magaసాహిత్యం, సంగీతం అభినయం-ఇట్లా అన్ని కళలు కలిస్తే ‘సినిమా’! సినిమాను ప్రధానంగా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. అది ‘కళ’-‘వ్యాపారం’ కూడా! ఇరవైనాలుగు కళా, నైపుణ్య విభాగాల్లో అనేకమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ-చిత్ర పరిశ్రమ. అదేవిధంగా వినూత్న ధోరణులతో కళాకారుల సృజన వ్యక్తీకరణకు ప్రధాన సాధనం కూడా ‘సినిమా’యే!

పెట్టుబడిపెట్టి సినిమాలు తీసే నిర్మాతలు లాభాలు కోరుకుంటారు. టిక్కెట్టుకొని సినిమా చూసే ప్రేక్షకులు వినోదం, వినోదంతోపాటు కొంత సామాజిక ప్రయోజనం కోరుకుంటారు. సినిమా తీసేవారికి-సినిమా చూసేవారికి నడుమ ప్రభుత్వ పాత్ర ఏముంటుంది? అనే సందేహం రావచ్చు. చాలామందికి సాధారణంగా ప్రభుత్వాలు వినోదపు పన్ను వసూలు చేస్తాయి. సినిమావారి ఫంక్షన్లకు అనుమతులిస్తాయి. ప్రభుత్వ పెద్దలు కూడా అతిథులుగా హాజరవుతారు. ఇదంతా మామూలుగా జరిగేదే!

కానీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అవగాహన-కళలపట్ల, సాహిత్యంపట్ల, సినిమా పట్లా-సుస్పష్టం’. ఉద్యమ నాయకుడు తెలంగాణ జాతికి స్వయంపాలన సాధించినవాడూ, తానే స్వయంగా రచయిత కనుక, కళా విభాగాలను ఆయన ‘పాలన’లో అంతర్భాంగానే చూస్తున్నారు. కళాకారులు పడే కష్టాలు, వారు సృజించిన కళారూపాల ప్రభావాలు ముఖ్యమంత్రికి సంపూర్ణంగా తెలుసు. చిత్ర పరిశ్రమ సుస్థిరంగా వుండాలి. తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. అందరికీ చేతి నిండా పని దొరకాలి. అట్లనే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రజల మనోభావాలు సినిమాల్లో ప్రతిబింబించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ మరింత ఎదగాలి. తెలుగు సినిమాలో ‘తెలంగాణ’ మరింత వికసించాలి.

అందుకే ప్రభుత్వం అనేక ప్రోత్సాహక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఐదు షోలు ప్రదర్శించుకునే అవకాశం, థియేటర్లు దొరకక సినిమాల విడుదలలు ఆగిపోకూడదని మినీ థియేటర్ల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా తెలంగాణ ప్రముఖుల పేర అవార్డులు ప్రకటించడం వంటివి ఇందులో ఉన్నాయి.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సింహ’ అవార్డులు, ఉత్తమ చిత్రాల నిర్మాణ సంస్కృతిని ప్రోత్సహించడంలో ‘సింహ’భాగంలో నిలుస్తాయి. అత్యుత్తమ చలనచిత్రాల నిర్మాణ దుర్గానికి ‘సింహ’ ద్వారం తెరిచి, అద్భుత ప్రతిభ చూపిన సినిమా కళకారులను ప్రతిష్ఠాత్మకమైన కళా ‘సింహా’సనంపైన కూర్చుండబెడతాయి.

భారతీయ సినిమాకు ఆభరణంగా నిలిచిన మన తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్‌. సమైక్య పాలనలో గుర్తింపుకు నోచుకోని ఈ మహాకళాకారుని పేరిట ‘పైడి జయరాజ్‌ జాతీయ చలనచిత్ర బహుమతి’ని కొత్తగా ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అఖిలభారత స్థాయి ప్రాతిపదికగా, భారతీయ చలనచిత్రరంగం ఉన్నతికీ, అభివృద్ధికీ అసమాన సేవలు అందించిన చలనచిత్ర ప్రముఖునికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 5 లక్షల రూపాయల నగదు, బంగారు సింహ, సన్మానపత్రం అందజేస్తారు. మరో తెలంగాణ ప్రముఖ నటులు కాంతారావు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల అజరామర కథా నాయకుడు. ”కాంతారావు” పేరిట ‘కాంతారావు చలనచిత్ర బహుమతి’ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతియేటా తెలుగు చలనచిత్రరంగం ఉన్నతికి, అభివృద్ధికీ అసమాన కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖునికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు క్రింద 5 లక్షల రూపాయల నగదు, బంగారు సింహ మరియు సన్మానపత్రం అందజేస్తారు. అదేవిధంగా ఎన్నో అద్భుత పాత్రల్లో జీవించి, చిత్ర సీమ కార్మికుల చిరకాల స్వప్నమైన ‘చిత్రపురి’కి శ్రీకారం చుట్టిన కీ||శే|| డా|| యమ్‌. ప్రభాకర్‌రెడ్డి పేరిట ”డా|| ప్రభాకర్‌రెడ్డి ఉత్తమ కుటుంబ కథా చిత్రం” అవార్డు కూడా వుంది.

