రైతుకు అండగా వుండాలనీ, కల్తీ ఎరువులు, పురుగు మందులు, సరఫరా చేసే వారి విషయంలో కఠినంగా వుండాలని సిఎం చెప్పారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరారు. మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.