ప్రభుత్వం కొనసాగిస్తున్న సాంప్రదాయక అవార్డులకు ఇవి అదనం. ఈ నూతన ప్రోత్సాహకాల ఫలితంగా తెలంగాణ సినిమాపరంగా అత్యుత్తమస్థాయిలో సృజన జరగాలనేది అందరి ఆకాంక్ష. ‘తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ విభజన చట్టం ప్రకారం పూర్తిస్థాయిలో ఏర్పడ్డాక, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహకాలు, చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరెన్నో వరాలు ప్రకటించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉన్నది.

‘మన దేశం మనకేం చేస్తుంది అని కాకుండా మన దేశానికి మనమేం చేస్తున్నాం?’ అన్నది ముఖ్యమని పెద్దలంటారు. తెలంగాణ ప్రభుత్వం మనకేం చేస్తుంది అనే ఆలోచన అవసరంలేదు. అన్నీ తెలిసిన ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మనకు అండగా వున్నారు. అయితే మన జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో మన తెలంగాణను సాధించుకున్నాం. బంగారు తెలంగాణ దిశగా పరిపాలన సాగుతోంది. మరి ఈ పాలనా ఫలితాలను మనం ‘సినిమా’ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నామా అన్నది అసలైన ప్రశ్న!

మన దేశంలోనే ఆదర్శవంతంగా రైతులకు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఒకనాడు రైతులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు మనకు తెలుసు. కానీ ఈ రోజు ప్రతీ రైతు ఆత్మ గౌరవంతో వ్యవసాయాన్ని ప్రభుత్వ సాయంతో పండుగలా చేసుకుంటున్న సందర్భాలు ఏర్పడ్డాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కళ్యాణమస్తు, షాదీ ముబారక్‌-ఇలా ఎన్నో మారిన సామాజికాంశాలు మన తెలుగు సినిమా కథాంశాలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర నివాసరమేర్చరచుకొని పెద్ద సినిమాలు నిర్మిస్తున్న పెద్ద, చిన్న నిర్మాతలు, దర్శకులు, గీత రచయితలు, నటీనటులు, పెద్ద మనసుతో తమ సినిమాల్లో ‘మారిన తెలంగాణ సామాజిక పరిస్థితులను’ సన్నివేశరూపంగానో, పాటలు, మాటల రూపంగానో కాస్తంత చోటు కల్పిస్తే-తెలంగాణ సమాజం సంతోషపడుతుంది. అలాంటి సినిమాలను సంపూర్ణంగా ఆదరిస్తుంది.

నేను ‘కొమురం భీం’ సినిమా తీసినప్పుడు విడుదలకోసం అష్టకష్టాలు పడ్డాను. విడుదల చేయడానికికే 18 ఏళ్ళు పట్టింది. అయితే విడుదలైన ప్రతిచోటా 100 రోజులు ఆడడంతో ఆ కష్టాన్ని మరచిపోయాను. సినిమాలు తీసేవారికి ఇకముందు అలాంటి కష్టాలు వుండవనీ, తెలంగాణ రాష్ట్రంలో ‘సినిమా’కు బంగారు రోజులు రాబోతున్నాయనీ, (ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో) సీఎం చెప్పిన ప్రణాళిక విన్న తరువాత సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. ‘బంగారు తెలంగాణ’లో సినిమా అన్నిరకాలుగా అభివృద్ధి చెందుతుంది. సామాజిక ప్రయోజనాన్ని సాధించే కళాత్మకరూపంగా, అనేకమందికి ఉపాధి కల్పించే అతి పెద్ద పరిశ్రమగా! సంకేతాత్మక సన్నివేశాలతో అలరారే ‘సినిమా’కు అద్భుత భవిష్యత్తు వుందని ఇప్పటికే ఎన్నో సంకేతాలు ఇచ్చింది మన ప్రభుత్వం!

శ్రీ అల్లాణి శ్రీధర్‌

Other Updates